రాజధానిపై అంత మోజెందుకు..!?

ఇదంతా పాలకుల వక్ర నీతి వల్లనే అభివృద్ధి వికేంద్రీకరణతోనే పరిష్కారం ప్రాంతీయ విద్వేషాలు తలెత్తితే అసలుకే మోసం Advertisement రాజధాని అన్నది ఇపుడు ఓ స్వర్గధామమైపోయింది. అది తమ జిల్లాలోనే ఉండాలి, తమ ఊరి…

ఇదంతా పాలకుల వక్ర నీతి వల్లనే
అభివృద్ధి వికేంద్రీకరణతోనే పరిష్కారం
ప్రాంతీయ విద్వేషాలు తలెత్తితే అసలుకే మోసం

రాజధాని అన్నది ఇపుడు ఓ స్వర్గధామమైపోయింది. అది తమ జిల్లాలోనే ఉండాలి, తమ ఊరి పక్కనే ఉండాలి. ఆ స్వర్గంలో తమకూ చోటుండాలన్న తాపత్రయం అందరిలోనూ పెరిగిపోతోంది. నిజానికి రాజధాని అంటే కేవలం ఓ పరిపాలనా కేంద్రం. రాజు అన్నవాడు ఎక్కడో ఓ చోట నుంచి పాలించాలి కాబట్టి ఎంచుకున్న పట్టణమో, నగరమో అవుతుంది అది. అంతమాత్రం చేత ఆ రాజ్యంలో మిగిలిన ప్రాంతాలు ఎందుకూ పనికిరాకుండా పోతాయనా..లేక అవి ఆ రాజ్యంలో లేవనా.. పూర్వం రాజులు పాలించే కాలంలో రాజధాని సమస్య ఎక్కడా వచ్చినట్లుగా చరిత్రలో దాఖలాలు లేవు. రాజధానిపై మోజు పెంచే వ్యాపారాలు, కలలతో కాసులు రాల్చుకునే బడా బాబులు రంగ ప్రవేశం చేశాకే ఈ సమస్య వచ్చిపడింది. నిజానికి రాజధాని అని పేర్కొన్న ప్రాంతానికి ప్రత్యేకంగా కొమ్ములు ఉండనక్కరలేదు, ఆర్భాటాలు అంతకంటే అవసరం లేదు, చాలా చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేసి చూడడం, చూపించడం మన రాజకీయ జీవులకు అలవాటు అయిపోయింది, దానికి రాజకీయ వ్యాపారులు, రియల్ వ్యాపారులు కూడా వంత పాడడంతోనే చిక్కంతా వస్తోంది. ఇపుడు ఆంధ్రప్రదేశ్‌కు ఓ రాజధాని అర్జంటుగా కావాలి. అది ఎక్కడ ఉండాలి అన్నది అంతా కలసి కూర్చుని తేల్చుకోవాలి. అంతే తప్ప, నేను అనుకున్నట్లుగా రాజధాని ఏర్పాటుచేస్తాను, అక్కడే సమస్తం కుమ్మరిస్తాను అంటూ గతంలో చేసిన తప్పులు చేసుకుంటూ పోతే మరో విభజన వాదం అతి సమీపంలోనే తలెత్తే ప్రమాదం పొంచి ఉందన్న వాస్తవాన్ని ఎవరూ మరచిపోకూడదు.

