కొన్ని వివాదాలు నవ్వు తెప్పిస్తాయి.. ఇంకొన్ని వివాదాలు సిగ్గుచేటనిపిస్తాయి.. కొన్ని వివాదాలు అర్థం పర్థం లేనివిగా మిగిలిపోతాయి. అయినాసరే, వివాదాలు తెచ్చిపెట్టే పబ్లిసిటీ ఓ రేంజ్‌లో వుంటుంది గనుక, వివాదాలతోనే కొందరు సావాసం చేస్తుంటారు. వివాదమే వారికి భుక్తి.. అనే విమర్శలు వెల్లువెత్తుతున్నా, అలాంటోళ్ళు అందులోంచి బయటకు రాలేరు.
సాయిబాబా దేవుడా.? కాదా.? అన్నదిప్పుడు సరికొత్త వివాదం. నిజానికి ఈ వివాదం ఈనాటిది కాదు. చాన్నాళ్ళుగా వున్నదే. వీలు చిక్కినప్పుడల్లా ఎవరో ఒకరు ఈ వివాదం పట్టుకుని పబ్లిసిటీ స్టంట్లు చేస్తుంటారు. సాయిబాబా.. అంటే మళ్ళీ అందులో ఇద్దరున్నారు.. ఒకరు షిర్డీ సాయిబాబా.. ఇంకొకరు సత్యసాయిబాబా. షిర్డీసాయి నిరాడంబర జీవితం గడిపారు. సత్యసాయి అలా కాదు.. ఆడంబరమైన జీవితం గడిపారు. షిర్డీసాయిబాబా జీవించిన కాలంలో వివాదాల గురించి ఎవరికీ తెలియదు. సత్యసాయిబాబా ఎదుర్కొన్న వివాదాల గురించి అందరికీ తెల్సిందే. ఇప్పుడు ఇద్దరూ జీవించి లేరు.
'నేనే దేవుడ్ని..' అని షిర్డీ సాయిబాబా ఎప్పుడూ చెప్పుకోలేదు. సత్యసాయి మాత్రం తాను దైవాంశ సంభూతుడినేనని చెప్పుకున్నారు. అయినాసరే, సత్యసాయిబాబా చేసిన సేవా కార్యక్రమాలు అన్నీ ఇన్నీ కావు. వైద్య సేవల దగ్గర్నుంచి, మంచి నీటి పథకాలు.. అబ్బో, సత్యసాయి సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన చేసిన సేవా కార్యక్రమాల్ని పరిగణనలోకి తీసుకుంటే, ఆయన నిజంగానే దేవుడు.
దేవుడెలా వుంటాడు.? అంటే, ఎవరికీ తెలియదు. అలాంటప్పుడు దేవుడి పేరుతో ఈ వివాదాలెందుకు.? అంటే, దేవుడి ముసుగులో జరిగే వ్యాపారం అనండీ, మోసాలనండీ, ఇంకోటనండీ.. ఇవే ప్రధాన కారణాలు. ప్రభుత్వాలు దేవుడి పేరుతో వ్యాపారం చేయడం అనేది వేరే టాపిక్ ఇక్కడ. ప్రసాదాలు, టిక్కెట్లు.. ఆ కథ వేరే వుంది. షిర్డీ సాయిబాబాని లక్షలాది మంది, కోట్లాది మంది దేవుడిలా కొలుస్తారు. కానీ, ఆయనసలు దేవుడు కాదనీ, అసలు హిందూ కాదని కొందరు 'బాబా'లు భక్తుల్ని 'ఎడ్యుకేట్' చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ 'ఎడ్యుకేషన్' ఎందుకంటే, తమని ఎవరూ నమ్మడంలేదని.
గత కొద్ది రోజులుగా షిర్డీ సాయిబాబా దేవుడే కాదు, ఆయన్ని పూజించొద్దు మొర్రో.. అంటూ సోకాల్డ్ బాబాలు నెత్తీనోరూ బాదుకుంటోంటో, షిర్డీలో ఇసకేస్తే రాలనంతమంది భక్తులు దర్శనమిస్తున్నారు. దసరా రోజున షిర్డీ సాయిబాబా హుండీ ఆదాయం 4 కోట్ల పైమాటేనట. ఇంకా, ఈ సోకాల్డ్ బాబాల మాటలకు విలువ వుంటుందా.?