పెళ్లి కాకుండా ఒకే గదిలో ఉంటున్న, ఉండాలనుకున్న జంటలు ఎగిరి గంతేసే తీర్పు మద్రాస్ హైకోర్టు ఇచ్చింది. ఈ తీర్పుతో స్త్రీ, పురుషులు ఏకాంతంగా గడిపేందుకు పెళ్లి అయినవారే కానవసరం లేదు. అవివాహిత జంట ఒకే గదిలో ఉండటం నేరమని చట్టంలో చెప్పలేదని ఆ తీర్పు సారాంశం.
వీకెండ్స్లోనూ లేదా ఏదైనా పనిపై ఇతర ఊళ్లకు వెళ్లినప్పుడు అవివాహిత జంటలకు లాడ్జీల్లో ఒకే గది ఇచ్చేందుకు నానా యక్షప్రశ్నలు వేస్తుంటారు. పైగా పోలీసుల రైడ్స్ జరిగితే ఇటు లాడ్జీ యజమాని, అటు ఆ జంటల తిప్పలు మాటల్లో చెప్పలేం. కేసులు, కోర్టులు అంటూ పోలీసులు బెదిరిస్తూ భారీగా సొమ్ము చేసుకోవడాన్ని కథలుకథలుగా వింటున్నాం.
సరిగ్గా ఇలాంటిదే తమిళనాడులోని ఓ లాడ్జీలో చోటు చేసుకొంది. కోయంబత్తూరులోని ఓ లాడ్జీలో ఒకే గదిలో అవివాహిత జంట, పక్క గదిలో మందుబాటిళ్లు ఉన్నాయనే కారణంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. దీన్ని సవాల్ చేస్తూ సదరు లాడ్జీ యజమాని హైకోర్టును ఆశ్రయించాడు.
ఈ కేసుపై విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఎంఎస్ రమేష్ పోలీసుల వాదనతో ఏకీభవించలేదు. అంతేకాదు పెళ్లికాని స్త్రీ, పురుష జంట ఒకే గదిలో ఉంటే నేరమని ఏ చట్టంలో ఉందని ప్రశ్నించారు. సహజీవనాన్ని నేరంగా ఎలాగైతే పరిగణించలేమో, లాడ్జీ గదిలో అవివాహిత జంట ఉండడాన్ని కూడా నేరంగా చూడలేమని ఆయన స్పష్టం చేశారు.
ఈ తీర్పు ఏకాంతంగా గడపాలనుకుంటున్న జంటలకు, ఇతరత్రా వారికి కూడా ఎంతో ఊరటనిచ్చేదని చెప్పవచ్చు.