పవన్ కల్యాణ్.. పవర్‌లెస్ స్టార్..

‘‘మీ సపోర్ట్ కావాలి సార్ అని అడిగాను. నేను చాలా బిజీ అన్నాడు. పర్లేదు మీ కటౌట్ పట్టుకెల్తే పని జరుగుద్ది అన్నాను. అందుకే దీన్ని పట్టుకొచ్చా. కంటెంట్ ఉన్నోడి కటౌట్ ఉంటే చాలు……

‘‘మీ సపోర్ట్ కావాలి సార్ అని అడిగాను. నేను చాలా బిజీ అన్నాడు. పర్లేదు మీ కటౌట్ పట్టుకెల్తే పని జరుగుద్ది అన్నాను. అందుకే దీన్ని పట్టుకొచ్చా. కంటెంట్ ఉన్నోడి కటౌట్ ఉంటే చాలు… మిమ్మల్నందరినీ జిప్పుడకిడి జిప్పుడకిడి జిప్పుడకిడి చెయ్యడానికి’’

ఇదీ ఇటీవలి పవన్‌కల్యాణ్ బ్లాక్‌బస్టర్ గబ్బర్‌సింగ్‌లో హీరోగారి స్టామినా గురించి బ్రహ్మానందం చెప్పే డైలాగు ఇది. ఇలాంటి డైలాగు వినిపించినప్పుడు అభిమానులు విజిల్స్ కొట్టడం సహజం. బాగానే ఉంటుంది. కానీ ఈ డైలాగును జనం నమ్మి.. ‘కంటెంట్ ఉన్న వాడి కటౌట్’ను పెట్టుకుని పోరాటానికి వెళితే ఏమవుతుంది? ఈ డైలాగును  ఆయనే నమ్మి.. తాను ప్రత్యక్షంగా రంగంలోకి దిగకపోయినా సరే.. తన మాట వినని వారు జిప్పుడకిడి జిప్పుడకిడి జిప్పుడకిడి అయిపోతారనుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు ఏపీ కొత్త రాజధాని అమరావతి విషయంలో అదే జరుగుతోంది. పవర్‌స్టార్ హూంకరిస్తున్నారు. రైతులకు అనుకూలంగా తాను పోరాడుతాను అంటున్నారు. 

అటువైపు రైతులు, పవన్ అభిమానులు ఆయన ఫోటో ఉన్న ఫ్లెక్సిలు పట్టుకుని ధర్నాలు చేసేస్తున్నారు. పైన చెప్పుకున్నట్టు ఆయన బిజీ కనుక.. ఆయన బ్యానర్‌లే నడిపిస్తున్నాయి. కానీ.. గవర్నమెంటు జిప్పుడకిడి అయిపోవడం లేదు. ఎందుకని?

‘పవర్’ ఎరీనా చాలా చిన్నదే!

పవన్ కల్యాణ్ సినిమాల ద్వారా పవర్‌స్టార్ బిరుదును అభిమానుల వద్ద స్థిరపరచుకోవడం ఆయనకు అనాయాసంగా లభించినదేమీ కాదు. వైవిధ్యమైన చిత్రాలు చేయడమూ, ప్రేక్షకులను మెప్పించగల చక్కటిచిత్రాలు చేయడం ద్వారా మాత్రమే.. పవన్, పవర్‌స్టార్ అయ్యారు. మెగాస్టార్ తమ్ముడిగానే ఆయనకు ఇండస్ట్రీలో ఎంట్రీ లభించిన మాట వాస్తవం. కానీ.. లభించిన అవకాశాన్ని నిలబెట్టుకోవడానికి ఆయనకు ‘మెగా’ ఇమేజి ఉపకరించలేదు. వరుసఫ్లాప్‌లు దెబ్బకొట్టాయి. అక్కడినుంచి తనను తాను పవర్‌స్టార్‌గా  తీర్చిదిద్దుకోవడానికి పవన్‌కల్యాణ్ చాలా కష్టపడ్డారు. సినిమాల ఎంపిక, వాటిని తీర్చిదిద్దడలో తన భావజాలాన్ని కూడా కలపడం ఇలా అనేక రకాలుగా ఆయన చేయగలిగిన అన్ని పనులూ చేశారు. సినిమా అనే ఫార్మాట్గలో ఉన్నప్పుడు ఎన్ని పనులు చేసినా సరే.. హిట్ అనేది ఒక్కటే కొలబద్ధ. పవన్ కల్యాణ్‌కు కొన్ని హిట్‌లు కూడా వచ్చాయి. ఆ తరువాత.. సీరియల్‌గా కొన్ని ఫ్లాప్‌లు కూడా వచ్చాయి. వరుసగా చాలా ఫ్లాప్‌లు వచ్చినా కూడా ఆయన సినిమాలకు ఓపెనింగ్‌లు ఎప్పుడూ దెబ్బతినలేదు. పవన్ కల్యాణ్ దారుణమైన సినిమాలకు కూడా ప్రారంభ కలెక్షన్లు హిట్ రేంజిలోనే ఉండేవి. ఆ రకంగా తాను సినిమాల్లో పవర్‌స్టార్‌నే అని ఆయన నిరూపించుకున్నారు. ఒకరకంగా.. పవన్‌కల్యాణ్ ఒక పరిమితమైన పీరియడ్‌లో యూత్‌కు ఏకైక ఆరాధ్య హీరోగా కూడా వెలిగిపోయారంటే అతిశయోక్తి కాదు. 

