మొన్నేమో రక్తం ఉండికిపోయింది.. ఇప్పుడేమో చిర్రెత్తుకొచ్చింది. రక్తం ఉడికిపోయినా, చిర్రెత్తుకొచ్చినా చంద్రబాబు ఏం చేయగలరు? చంద్రబాబుని ఎలా తొక్కాలో నరేంద్రమోడీకి బాగా తెలుసు. ఏముంది.? 'ఓసారి ఢిల్లీకి వస్తారా?' అని కేంద్రం నుంచి చంద్రబాబుకి పిలుపొస్తుంది, అక్కడ తలంటేస్తారు. అంతే, పౌరుషం చచ్చిపోయి, ముసిముసి నవ్వులు నవ్వుతూ చంద్రబాబు హైద్రాబాద్ విమానమెక్కేస్తారు.
పైన చెప్పుకున్న ఎపిసోడ్‌కి భిన్నంగా గడచిన రెండేళ్ళలో ఏనాడన్నా చంద్రబాబు తీరు కన్పించిందా.? ప్రత్యేక హోదా ఇస్తారా.? ఛస్తారా.? అని ఆంధ్రప్రదేశ్‌లో నిలదీయడం, ఢిల్లీకి వెళ్ళి 'అంతకు మించి ఇస్తామంటే వద్దంటామా.? ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవని అనుకున్నారా.?' అని ఎదురు ప్రశ్నించడం చంద్రబాబుకి అలవాటే.
మొన్నటికి మొన్న రక్తం మరిగిపోయిందంటూ హూంకరించిన చంద్రబాబు, ఢిల్లీకి వెళ్ళి వచ్చాక ఎంతో సాత్వికంగా మారిపోయిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.? తాజాగా 1976 కోట్లను కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కి విడుదల చేస్తే, 'అది నామమాత్రం.. అదేమీ పెద్ద గొప్ప కాదు.. ప్రత్యేక హోదా సంగతి ఏం తేల్చారు.?' అంలూ చంద్రబాబు గుస్సా అయ్యారు. 'బుందేల్‌ఖండ్ విషయంలో సానుకూలంగా వ్యవహరించిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎందుకు ఆలోచించదు.?' అని ప్రశ్నించేశారు.
ఏపీ మీడియా ముందు చంద్రబాబు ఈ ప్రశ్నలు వేస్తే ఉపయోగమేముంటుంది.? ఢిల్లీలో అఖిలపక్ష నేతల్ని తీసుకెళ్ళి ధర్నా చేసి, జాతీయ మీడియా ద్వారా కేంద్రాన్ని ప్రశ్నిస్తే.. కాస్తో కూస్తో ఉపయోగముండొచ్చు. లేదా, డైరెక్టుగా ప్రధాని వద్దకే అఖిలపక్షాన్ని తీసుకెళ్ళి ప్రశ్నిస్తే తాడో పేడో తేలిపోతుంది. ఇంట్లో పులి, వీధిలో పిల్లి అంటారే, అచ్చంగా చంద్రబాబు పరిస్థితి ఇలానే వుంది. ఎనీ డౌట్స్.?