ఆది నుంచి అదే సమస్య…

ఏ ముహూర్తాన ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి వేరుపడిందో కానీ, ఆంధ్రప్రదేశ్‌కు మొదటి నుంచి రాజధాని సమస్య పట్టి పీడిస్తూనే ఉంది. ఇప్పటికి సరిగ్గా అరవై ఏళ్ల క్రితం నుంచి కూడా ఉనికి కోసం పాట్లు పడుతూనే ఉంది. చక్కని రాజధాని నిర్మాణం చేసుకునే సామర్ధ్యం, సత్తా ఉన్నా కూడా స్వార్ధం, సంకుచితత్వం, నీచ రాజకీయాల మూలంగా ఆంధ్రప్రదేశ్ ఈ దుస్థితికి చేరుకుంది. 1953లో ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించినపుడు మద్రాస్‌ను ఉమ్మడి రాజధానిగా కావాలన్నారు. అప్పటి ముఖ్యమంత్రి రాజాజీ ససేమిరా అన్నారు. నెహ్రూ సైతం సవతి ప్రేమనే చూపించారు. ఫలితంగా ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా తొలిసారి అవమానభారాన్ని తెకత్తుకుంది. అప్పట్లోనూ విజయవాడ, కర్నూలు రాజధాని కోసం పోటీ పడ్డాయి. దేశంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ రాజ్యం కావడం, ఆ పార్టీలో రెడ్డి సామాజికవర్గం ప్రాబల్యం అధికంగా ఉండడం వల్ల వారి మాట నెగ్గింది. అంతే కాదు, విజయవాడలో రాజకీయ ఆధిపత్యం  అప్పట్లో వామపక్షాల చేతులలో ఉండడం నాటి ప్రధాని నెహ్రూకు సుతరామూ ఇష్టంలేదు. వారి ఆధ్వర్వంలో అక్కడే రాజధాని ఉంటే కాంగ్రెస్‌కు ఇంతే సంగతులని తొలి ప్రధాని భావించడం కూడా కర్నూలు వైపు మొగ్గు చూపే అవకాశం ఏర్పడింది. మొత్తం మీద కర్నూలులోని గుడారాలలో మూడేళ్ల పాటు గడిపిన తరువాత మన రాజకీయ స్వార్ధ జీవులు హైదరాబాద్‌పై కన్నేశారు. పెద్ద మనుషుల ఒప్పందం పేరుతో విశాలాంధ్రను ఏర్పాటుచేసి మరీ హైదరాబాద్‌ను రాజధానిగా అప్పనంగా సాధించామనుకున్నారు. కానీ, ఆ తెలివి తెల్లారినట్లేనన్న సంగతి పదమూడేళ్లలోపే రుజువైంది. 1969లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం, ఆ తరువాత 1972లో జై ఆంధ్ర ఉద్యమం సమైక్యాంధ్ర ఆయుర్దాయం ఎంతటిదో చెప్పకనే చెప్పాయి. అయినా సరే నాడు వేరుపడే ఆలోచన చేయకపోవడం ఓ తప్పు. మొత్తం మీద నలభై రెండు సంవత్సరాల తరువాత ఆంధ్రప్రదేశ్ గత్యంతరం లేని పరిస్థితులలో విడిపోవాల్సివచ్చింది. ఇంతకాలం ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన సీఎంల జాబితా చూస్తే ఆంధ్రప్రదేశ్‌వారే ఎక్కువ. అందునా రాయలసీమ నుంచి వచ్చినవారే అధికం. మరి, పరిపాలనా వికేంద్రీకరణ, దూరదృష్టి వంటివి ఉంటే హైదరాబాద్ సాటి నగరాలను సీమాంధ్రలో గతంలోనే ఏర్పాటుచేసుకుని ఉండేవారు. ఇపుడు రోడ్డున పడ్డాక గానీ తత్వం అర్ధం కావడంలేదు.

విభజన గాయం మానకముందే…

గత ఏడాది ఇవే రోజులలో విభజన సమస్య రాచపుండుగా ఆంధ్రప్రదేశ్‌ను కొరికి తినేసింది. ప్రతీ రోజూ ఏదో ఓ ఉద్యమం, అలజడితో జనానికి మనశ్శాంతి లేకుండా పోయింది. ఎవరేమనుకున్నా చేయాల్సింది చేస్తామన్న తీరులో నాటి యూపీఏ సర్కార్, కాంగ్రెస్ అధినాయకత్వం విభజనను మొరటు కత్తితో చేసేశాయి. తెంగాణాకు హైదరాబాద్‌తో కూడి మరీ ఇచ్చేశాయి. దాంతో, వారికి చక్కని రాజధాని దక్కింది. రాజధాని నగరమైనా చూపించకుండా సీమాంధ్రను వేరుచేశారు. మొక్కుబడిగా శివరామకృష్ణన్ కమిటీని నియమించారు. ఆ కమిటీ నిక్కుతూ, నీల్గుతూ అయిదు నెలలకు ఓ నివేదికను తయారుచేసి కేంద్రం వారికి సమర్పించింది. ఈలోగా బోలెడు రాజకీయ పరిణామాలు సంభవించాయి. కేంద్రంలో యూపీఏ బదులు ఎన్‌డిఓ అధికారంలోకి వచ్చింది. సీమాంధ్రలో టీడీపీ అధికారం దక్కించుకుంది. నిపుణులతో కూడిన శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదిక సైతం స్పష్టత లేకుండా ఉంది. వనరులు ఎక్కడ ఉన్నాయో చెప్పేందుకే పరిమితమైంది. దీంతో, టీడీపీ సర్కార్‌కు మరింత ఊతమిచ్చినట్లైంది. తమ ఇష్టం వచ్చినట్లుగా రాజధానిని పెట్టుకునే అధికారం ఉందని, శివరామకృష్ణన్ కమిటీ ఏం చెబితే తమేకంటన్న ధోరణిలో ప్రభుత్వం వ్యవహరిస్తోంది. తాము మొదటి నుంచి అనుకుంటున్నట్లుగా విజయవాడగుంటూరుల మధ్యలోనే రాజధాని ఏర్పాటుచేస్తామంటోంది. ఈ పరిణామాలు పచ్చి పుండు మీద కారం చల్లినట్లుగానే ఉన్నాయి. ఇటు రాయలసీమలోని నాలుగు జిల్లాలు, అటు ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల ప్రజానీకం ఉసూరుమంటున్నారు. తమకు ఏమీ కాకుండా చేసి అంతా విజయవాడగుంటూరు అంటూంటే చూస్తూ ఊరుకోవాలా అన్న ఆగ్రహం వారిలో పెల్లుబుకుతోంది. శ్రీబాగ్ ఒప్పందాన్ని సీమవాసులు తెరపైకి తెచ్చి ఉద్యమిస్తూంటే, ఉత్తరాంధ్ర ప్రజానీకం తమ మెతకదనాన్ని చూసి ఇలా చేస్తారా అంటూ గుడ్లురుముతున్నారు. ఇపుడు పదమూడు జిల్లాల మధ్య రాజధాని సమస్య చిచ్చు రాజేసింది. మళ్లీ ప్రాంతీయ విద్వేషాలు రగులుతున్నాయి. ఇది ఎటువైపుకు దారితీస్తుందోనన్న ఆందోళన అందరిలోనూ ఉంది.