కానీ ఈ ‘పవర్’ ఇమేజి  గురించి ఆయనకు భ్రమలు ఎక్కువైపోయాయి. తాము దైవాంశ సంభూతులమని చెప్పుకునే కొందరు బాబాలు.. నిజంగానే అలాంటి భ్రమలో బతుకుతుంటారని… ప్రజలను మోసం చేస్తున్నామనే సృ్పహ వారికి ఉండదని మానసిక శావేత్తలు విశ్లేషిస్తుంటారు. అంటే ‘‘లార్జర్ దేన్ లైఫ్ (యాక్చువల్) సైజ్..’’ భ్రమ అన్నమాట. పవన్ కల్యాణ్ కూడా తన సినిమా బిరుదు ‘పవర్’కు సంబంధించి అలాంటి లార్జర్ దేన్ యాక్చువల్ సైజ్ భ్రమలోకి వెళ్లిపోయారు. తన పవర్ యొక్క ఎరీనా చాలా చిన్నదని.. అది సినిమాలకు మాత్రమే పరిమితం అని ఆయన గుర్తించలేకపోయారు. తాను చేగువేరా బొమ్మను తన సినిమాల్లో ప్రమోట్ చేస్తుంటాడు గనుక.. తన బొమ్మను యూత్ మొత్తంఐకాన్‌గా భావిస్తుందనే భ్రమలోకి వెళ్లారు. ఆ భ్రమ ఆయనను ‘తాను విధిగా ప్రజాజీవితంలోకి వెళ్లవలసి ఉన్నదనే ఊహతో’ రాజకీయాల వైపు నడిచేలా చేసింది. 

ప్రజారాజ్యంలో ఎందుకు పనిచేయలేదు!

పవన్‌కల్యాణ్ అచ్చంగా తిరుగులేని పవర్‌స్టార్ అనుకుందాం. మరి ఆ పవర్ 2009 ఎన్నికల సమయంలో ఏమైంది. ఒక మెగాస్టార్ సామ్రాజ్యాన్ని సృష్టించడంలోనూ, ‘అన్నయ్య’కు ఈ ‘తమ్ముడు’ చక్రవర్తిత్వాన్ని పట్టాభిషేకింపచేయడంలోనూ ఎందుకు పనిచేయకుండా పోయింది. 2014 ఎన్నికల కంటె అప్పట్లో చాలా చాలా పవర్‌ఫిల్లింగ్ చేసిన డైలాగులే ఆయన నోటినుంచి వచ్చాయి. కాంగ్రెస్ నాయకులను పంచెలూడదీసి తరిమికొట్టాలని ఆయన దూకుడుగా చెప్పిన మాటలు ఏకంగా.. అప్పటికి విపరీతమైన జనాదరణ కలిగి ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని ఉద్దేశించినవి కాదని ఎవరైనా అనగలరా?

‘యువరాజ్యం’ అంటూ తానొక సామంతరాజ్యాన్ని తనే సృష్టించుకుని ఆయన రాష్ట్రమంతా చాలా కష్టపడి తిరిగారు. ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేశారు. పవర్‌స్టార్ వస్తే.. భారీ రెచ్చగొట్టే డైలాగుల్ని ఎన్నికల ప్రసంగాల్లో సంధిస్తే.. రెచ్చిపోయి విజిల్స్ వేసిన జనం.. ఊరూరా ఎన్నికల ప్రచార వాహనం మీద పవర్‌స్టార్‌ను చూడగానే కేరింతలు కొట్టిన జనం.. ఎగబడి వచ్చి ఆయనను చూసిన జనం.. అంతా ఇళ్లకు వెళ్లిన తర్వాత.. ఆయన చెప్పిన మాటల్ని మరచిపోయారు. ఫలితం ఏమైందో అందరికీ తెలుసు. సినిమాల్లో ప్రూవ్ అయిన ‘పవర్’ ఇక్కడ జీరో అని తేలిపోయింది. 

