సినిమాల్లో నటిస్తాడు…కాని రీమేక్‌ కాకూడదట…!

సాధారణంగా ఎవరైనా సరే రాజకీయ నాయకుల గురించి మాట్లాడాలనుకుంటే వారి రాజకీయాల గురించే మాట్లాడతారు. సినిమా తారల గురించి మాట్లాడాలనుకుంటే వారి సినిమాల గురించే మాట్లాడకుంటారు. కాని పవన్‌ కళ్యాణ్‌ గురించి మాట్లాడుకునేటప్పుడు ఆయన…

సాధారణంగా ఎవరైనా సరే రాజకీయ నాయకుల గురించి మాట్లాడాలనుకుంటే వారి రాజకీయాల గురించే మాట్లాడతారు. సినిమా తారల గురించి మాట్లాడాలనుకుంటే వారి సినిమాల గురించే మాట్లాడకుంటారు. కాని పవన్‌ కళ్యాణ్‌ గురించి మాట్లాడుకునేటప్పుడు ఆయన రాజకీయాల గురించి, సినిమాల గురించి మాట్లాడుకోవల్సివస్తోంది. అదే ఈ పవర్‌స్టార్‌ కమ్‌ జనాసేనాధిపతి ప్రత్యేకత. తాను పూర్తిగా రాజకీయ నాయకుడినేనని పవన్‌ చెప్పుకుంటాడు. తాను ఇక సినిమాల్లో నటించనని ఈయన అంటాడు. కాని సినిమా వాళ్లే ఆయన మళ్లీ సినిమాల్లో నటిస్తాడని, కథలు సిద్ధం చేస్తున్నామని అంటారు. 

శివుడిని అర్ధనారీశ్వరుడని (సగం ఆడ, సగం మగ) చెప్పుకున్నట్లుగా పవన్‌ కళ్యాణ్‌ సగం సినిమా హీరోగా, సగం రాజకీయ నాయకుడిగా ఉన్నాడనుకోవాలి. 2019 ఎన్నికలకు కొద్దికాలం ముందు వరకు ఆయనను పార్ట్‌టైమ్‌ రాజకీయ నాయకుడని కొన్ని పార్టీల నాయకలు విమర్శించేవారు. కాని ఆ తరువాత ఆయన తాను ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలని, అవుతానని నమ్మకం పెంచుకొని పూర్తి సమయం రాజకీయాలకు కేటాయించి ఎన్నికల్లో పోటీ చేశాడు. సరే….తానొకటి తలచిన దైవమొకటి తలచింది అన్నట్లుగా తయారైంది పరిస్థితి. అప్పటి నుంచి మళ్లీ సినిమాల్లో పవన్‌ రీఎంట్రీ గురించి వార్తలు మీడియాలో రావడం మొదలైంది. ఇలా వార్తలు వచ్చి..వచ్చి హిందీ చిత్రం 'పింక్‌' తెలుగు రీమేక్‌లో హీరోగా నటిస్తున్నట్లు దాదాపుగా కన్‌ఫర్మ్‌ అయింది. 

ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు 'అవును…పవన్‌తో సినిమా చేస్తున్నా' అని  ఈమధ్య ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లియర్‌కట్‌గా చెప్పాడు. ఇంత పెద్ద నిర్మాత ఊరికే సరదాగా చెప్పడు కదా అని ఎవరైనా అనుకుంటారు. పవన్‌ కళ్యాణ్‌తో సినిమా తీయాలనేది తన చిరకాల వాంఛని, అది నెరవేరబోతోందని దిల్‌ రాజు స్పష్టం చేశాడు. హిందీలో విజయవంతమైన 'పింక్‌' చిత్రాన్ని రీమేక్‌ చేస్తున్నాడు. దీనికి వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తాడు. పవన్‌ కళ్యాణ్‌ డేట్లు ఖరారు కావల్సివుందని, అది కాగానే పూర్తి వివరాలు చెబుతానని దిల్‌ రాజు చెప్పాడు. ఈయన చెప్పిందాన్నిబట్టి పవన్‌ ఓకే చెప్పినట్లుగానే ఉంది. 

పవన్‌ పింక్‌ రీమేక్‌లో నటిస్తున్నట్లు తెలుగు సినిమా ఇండస్ట్రీతోపాటు బాలీవుడ్‌లోనూ భారీగా ప్రచారం జరిగింది. దీని ఒరిజినల్‌ హిందీ కావడం, తెలుగు సినిమా నిర్మాతల్లో ఒకరు హిందీ నిర్మాత బోనీకపూర్‌ కావడంతో బాగా హైప్‌ వచ్చింది. ఇక సినిమా షూటింగ్‌ ప్రారంభం కావడమే తరువాయి అనుకుంటున్న దశలో ఆ సినిమా తాను చేయనని పనవ్‌ చెప్పాడని ఓ సమాచారం. పింక్‌ అనే సినిమా హిందీలో ఘన విజయం సాధించిన సినిమా కాబట్టి అందరికీ తెలిసిపోయిన కథ అని, కాబట్టి దాని రీమేక్‌లో చేయనని పవన్‌ అన్నాడని తెలసుస్తోంది. అయితే దీన్ని దర్శక నిర్మాతలు ధ్రువీకరించలేదు. పవన్‌ ఇప్పటివరకూ ఏమీ మాట్లాడలేదు. ఆయన సినిమాల్లో నటించడానికి వ్యతిరేకి కాదుగాని ఒరిజినల్‌ తెలుగు కథై ఉండాలని అంటున్నాడట…! 

పవన్‌ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడే ఆయనతో సినిమాలు తీయడానికి దర్శకనిర్మాతలు కథలు సిద్ధం చేసుకొని రడీగా ఉన్నట్లు వార్తలొచ్చాయి. వీరు ప్రత్యేకంగా పవన్‌ కోసమే కథలు తయారుచేసుకున్నారు. కాని పవన్‌ ఏమీ చెప్పలేదు. తాను సినిమా రంగానికి స్వస్తి చెప్పానని పార్టీ పెట్టి ప్రజల్లోకి వచ్చిన కొత్తల్లో  పవన్‌ చెప్పాడు. ఎన్నికల సమయంలో జనసేనలోని కొందరు నాయకులు సోదరుడు నాగబాబుతో సహా పవన్‌ను ఆకాశానికి ఎత్తేశారు.  ఆయన్ని దైవాంశసంభూతుడిలా కీర్తించారు. నాగబాబు పవన్‌ గురించి మాట్లాడుతూ ''పవన్‌ కళ్యాణ్‌గారిలా గొప్ప విజన్‌ ఉన్న నాయకులు అరుదుగా ఉంటారు. 

ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో గొప్ప మార్పు వచ్చింది. భవిష్యత్తులో కూడా మంచి మార్పులు మనం చూడబోతున్నాం' అన్నాడు. కాని పవన్‌ విజన్‌ ఏమిటో ఇప్పటివరకు ఎవరికీ అర్థం కాలేదు. ఆయన వల్ల రాజకీయాల్లో వచ్చిన మార్పు ఏమిటంటే 2014లో ఆయన ఎన్నికల్లో పోటీ చేయనప్పుడు టీడీపీ అధికారంలోకి రాగా, 2019 ఎన్నికల్లో ఆయన పోటీ చేయగానే టీడీపీ అధికారం కోల్పోయింది. టీడీపీని అధికారంలోకి తెచ్చింది తానేనని పవన్‌ చాలాసార్లు చెప్పాడు. మరి ఆ తరువాత అధికారం కోల్పోయేలా చేసింది కూడా ఆయనేనని అనుకోవాలా?