ఎవరి ‘పొత్తు’ ప్రచారం నిజమవుతుందో…!

దేశంలో ఎక్కడ చూసినా రాజకీయ పార్టీల పొత్తులకు సంబంధించిన కబుర్లే. థర్డ్‌ ఫ్రంటు, ఫెడరల్‌ ఫ్రంటు, మహాకూటమి…వగైరా మాటలు వినబడుతున్నాయి. జాతీయస్థాయి రాజకీయాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఫ్రంటు, రాష్ట్రాల్లో అధికార పార్టీలకు వ్యతిరేకంగా…

దేశంలో ఎక్కడ చూసినా రాజకీయ పార్టీల పొత్తులకు సంబంధించిన కబుర్లే. థర్డ్‌ ఫ్రంటు, ఫెడరల్‌ ఫ్రంటు, మహాకూటమి…వగైరా మాటలు వినబడుతున్నాయి. జాతీయస్థాయి రాజకీయాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఫ్రంటు, రాష్ట్రాల్లో అధికార పార్టీలకు వ్యతిరేకంగా కూటములు ఏర్పడుతున్నాయి. ఏర్పడబోతున్నాయి. వీటిల్లో పవిత్ర కూటములు, అపవిత్ర పొత్తులు, అనైతిక కలయికలు…ఇలా బొచ్చెడు రకాలున్నాయి. ఇదంతా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నడుస్తోంది.

ఎవరు ఎవరితో పొత్తు కడతారో, అది ఎన్నికల ముందు జరుగుతుందో, ఎన్నికల తరువాత జరుగుతుందో తెలియదుగాని కొన్ని పార్టీల మధ్య లింకులపై జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారాల లక్ష్యం ఒకరినొకరు బద్నాం చేసుకోవడమే. ఏపీలో చూస్తే…బీజేపీ, వైకాపా, జనసేన ఒక్కటయ్యాయని, జగన్‌, పవన్‌ రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీ డైరెక్షన్‌లో నడుస్తున్నారని చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. దీనికి ప్రతిగా ప్రతిపక్షాలు టీడీపీకి, కాంగ్రెసుకు లింకు అంటగట్టాయి.

బాబు కాంగ్రెసుతో అంటకాగుతున్నారని, రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన పార్టీతో చేతులు కలిపారని బీజేపీ, వైకాపా, జనసేన దాడి చేస్తున్నాయి.  కర్నాటకలో కుమారస్వామి ప్రమాణస్వీకారానికి వెళ్లిన చంద్రబాబు ప్రతిపక్షాల ఐక్యత గురించి అక్కడ నాయకులతో మాట్లాడటం, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీతో కలివిడిగా ఉండి, నవ్వుకుంటూ  కరచాలనం, భుజం తట్టడం చేయడంతో టీడీపీ-కాంగ్రెసు ఒక్కటవుతున్నాయనే ప్రచారం జోరందుకుంది.

అదేవిధంగా తెలంగాణలో టీడీపీ-కాంగ్రెసు పొత్తుపై ప్రచారం సాగుతోంది. పైకి చూస్తే అన్ని పార్టీలు ఒకదానికొకటి ప్రత్యర్థులే. అలాగని ఎప్పటికీ అలాగే ఉండవు. అవసరమైతే పొత్తులు పెట్టుకోక తప్పదు. అది ఎప్పడన్నదే ప్రశ్న. ఈమధ్య కర్నాటక రాజకీయ పరిణామాలు చూశాక మెజారిటీ సీట్లు వచ్చిన పార్టీయే తప్పక అధికారం చేపట్టనక్కర్లేదని, ఎన్నికల తరువాత పొత్తులు పెట్టుకొని అధికారం దక్కించుకోవచ్చనే నమ్మకం ఏర్పడింది. తెలంగాణలో కేసీఆర్‌, ఏపీలో చంద్రబాబులను అధికారంలోకి రాకుండా చేయాలంటే ఎన్నికల తరువాత పొత్తులు పెట్టుకోవాలని పార్టీలు అనుకుంటున్నాయి.

అందుకే బలం తక్కువగా ఉన్న పార్టీలు సైతం కింగ్‌మేకరో, కింగో కావచ్చని ఆశపడుతున్నాయి. తెలంగాణలో టీడీపీ నేతలు ఇలాగే అంటున్నారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెసులకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీ రాదని, ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే తమ మద్దతు అవసరమవుతుంది కాబట్టి టీడీపీ కింగ్‌ మేకర్‌ అవుతుందని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. కాంగ్రెసు, టీడీపీ పొత్తు పెట్టుకుంటే అధికార పార్టీని ఓడించవచ్చంటున్నారు. టీడీపీకి కాంగ్రెసుతో తెలంగాణలో పెద్దగా శత్రుత్వం లేదు.

ఇక ఏపీలో బాబును అధికారంలోకి రానివ్వకుండా చూసేందుకు ఎన్నికల తరువాత బీజేపీ, వైకాపా. జనసేన ఒక్కటి కావొచ్చేమో…! లేదా బీజేపీ, జనసేన కలవొచ్చు. జనసేనతో పొత్తుపై అప్పుడే ఏపీ బీజేపీ నాయకులు కామెంట్లు చేస్తూనే ఉన్నారు. ఆ పార్టీతో పొత్తుపై హైకమాండ్‌ నిర్ణయం తీసుకుంటుందని ఓ నాయకుడు చెప్పాడు. జగన్‌తో కలవడానికీ అభ్యంతరం ఉండకపోవచ్చు. వైకాపా అధికారంలోకి రాకుండా ఉండటానికి టీడీపీ-కాంగ్రెసు  కలవొచ్చు.

ఆ పరిస్థితి వస్తే చంద్రబాబు వెనకాడరు. కర్నాటకలో బద్ధశత్రువులైన కాంగ్రెసు, జేడీఎస్‌ కలిసి సర్కారు ఏర్పాటు చేశాయి కదా. బీజేపీ అధికారంలోకి రాకూడదనే లక్ష్యంతోనే అతి తక్కువ స్థానాలున్న జేడీఎస్‌కు ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసింది. రాజకీయాల్లో ఏదీ విచిత్రం కాదు. ఇందుకు తెలుగు రాష్ట్రాలూ అతీతం కావు.