అపశ్రుతుల్తో మొదలైనా.. అందలమెక్కించారు..

పవర్‌స్టార్ ప్రజాజీవితంవైపు తన ప్రస్థానం ప్రారంభించినప్పుడు.. ఆదిలో ఎదురైనది అన్నీ అపశ్రుతులే. అవి ఎంతగా ఆయన ఈగోను దెబ్బకొట్టాయంటే.. 2009 ఎన్నికల తర్వాత అసలు పవన్‌కల్యాణ్ చాలా కాలం పాటూ సమాజానికి మొహం చూపించలేకపోయారు. బహుశా.. తన మాటలను నమ్మకుండా పోయిన ఈ సమాజం మొహం చూడకూడదని కూడా ఆయన అనుకుని ఉండవచ్చు. అయితే 2014లో ఎన్నికల వేళకు పవన్‌కల్యాణ్ మళ్లీ ప్రజాజీవితం అంటూ జనం ముందుకు వచ్చారు. ఈసారి అన్నయ్యను తన భుజాల మీదికి ఎక్కించుకోవడం కాదు.. తనే పార్టీ పెడుతున్నా అంటూ ప్రకటనలతో వచ్చారు. కానీ.. ఆ పార్టీ ప్రకటనల్లో తప్ప.. వాస్తవంలో పురుడుపోసుకోలేదు. దానికి ఇప్పటిదాకా బొడ్డూడలేదు. 

కాకపోతే.. తన మొహానికి కాషాయం లేదా పచ్చరంగు పులుముకోవడానికి కొద్దిగా సంకోచం అనిపించి.. ఆపద్ధర్మంగా పార్టీ పెడుతున్నా అనే మాట ద్వారా పవన్‌కల్యాణ్ ఎన్నికలకు సిద్ధం అయ్యారు. ‘ప్రస్తుతానికి టైం లేదు’ అనే మాట ద్వారా పార్టీని ఉట్టిమీద దాచి.. మోడీని, చంద్రబాబును మించిన వారు లేరంటూ.. వారి తరఫున బాకా ఊదడానికి, వారిని తన భుజాల మీద ఎక్కించుకుని ఊరేగడానికి ఆయన సిద్ధపడ్డారు. 

(కొత్త) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు 2014  ఎన్నికలు చాలా కీలకమైనవి. అప్పుడే రాజధాని కూడా లేని బికారిలాగా రాష్ట్రం ఏర్పడుతున్నది. పాలనలోకి రాబోయే వారి బాధ్యత ఎక్కువ. దేశంలో మోడీ హవా కనిపిస్తున్నది. రాష్ట్రంలో చంద్రబాబుకు భాజపాతో పొత్తు ఉన్నప్పటికీ.. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం ఉధృతంగా కనిపిస్తున్నది. ఇలాంటి కీలక సమయంలో ప్రభావితం చేయగల కీలకమైన, పరిమితమైన ఓట్లను ప్రభావితం చేయడంలో పవన్‌కల్యాణ్ బాగా ఉపయోగపడ్డారు. రాష్ట్రంలో పవన్ ఎఫెక్ట్ కొంత పనిచేసి.. చాలా సీట్లలో నామ్‌కేవాస్తే మెజారిటీలతో మొత్తానికి చంద్రబాబు గద్దె ఎక్కారు. మెగాస్టార్ రెండోదఫా ఎన్నికల బరిలోకి వేరే పార్టీ తరఫున వస్తే.. ఛీకొట్టిన జనం, పవర్‌స్టార్ అదేమాదిరిగా రెండో దఫా వేరే పార్టీల తరఫున ప్రచారానికి వస్తే.. ఆదరించారు. ఆ రకంగా ఆయన ‘పవర్’కు కాస్త ఊపిరులూదారనే చెప్పుకోవాలి. 

కానీ తాను మాత్రం పార్టీ ల తరఫున కాకుండా.. నిత్యం ప్రజల తరఫునే ఉండి పోరాడుతానని చెప్పిన పవన్ కల్యాణ్ మాటలు మాత్రం డొల్లగా పలుమార్లు తేలిపోయాయి. 

