ఫిబ్రవరి 14 వచ్చేస్తోంది.. మామూలుగా అయితే ఫిబ్రవరి 14వ తేదీ కోసం ప్రేమికులు చాలా ప్లాన్స్ వేసేసుకుంటుంటారు. ఖరీదైన బహుమతులు కొనాలి.. లవర్‌ని ఏదో ఒక రకంగా సర్‌ప్రైజ్ చెయ్యాలి.. ఇంత తతంగం వుంది. కానీ, గత కొన్నాళ్ళుగా ప్రేమికుల దినోత్సవం అనగానే బిక్కు బిక్కుమంటూ ప్రేమికులు గడపాల్సిన పరిస్థితులేర్పడ్డాయి.
‘పార్కుల్లో కన్పించారో.. పెళ్ళి చేసేస్తాం..’ అంటూ వీహెచ్‌పీ, భజ్‌రంగ్‌దళ్, శ్రీరామ్‌సేన.. వంటి సంస్థల ప్రతినిథులు ప్రేమికులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ‘ప్రేమించుకునేది పెళ్ళి కోసమే కదా.. ఇష్ట పూర్వకంగానే ప్రేమించుకుంటున్నప్పుడు పెళ్ళి చేసుకోడానికి ఇబ్బంది ఏముంటుంది.? మీ పెద్దలు ఒప్పుకోవట్లేదా.. భయం లేదు.. మేమే పెళ్ళి పెద్దలం.. పెళ్ళి చేసేస్తాం..’ అంటూ పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. ఆ దెబ్బకి ప్రేమికులు పార్కుల వైపు చూడ్డం మానేశారు ప్రేమికుల రోజున.
ఈ ఏడాది కూడా ప్రేమికులకు హెచ్చరికలు షురూ అయిపోయాయి. ‘పార్కుల్లో జంటగా కన్పిస్తే పెళ్ళి తప్పదు.. మీ పెద్దల్ని కూడా తీసుకొచ్చి పెళ్ళి చేసేస్తాం..’ అని హెచ్చరించేశారు ఆల్రెడీ వీహెచ్‌పీ, భజ్‌రంగ్‌దళ్ ప్రతినిథులు.
ప్రేమించడం తప్పా? ఒప్పా? ప్రేమ పేరుతో పార్కుల్ని పడక గదులుగా మార్చేయడం ఎంతవరకు సబబు.? ఇలాంటి ప్రశ్నలు అనేకం వున్నాయి ప్రేమ చుట్టూ. నిజమైన ప్రేమ త్యాగానికి వెనుకాడదు. కానీ, ప్రేమ పేరుతో అకృత్యాలు జరుగుతున్నాయి, హత్యలు చోటు చేసుకుంటున్నాయి.. ప్రేమ పేరుతో జరుగుతున్న నానా వికృతాల్నీ చూస్తున్నాం. పార్కులకు వెళ్ళాలంటే కామోద్రేకంలో ఏ ప్రేమ జంట ఏ స్థితిలో కన్పిస్తుందో తెలియని పరిస్థితి. కానీ అందరు ప్రేమికులూ ఒకేలా వుండరు కదా. నిజమైన ప్రేమ కూడా వుంటుందంటారు ప్రేమలో మునిగి తేలుతున్నోళ్ళు.
ఎవరి వాదనలు వారివి. ప్రేమ పేరుతో పార్కుల్లో అసభ్య కార్యకలాపాలకు దిగడం తప్పు. ప్రేమ పేరుతో వంచించడం తప్పు. ప్రేమ పేరుతో దాడులు చేయడం, ప్రాణాలు తీయాలనుకోవడం తప్పు. అలాగే, బలవంతంగా పెళ్ళిళ్ళు చేయాలనుకోవడమూ అంతకన్నా పెద్ద తప్పు. అయినా ఏం చేయలేం.. స్వతంత్ర భారతావనిలో ఎవరి గోల వారిదే.!