సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) తీర్పు ఇచ్చింది. అదే ఇక ఫైనల్. సుప్రీంకోర్టు తీర్పుని ఎవరైనాసరే తప్పు పట్టకూడదంతే. కావాలంటే, ఇంకోసారి అప్పీల్ చేసుకోవచ్చు. మళ్ళీ మళ్ళీ సుప్రీంకోర్టులోనే సవాల్ చేసుకోవచ్చు. అంతే తప్ప, ప్రధాన మంత్రి అయినాసరే, ఇంకెవరైనాసరే న్యాయస్థానం ఇచ్చే తీర్పులకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఇదీ న్యాయవ్యవస్థ గురించి గొప్పగా చెప్పే మాట.
కానీ, జరుగుతున్నదేంటి.? మొన్న కావేరీ జలాల రగడ, ఇప్పుడు జల్లికట్టు వివాదం. అసలేం జరుగుతోంది.? న్యాయ వ్యవస్థపై నమ్మకం సడలిపోతోందా.? న్యాయవ్యవస్థ అంటే విశ్వాసం కోల్పోతున్నామా.? అసలు న్యాయవ్యవస్థని గౌరవించడం మర్చిపోతున్నామా.? ఇలా సవాలక్ష ప్రశ్నలు, దేనికీ సమాధానం దొరకడంలేదు.
బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్, తప్పతాగి ఓ వ్యక్తి చనిపోవడానికి కారణమయ్యాడు. అక్కడ ఓ వ్యక్తి చనిపోవడం నిజం. ఏళ్ళ తరబడి నడిచిన ఆ కేసులో సల్మాన్‌ఖాన్‌కి క్లీన్ చిట్ లభించింది. జయలలిత అక్రమాస్తుల కేసులో ఓ న్యాయస్థానం ఆమెను దోషిగా తేల్చితే, ఇంకో న్యాయస్థానం ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది. మళ్లీ సల్మాన్‌ఖాన్ విషయానికి వస్తే, అక్రమ ఆయుధాల వినియోగంలోనూ, అంతకు ముందు కృష్ణ జింకల్ని వేటాడిన కేసులోనూ క్లీన్‌చిట్ లభించింది. వేల కోట్లు దోచేసినోళ్ళేమో ముందు దోషులుగా తేలతారు, ఆ తర్వాత నిర్దోషులుగా బయటపడ్తారు. ఇలాంటి చాలా కేసుల్లో షరామామూలుగా విన్పించే మాట 'బెనిఫిట్ ఆఫ్ డౌట్'. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిందితులకు క్లీన్ చిట్ ఇచ్చే వ్యవహారమే ఇది.
ఇంత క్లియర్‌గా న్యాయవ్యవస్థలో లొసుగులు కన్పిస్తున్నప్పుడు, ఆ న్యాయవ్యవస్థపై గౌరవం ఎలా వుంటుంది.? కావేరీ జలాల విషయంలో సుప్రీం తీర్పుని కర్నాటక రాష్ట్రం గౌరవించకపోవడానికి ఇది కూడా ఓ కారణం కావొచ్చు. జల్లికట్టు పుణ్యమా అని తమిళనాడు ఇప్పుడు అట్టుడికిపోతోంది. ఈ పరిణామాలు ఖచ్చితంగా న్యాయవ్యవస్థకు పెను సవాల్ విసురుతున్నాయని చెప్పక తప్పదు.
ఇక్కడ, ఇంకో ముఖ్యమైన విషయం గురించి కూడా చర్చించుకోవాలి. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయి, రెండున్నరేళ్ళయ్యింది.. దానికి సంబంధించిన కేసులు ఇంకా ఇంకా నలుగుతూనే వున్నాయి. 'ఏ సమయంలో స్పందించాలో మాకు తెలుసు..' అని వ్యాఖ్యానించే న్యాయస్థానాలు, పుణ్యకాలం పూర్తయ్యాక స్పందిస్తే ఉపయోగమేంటట.? ఓ ప్రజా ప్రతినిథి గెలుపుపై కోర్టులో కేసు నమోదైతే, టెర్మ్ ముగిశాక తీర్పులొస్తున్నాయి. అందుకే, మొత్తంగా న్యాయవ్యవస్థ పట్ల విశ్వాసం సన్నగిల్లుతోంది.
ప్రస్తుతం చెన్నయ్‌లో ఓ వైపు సముద్రం, ఇంకో వైపు జన సంద్రం.. అన్నట్టుగా జల్లికట్టు అనుకూల నినాదాలు మార్మోగాయి. దీనర్థమేంటి.? న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా జల్లికట్టు మద్దతుదారులు నిలబడ్డారనుకోవాలా.? ఇలాగైతే, భవిష్యత్తులో న్యాయవ్యవస్థను గౌరవించేదెవరు.?