రాజధానిపై మోజు తగ్గించాలి…

నిజానికి రాజధాని అన్నది భూతల స్వర్గమని, అక్కడ దొరకనిది ఏదీ ఉండదన్న భ్రాంతి, లేక భ్రమలలో ప్రజలు ఉన్నారు. దాని నుంచి ముందు వారిని బయటపడేయాలి. ఆ విధంగా చేయడం పాలకుల చేతులలోనే ఉంది. మరి, వారు ఆ దిశగా చర్యలు తీసుకుంటారా అన్నదే ఇపుడు ప్రశ్న. రాజధాని అంటే ఏమేమి ఉ
ఉండాలి అన్నది కనుక ఆలోచన చేస్తే అసెంబ్లీ ఉండాలి. సెక్రటేరియట్ ఉండాలి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు నివాసాలు ఉండాలి. ఇది చాలు, ఇంతటితో ఆగిపోతే చాలా మంచిది. పరిపాలన సౌలభ్యం కోసం ఈ రకమైన ఏర్పాటు అవసరం కాబట్టి ఇవి తప్పనిసరి. ఇవి కాకుండా వేరే విధమైన అభివృద్ధి అంటే మాత్రం కొత్త రాజధాని సైతం మరో హైదరాబాద్ అయిపోతుంది. శివరామకృష్ణన్ కమిటీ చెప్పినట్లుగా విశాఖలో హైకోర్టు ఏర్పాటుచేయాలి. రాయలసీమలో రైల్వే జోన్ ఉండాలి. అలాగే, ఏ ప్రాంతంలో ఏఏ వనరులు ఉన్నాయో చూసి అక్కడ పరిశ్రమలు, విద్యా సంస్ధలు, ఇతర రంగాలను అభివృద్ధి చేయాలి. మొత్తం మీద చూసుకుంటే పదమూడు జిల్లాలనూ సమాంతరంగా అభివృద్ధిపరచాలి. రాజధానిలో ముఖ్యమంత్రి, మంత్రులు, పరిపాలన కోసమే ఉండాలి, మిగిలిన సమయాలలో వారు కూడా వారి వారి నియోజకవర్గాలలో ఉండేలా చూసుకుంటే వారి విలాసాలకు రాజధానిని అభివృద్ధి చేయాల్సిన అగత్యం తప్పుతుంది. అలాగే, ఉత్తరాంధ్రలో ఐటి హబ్, గిరిజన విశ్వవిద్యాలయం, సినీ పరిశ్రమ వంటివి అభివృద్ధి చేస్తే ఈ ప్రాంత వాసులు రాజధాని అంటే తమదేనని అనుకుంటారు. మనకు చాలా రాజధానులు కూడా వస్తాయి. పరిపాలనా రాజధానిగా మాత్రమే కొత్త రాజధానిని చేస్తే గోదావరి జిల్లాలు వ్యవసాయ రాజధానిగా, సీమ జిల్లాలు ఖనిజ సంపదకు, పరిశ్రమలకు రాజధానిగా అలరారుతాయి. అలాగే, సీమలోనే ఉన్న తిరుపతి అతి పెద్ద పుణ్యక్షేత్రం, ఇది పర్యాటక రాజధానిగా ఎపుడో పేరు తెచ్చుకుంది. అలాగే, విమానాశ్రయాలను సైతం అన్ని ప్రాంతాలకూ సమానంగా ఉండేలా ఏర్పాటుచేసుకుంటే మరీ మంచిది. ఇలా చేయడం వల్ల రాజధానిపై వత్తిడి తగ్గించగలం, తమ ప్రాంతంలోనే ఉపాధి లభ్యమైతే ఏ జనం కూడా వేరే చోటుకు వెళ్లేందుకు ఎటువంటి పరిస్థితులలోనూ ఇష్టపడరు, అంటే వికేంద్రీకరణ మంత్రమే దీనికి సరైన మార్గమన్నమాట. అలాగే, రాజకీయ పరంగా కూడా వైషమ్యాలు చెలరేగకుండా అసెంబ్లీ సమావేశాలను ఓ తడవ సీమలోనూ, మరో తడవ ఉత్తరాంధ్రలోనూ వీలును బట్టి నిర్వహించుకుంటే అక్కడ ప్రజలు సైతం తామూ అన్నింటా భాగస్వాములమయ్యామని ఆనందిస్తారు. ప్రాంతీయ వివాదాలూ సద్దుమణుగుతాయి.