కొత్త అనుమానాలు పుడుతున్నాయి

తాను సపోర్ట్ చేసి గద్దె మీదికి తీసుకువచ్చిన చంద్రబాబు నాయుడు ఏడాది కాలంలో ఏం పనులు చేశారో, వాటన్నింటినీ పవన్‌కల్యాణ్ సమర్థిస్తారో లేదో తెలియదు. కానీ.. కనీసం ఈ ప్రభుత్వం ఏయే పనులు చేసిందో ఆ సృ్పహ అయినా ఆయనకు ఉన్నదో లేదో తెలియదు. ఏదేమైనప్పటికీ చంద్రబాబునాయుడు ఈ ఏడాదిలో కొత్త రాధాని అమరావతి అనే పాట తప్ప మరొకటి పాడడం లేదు. అదేమని ప్రశ్నిస్తే.. రైతురుణమాఫీ చేసేసా.. అని అంటున్నారు. అది కూడా పూర్తిగా చేయలేదని. చేసేది కాదని అందరికీ తెలుసు. ఇలాంటి ఏ అంశాల మీద  కూడా పవన్‌కల్యాణ్ తన అభిప్రాయాల్ని చెప్పడం కానీ, ప్రజలకు ఎలా మేలు జరగాలో మాట్లాడడం కానీ జరగలేదు. 

పదో షెడ్యూలు లోని సంస్థల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లిప్త ధోరణి వల్ల ఆంధ్రప్రదేశ్‌కు ఎంత నష్టం జరుగుతున్నదో పవన్‌కల్యాణ్ ఎన్నడైనా ఆలోచించారా? ఇవాళ అంబేద్కర్ సార్వత్రిక, తెలుగు విశ్వవిద్యాలయాల్లో ఎడ్మిషన్లు జరుగుతోంటే.. ఆంధ్రప్రదేశ్‌కు అందులో చోటు లేదు. అవి పూర్తిగా తెలంగాణ ఆధీనం అయిపోయాయి. ఏపీ సర్కారు తమ యువతకు దేక్క అవకాశాల కోసం కనీసం న్యాయపోరాటం చేసేలా కేసు కూడా వేయలేదు. విద్యార్థులే హైకోర్టు న్యాయమూర్తికి లేఖలు రాసుకుంటే.. వాటిని సూమోటోగా స్వీకరించిన ఆయన ఈ వ్యవహారాన్ని విచారిస్తున్నారు. ఆయా విశ్వవిద్యాలయాల్ని విభజించుకుని ఏపీ కోసం ఏర్పాటు చేసుకోవడం తర్వాతి సంగతి, ప్రస్తుతానికి ఎడ్మిషన్లలో ఏపీకి చెందిన యువతరానికి అన్యాయం జరగకుండా ఒక నిర్ణయం తీసుకురావడం గురించి కూడా పట్టించుకోని ప్రభుత్వానికి ఈ యూత్ ఐకాన్ అనుకునే పవర్‌స్టార్ ఏం దిశానిర్దేశం చేయదలచుకున్నారు. 

ఈ వ్యవహారాలన్నీ గమనిస్తే.. పవన్‌కల్యాణ్‌లో తెలుగుదేశం పార్టీ పట్ల వల్లమాలిన అనురాగం, ప్రేమాభిమానాలు ఉన్నాయని ప్రజలకు కొత్త అనుమానాలు కలుగుతున్నాయి. ఏదో యనమల రామకృష్ణుడు వ్యాఖ్యలకు రిటార్టులు ఇవ్వడమూ, వెనుక నుంచి కీ తిప్పి నడిపిస్తున్న వాడు చంద్రబాబునాయుడు అని తనకు ఎంచక్కా తెలిసినప్పటికీ.. తెలుగుదేశం ఎంపీకు సిగ్గు లేదా? అని తీవ్రస్థాయిలో తూలనాడి.. అక్కడికేదో తాను తెలుగుదేశాన్ని ఎండగట్టేసినట్టు.. తనకు తాను మురిసిపోవడమూ.. ఇవన్నీ పవర్‌స్టార్ నటనా వైదుష్యానికి మచ్చుతునకలు అనుకోవాలి. ఎందుకంటే అదే ప్రెస్‌మీట్‌లో ఓటుకునోటు వ్యవహారం మీద అభిప్రాయం చెప్పమంటే.. ఆయన ఇబ్బంది పడిన తీరు, తెదేపా మీద ప్రేమకు తార్కాణం. 

కోవర్ట్ అని విమర్శకులంటున్నారు..

