ఇప్పుడు దేశమంతా అత్యాచారాలపై చర్చ జరుగుతోంది. అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి? అత్యాచార కేసుల్లో దోషులకు ఎలాంటి శిక్షలు వేయాలి? ఉరిశిక్షలు వేస్తే అత్యాచారాలు తగ్గుతాయా? అత్యాచారాలు జరగడానికి పూర్తిగా పురుషులే కారణమా? స్త్రీలు కూడా కారణమేనా?….ఇలాంటి అనేక ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. లోకో భిన్న రుచి కదా.
సామాన్యులే కాకుండా రాజకీయ నాయకులు, సినిమా ప్రముఖులు, ఇతర రంగాల సెలబ్రిటీలు రకరకాల అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నారు. రకరాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. వీటిల్లో కొన్ని వివాదాస్పదమవుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో వాదనలు జరుగుతున్నాయి. అయితే వీరు చేసే వ్యాఖ్యానాలు, చెప్పే కారణాలు నిజమా? అంటే అది ఎవరికివారు నిర్ణయించుకోవల్సిందే.
అత్యాచారాలకు ఇదే అసలు కారణమని ఎవరూ చెప్పలేరు. రాజస్థాన్ ప్రభుత్వంలోని ఓ మంత్రి 'టీవీలు, మొబైల్ ఫోన్లే అత్యాచారాలవంటి నేరాలు పెరగడానికి కారణం' అని తేల్చిపారేశాడు. ఈయన పేరు భన్వర్‌లాల్ మేఘవాల్. రాజస్థాన్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి. టీవీలు, మొబైల్ ఫోన్లు నేరాలకు కొంతవరకు దోహదపడుతుండొచ్చు. కాని ఈ మంత్రి మరో విచిత్రం చెప్పాడు.
టీవీలు, మొబైల్ పోన్లు లేని కాలంలో అత్యాచారాలు లేవని సెలవిచ్చాడు. అంటే అత్యాచారాలు జరగడానికి వంద శాతం ఈ రెండే కారణమన్నట్లుగా ఈయన చెప్పాడు. టీవీలు, మొబైల్ పోన్లే లేని కాలంలో అత్యాచారాలు జరగలేదని ఏ ఆధారాలతో ఈ మంత్రి చెప్పాడో ఆయనకే తెలియాలి.
అత్యాచార కేసుల్లో విచారణను మూడు నెలల్లో ముగించాలని, దోషులను బహిరంగంగా ఉరితీయాలని ఈయన సలహా ఇచ్చాడు. విచారణ త్వరగా ముగించాలని చెప్పడం బాగానే ఉందిగాని, బహిరంగంగా ఉరితీయడం మన దేశంలో సాధ్యమా? 2012లో ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగినప్పుడు హర్యానా ఖాప్ నేత ఒకాయన 'చైనీస్ ఫాస్ట్ ఫుడ్ 'చౌమిన్' తినడం వల్లనే అత్యాచారాలు జరుగుతున్నాయి' అని తాను పరిశోధన చేసి కనిపెట్టినట్లుగా చెప్పాడు.
2015లో బినయ్ బిహారీ అనే బిహార్ మంత్రి 'రేప్ కేసులు పెరగడానికి మొబైల్ ఫోన్లు , మాంసాహారం ప్రధాన కారణాలు' అని చెప్పాడు. మాంసాహారులకు రేప్ చేయాలనే బుద్ధి పుడుతుందా? ఇది ఏ పరిశోధనలో తేలిందో మరి…!
2014లో అప్పటి మధ్యప్రదేశ్‌లో బిజేపీ మంత్రిగా ఉన్న బాబూలాల్ గౌర్ ఓ సందర్భంలో మాట్లాడుతూ బాలీవుడ్ సినిమాల్లో ఐటం సాంగ్స్‌లో నటించే నటీమణులు అత్యాచారాలకు కారణమవుతున్నారని వ్యాఖ్యానించి పెద్ద వివాదం లేవదీశాడు. సినిమాల్లో ఐటం సాంగ్స్‌లో నర్తించేవారు అత్యాచారాలు జరిగేలా వాతావరణం సృష్టిస్తున్నారని ఈ పెద్దమనిషి వ్యాఖ్యానించాడు. మహిళల అంగీకారంతోనే అత్యాచారాలు జరుగుతున్నాయని పిచ్చి కామెంట్ చేశాడు. ఈయన అంతటితో ఊరుకోలేదు.
మహిళలు జీన్స్, ఇతర పాశ్చాత్య తరహా దుస్తులు ధరించడం కూడా అత్యాచారాలకు కారణమన్నాడు. రాజస్థాన్‌లోని సలంబుర్ పట్టణంలో అంజుమన్ ముస్లిం పంచాయత్ బాలికలు ఇంట్లో తప్ప బయట మొబైల్ ఫోన్లు ఉపయోగించకూడదని తీర్మానం చేసింది.
బంధువుల పెళ్లిళ్లలో బాలికలు డాన్సులు చేయకూడదని, మగవారితో సన్నిహితంగా ఉండకూడదని ఆంక్షలు విధించింది. ఈ పనులన్నీ అత్యాచారాలకు దారితీస్తాయని ముస్లిం పెద్దల అభిప్రాయం.
ముంబై పోలీసు కమిషనర్‌గా పనిచేసిన సత్యపాల్ సింగ్ 2013లో ఓ సందర్భంలో మాట్లాడుతూ కొన్ని దేశాల విద్యావిధానంలో సెక్స్ ఎడ్యుకేషన్ భాగంగా ఉందని, ఆ దేశాల్లో నేరాలు పెరగడానికి ఇది కారణమవుతోందని అన్నాడు. దిశ ఘటన జరిగాక కొందరు సామాజిక మాధ్యమాల్లో రకరకాల కామెంట్లు పెట్టారు. కొందరు అసభ్య వ్యాఖ్యానాలు చేశారు.