సమన్వయం.. సామరస్యం అవసరం

ఇప్పటికే విభజనతో దారుణంగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్‌కు కొత్త కష్టాలు తెచ్చిపెట్టేలా ఎవరూ వ్యవహరించరాదు. ఎవరికైనా తమ పేరు, ఊరు అంటే చాలా ఇష్టంగానే ఉంటుంది. అంతమాత్రం చేత దానిని రెచ్చగొట్టి రాజకీయాలు చేయడం తగదు. ప్రాంతీయ వైషమ్యాల వల్ల ఎంతటి నష్టం జరిగిందో మనకు తెలిసినంతంగా ఎవరికీ తెలియదు. రాజకీయాల కంటే వందేళ్ల ముందుకు వెళ్లి ఆలోచన చేయడం ముఖ్యం. టీడీపీ సర్కార్ కూడా ఈ విషయంలో సమన్వయంతో ముందుకు సాగాలి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ కూడా ఆ దిశగా ఆలోచన చేయాలి. ఇక, ఓడిపోయింది కదా అని కాంగ్రెస్‌ను, వామపక్షాలను కూడా తీసిపారేయకూడదు. రాజధాని అన్నది అందరి సమస్య. ఇది కేవలం అధికారం కట్టబెట్టారన్న అహంకారంతో తామే అంతా అని టీడీపీ అనుకుంటే పొరపాటే అవుతుంది. అధికారం జనం ఇచ్చింది కేవలం అయిదేళ్లకు మాత్రమే. రాజధాని విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకుంటే అది భావి తరాలకూ ఇబ్బందులను తెస్తుంది. అందువల్ల రాజకీయ పార్టీలతో ముందుగా చర్చలు జరిపి ఏకాభిప్రాయం కాకపోయినా మెజారిటీ అభిప్రాయమైనా తీసుకోవాలి. అలాగే, రాజధాని ఎక్కడ ఏర్పాటుచేసినా పదమూడు జిల్లాలను సమానంగా అభివృద్ధి చేస్తామన్న మాటను టీడీపీ సర్కార్ ఇవ్వాలి. ఆ రకమైన సంకేతాన్ని జనంలోకి పంపాలి. కేంద్రం కూడా ఇది కేవలం రాష్ట్రం సమస్యగా చూడకుండా తాము కూడా చొరవ తీసుకుని పరిష్కారం చూపాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారానే సీమాంధ్రలో రగులుతున్న రాజధాని సమస్యకు పరిష్కారం చూపాల్సిఉంటుంది. ఇక, రాజధాని సమస్య వెనుక రాజకీయ విభేదాలే కావు, సామాజిక, ఆర్ధిక విభేదాలూ ఉన్నాయి. సీమ జిల్లాలలో ఓ సామాజికవర్గం ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది, విజయవాడ, గుంటూరులలో మరో సామాజికవర్గానిది పైచేయిగా ఉంటుంది. ఇలా రెండు సామాజికవర్గాల మధ్య ఘర్షణగా ఈ వ్యవహారం మారితే మరిన్ని ఇబ్బందులు వస్తాయి. అది చివరికి అసలుకే ఎసరు తెస్తుంది. అందువల్ల సామరస్యం ముఖ్యం. అవసరమైతే నిపుణులు, మేధావుల సలహా సూచనలు కూడా తీసుకుని ఈ సమస్యకు పరిష్కారం వెతకాలి. లేకపోతే మరో విభజన చిచ్చుకు మనమే చేజేతులా ఆజ్యం పోసినవారమవుతామన్న నిజాన్ని పాలకులు, ప్రతిపక్షాలు గ్రహించడం ఈ సమయంలో చాలా మంచిది.

పివిఎస్‌ఎస్ ప్రసాద్,

విశాఖపట్నం,