ఇది చాలా పెద్ద విమర్శ. చాపకింద నీరులాగా.. ఒక వైపు తుళ్లూరు రైతుల తరఫున పోరాడుతా.. భూసేకరణ చట్టాన్ని ప్రయోగించడం కరెక్టు కాదు. దీనికి వ్యతిరేకిస్తూ పోరాడుతా.. అని మాటలు చెబుతున్న పవన్‌కల్యాణ్ కొంపదీసి వారి వెంట ఉన్నట్లుగా నటిస్తూ.. అంతిమ ఫలితం ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చేట్లు కోవర్ట్ ఆపరేషన్ నడిపిస్తున్నారా అనే అతిభయంకరమైన అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి. 

తొలినుంచి పవన్ కల్యాణ్ ఈ విషయంలో జోక్యం చేసుకున్న క్రమాన్ని గమనించాలి. తుళ్లూరు ప్రాంతంలో రాజధాని వస్తుందని చంద్రబాబు ప్రకటించిన తర్వాత, ల్యాండ్‌పూలింగ్ విధివిధానాలు వెల్లడైన తర్వాత.. కొందరు రైతులు స్వచ్ఛందంగా ఇవ్వడానికి ఒప్పుకుంటే.. కొందరు ససేమిరా అన్నారు. పచ్చటి పంటలు పండే నేలలు కాంక్రీట్ నిర్మాణాలకు ఇవ్వబోము గాక ఇవ్వబోం అంటూ భీష్మించుకున్నారు. అలాంటి వారికి పవన్‌కల్యాణ్ మద్దతు ఇచ్చాడు. తాను ఆ ఊర్లకు వెళ్లి.. వారితో కూర్చుని… తన ఎదుట ఏడ్చిన వారిని ఊరడించి.. వారితో మాట్లాడి వచ్చారు. ఊరడించి వచ్చారు. వారి తరఫున తాను చంద్రబాబునాయుడుతో మాట్లాడుతానని చెప్పారు. మాట్లాడారు. అయితే రిజల్టు మాత్రం సున్నా. 

చంద్రబాబు నిర్ణయంలో ఏమీ మార్పు రాలేదు. ఇప్పుడు చట్ట ప్రయోగం కూడా జరిగింది. ఇప్పుడు మళ్లీ కొన్ని రోజులుగా చట్టప్రయోగం తప్పు అంటూ పవన్ ట్వీట్లు వదులుతున్నారు. యనమల వంటి ఔత్సాహికులు ఆయన్ను మరింత రెచ్చగొడితే.. రెచ్చిపోయి ప్రతివిమర్శలు కూడా చేస్తున్నారు. 

ఇంతకూ పవర్ అంటే ఏమిటి?

గతంలో మనం సూపర్‌స్టార్ గురించి చెప్పుకున్నాం. సూపర్‌స్టార్ అంటే ఏమిటి? సినిమా బాగుంది.. బాగాలేదు అనే పాయింటుతో నిమిత్తం లేకుండా.. ఒక రేంజి హిట్ కలెక్షన్లను సాధిస్తేనే అతను సూపర్‌స్టార్‌కింద లెక్క. ‘పవర్’ అనేది కూడా అలాంటిదే. సినిమాల్లో పవర్‌స్టార్ అనే బిరుదులో ఏ కొలబద్ధ మీదనైనా పిలుచుకోవచ్చు గానీ.. రాజకీయాల్లో పవర్‌స్టార్ అనిపించుకోవాలంటే.. బలం ఉన్న వాళ్లకు లేనివాళ్లకు ఎవరికి మద్దతిచ్చినా కూడా… గెలిపించి తీరగల సత్తా ఉన్నవాడే ఇక్కడ పవర్‌స్టార్. ప్రజల తరఫున పోరాడుతానని ప్రతిజ్ఞ చేసినప్పుడు.. వారి కోరికను తీర్చగలిగేలా ప్రభుత్వం మెడలు వంచగలిగిన నాడే అతను పవర్‌స్టార్. అంతే తప్ప.. పవర్ ఫుల్ ట్వీట్లు సంధిస్తేనో.. పవర్‌ఫిల్‌డ్ ప్రెస్‌మీట్లు పెట్టి, విలేకర్ల ప్రశ్నల్ని ఎవాయిడ్ చేసి వెళ్లిపోతేనో కుదర్దు. ఆ సంగతి హీరో పవన్‌కల్యాణ్ తెలుసుకోవాలి. 
పవన్ సినిమాల్లో ‘పవర్‌స్టార్’ .. అనడంలో తిరుగులేదు!

రాజకీయాల్లో ‘ప్రజల స్టార్’ కావాలంటే తీరుమారక తప్పదు!!

సురేష్

[email protected]