పుడమి తల్లికి కోపం.. మనదే పాపం.!

పుడమి తల్లికి కోపమొస్తే.? ప్రకృతి ప్రకోపిస్తే.? భూకంపాలు పెను విధ్వంసాలు సృష్టిస్తాయి.. పెను తుపాన్లు ఊడ్చేస్తాయి.. అగ్ని పర్వతాలు బద్దలైపోతాయి.. అచ్చంగా 2012 సినిమాలా వుంటుంది ఆ ఉత్పాతం. సినిమాలో దర్శకుడు ఏం ఊహించాడో,…

పుడమి తల్లికి కోపమొస్తే.? ప్రకృతి ప్రకోపిస్తే.? భూకంపాలు పెను విధ్వంసాలు సృష్టిస్తాయి.. పెను తుపాన్లు ఊడ్చేస్తాయి.. అగ్ని పర్వతాలు బద్దలైపోతాయి.. అచ్చంగా 2012 సినిమాలా వుంటుంది ఆ ఉత్పాతం. సినిమాలో దర్శకుడు ఏం ఊహించాడో, ఎలా ఊహించాడోగానీ.. అచ్చ అలాంటి విధ్వంసాలే ఒకదాని తర్వాత ఒకటి చూస్తున్నాం.

ఒకప్పటి సమత్రా సునామీ.. ఆ తర్వాత ఇటీవలే సంభవించిన జపాన్‌ సునామీ.. ఆ తర్వాత ఎన్నో హరికేన్లు.. తాజాగా నేపాల్‌ని వణికించిన తీవ్ర భూకంపం.. ఇవన్నీ మానవ తప్పిదాలే అనలేంగానీ, మానవాళి ప్రకృతిని సర్వనాశనం చేస్తుండడం వల్ల దాని ప్రభావం ఎంతో కొంత మనిషి మీద పడ్తోందన్నది కాదనలేని వాస్తవం. హరికేన్లు.. తుపాన్లు.. ఇవి ఖచ్చితంగా మానవ తప్పిదాలే. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులతోనే ఈ తుపాన్ల ముప్పు మానవాళికి శాపంగా మారింది.

భూకంపాలు.. వాటి ద్వారా వచ్చే సునామీల కారణంగా కలిగే విధ్వంసం కన్నా, మనిషి స్వయంకృతాపరాధాల వల్ల ఆ విధ్వంసాలు పదింతల నష్టాన్ని కలిగిస్తోందన్నది కాదనలేని వాస్తవం. చమురు కోసం ప్రపంచ దేశాలు ఎక్కడ బడితే అక్కడ పుడమి తల్లి గుండెకు తూట్లు పొడిచేస్తున్నాయి. వేల మీటర్ల లోతుకు తవ్వేస్తూ.. భూమి పొరల్లో అలజడిని సృష్టిస్తున్నాయి. 

ఎక్కడిదాకానో ఎందుకు, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, గోదావరి బేసిన్‌.. ఆ ప్రాంతంలోని సముద్ర తీరంలో చమురు అన్వేషణనే తీసుకుంటే, తవ్వకాల కారణంగా భూములు గుల్లగా తయారైపోయాయి. సముద్రపు నీరు కోస్తా తీరంలోకి చొచ్చుకు వచ్చేస్తోంది. తద్వారా ప్రకృతి సమతౌల్యత దెబ్బతింటోంది. క్రమక్రమంగా భూమిపైకి దూసుకొచ్చేస్తోంది సముద్రం. దాంతో చిన్నపాటి తుపాన్లకే తీరం అతలాకుతలమైపోతున్న పరిస్థితి.

ఇది కాకుండా సాధారణ అవసరాల కోసం ఎడా పెడా వేస్తున్న బోర్లు కూడా భూమాత గుండెల్లోనే గుచ్చుకుంటున్నాయి. భూమి పొరల్లో సహజంగా వుండే నీటిని తోడేయడం ద్వారా, భూమి పొరల్లో అలజడి మరింత తీవ్రంగా వుంటుంది. ఇప్పటికిప్పుడు వీటి కారణంగా పెద్ద ప్రమాదం లేకపోయినా, భవిష్యత్తులో మాత్రం.. ఇవన్నీ మానవాళికి అత్యంత ప్రమాదకరంగా తయారు కానున్నాయి.

ఏదన్నా ఉత్పాతం సంభవిస్తే, ఆ వెంటనే మనిషి చేసుకున్న పాపమే.. అనే అభిప్రాయాలు సర్వత్రా వెల్లువెత్తుతాయి. శాస్త్రవేత్తలు వాస్తవాల్ని ప్రజల ముందు పెడ్తారు. మీడియా కూడా తనవంతు బాధ్యతగా ప్రజల్ని, ప్రభుత్వాల్ని అప్రమత్తం చేసే పనిలో బిజీగా వుంటుంది. ఆ తర్వాత షరా మామూలే. అవసరాల్ని కాదనలేం. కానీ, అంతిమంగా మనిషి మనుగడ ముఖ్యం కదా. నీటి కోసం వేసే బోర్లు, బొగ్గు తవ్వకాలు, గ్రానైట్‌ క్వారీలు, చమురు బావులు, సముద్ర తీరంలోని ఖనిజాల కోసం జరిపే తవ్వకాలు.. ఇవన్నీ పుడమి తల్లిని ఛిద్రం చేసేస్తున్నాయి. మనం నిలబడే నేలనే మనం సర్వనాశనం చేసేసుకుంటోంటే, అసలు మనకు భవిష్యత్‌ ఎలా వుంటుంది.?

చంద్రుడి మీద నివాసం కోసం ప్రయత్నాలు చేస్తున్నాం.. అది చాలదని అంగారకుడి మీదకూ వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం.. అక్కడి వాతావరణం అనుకూలంగా వుండదని తెలిసీ వేల కోట్లు, లక్షల కోట్లు వెచ్చించి పరిశోధనలు చేస్తున్నాం. కానీ, అన్ని విధాల అనుకూలంగా వున్న పుడమి తల్లిని ఛిత్రం చేస్తున్నాం. మనిషి ఆలోచనలు మారనంతవరకు పుడమి తల్లి ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తూనే వుంటుంది. తెగే దాకా లాగితే, తెగిపోతుంది.. పుడమి తల్లిని కాపాడుకోలేకపోతే.. మానవాళి అంతమైపోతుంది. ఆ రోజు ఎప్పుడు.? అన్నది మన చేతుల్లోనే వుంది. కాస్త ఆలోచిద్దాం ఇకనైనా.!

సింధు