తమిళనాడులో దివంగత జయలలిత స్నేహితురాలు శశికళ ముఖ్యమంత్రి అవుతుందా? కాదా? అయితే ఎప్పుడు అవుతుంది? సామాన్య ప్రజానీకం సహా అన్ని పార్టీల నాయకులు ఇప్పుడు ఈ ప్రశ్నలకు జవాబు వెదికే పనిలో ఉన్నారు. జయలలిత కన్ను మూయగానే ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీరు శెల్వంను పీకేసీ చిన్నమ్మను సులభంగా సీఎం చేయొచ్చని అన్నాడీఎంకే నాయకులు అనుకున్నారు. చిన్నమ్మ కూడా అలాగే అనుకుంది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా సులభంగా ఎంపికైన శశికళకు ముఖ్యమంత్రి కావడానికి అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. పార్టీలోనే కొందరు ఆమెను వ్యతిరేకిస్తుండగా, ప్రజల్లోనూ అంత సుముఖత లేనట్లు కనబడుతోంది. ముందు ముఖ్యమంత్రిగా ఎన్నికై ఆ తరువాత ఉప ఎన్నికలో గెలవాలనేది చిన్నమ్మ ప్లాన్. తనను తాను అభినవ జయలలితగా భావించుకుంటున్న ఆమె జయ నియోజకవర్గమైన ఆర్‌కె నగర్‌కు నిర్వహించే ఉప ఎన్నికలో సులభంగా గెలవొచ్చని అనుకుంది. కాని అక్కడి జనం వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా ఎన్నికైన తరువాత ఉప ఎన్నికలో ఓడిపోతే పరువు తక్కువ.
రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గంలో పోటీ చేయాలంటే ఎవరో ఒక ఎమ్మెల్యే రాజీనామా చేయాల్సివుంటుంది. రాజీనామా చేసిన ఎమ్మెల్యేకు ఏదో ఒక ప్రయోజనం కల్పించాలి లేదా మంచి పదవి ఇవ్వాలి. ఇది ఒక కోణం. ఇక చిన్నమ్మను, ఆమెకు మద్దతు ఇస్తున్న నాయకులను వేధిస్తున్న అసలు సమస్య అక్రమాస్తుల కేసులో సుప్రీం కోర్టు తుది తీర్పు. ఈ తీర్పు ఎప్పుడు వస్తుందో తెలియడంలేదు. సంక్రాంతి పండుగ సమయంలో చిన్నమ్మ సీఎం పీఠం అలంకరిస్తుందని నాయకులు చెబుతున్నారు. కాని ఆమె అందుకు సుముఖంగా లేదని సమాచారం. సుప్రీం కోర్టు తీర్పు ఏమిటో తేలకుండా ముఖ్యమంత్రి పీఠం అలంకరించిన తరువాత 'శశికళ దోషి' అని తీర్పు వస్తే తప్పనిసరిగా కుర్చీ దిగిపోవాలి. దీంతో వ్యక్తిగతంగా ఆమె నవ్వులపాలు కావడమే కాకుండా, పార్టీ ప్రతిష్ట దారుణంగా దెబ్బ తింటుంది. కాబట్టి తీర్పు వచ్చేంతవరకు ఎదురుచూడటమే మంచిదనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోందని కొందరు నాయకులు చెబుతున్నారు. అయితే ఈలోగా ముఖ్యమంత్రి పన్నీరుశెల్వం బలపడతారేమోనని భయపడుతున్నారు కూడా.
తీర్పు వచ్చేదాకా ఎదురుచూస్తూ కూర్చుంటే రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయో తెలియదు. ఈ నేపథ్యంలో తన భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న శశికళ 'నా జాతకం ఎలా ఉంటుందో చెప్పండి' అంటూ ప్రముఖ జ్యోతిష్యులను సంప్రదిస్తున్నారట…! వాళ్లు మాత్రం ఏం చెబుతారు? మీకు ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదని నేరుగా చెప్పలేరు లేదా ఎన్ని అడ్డంకులు వచ్చినా సీఎం కుర్చీ మీద కూర్చుని తీరుతారని ఘంటాపథంగా చెప్పలేరు. చివరకు జ్యోతిష్యులు చెబుతున్నదేమిటి? సంక్రాంతి (పొంగల్)కి ముందుగాని, తరువాతగాని ముఖ్యమంత్రి అయ్యే యోగం ఉంది. కాని అదంతా సుప్రీం కోర్టు తీర్పు మీదనే ఆధారపడి ఉంటుంది అని. ఈ మాట జ్యోతిష్యులు చెప్పేదేముంది? సామాన్యుడు ఎవ్వరైనా చెబుతాడు. కాని సుప్రీం కోర్టు తీర్పు ఎప్పుడొస్తుందనేది జ్యోతిష్యులు చెప్పలేకపోతున్నారు. శశికళ ముఖ్యమంత్రి కావడానికి అర్హత లేదని వాదించేవారు చెబుతున్న ప్రధాన కారణాల్లో ఒకటి 'పరిశుద్ధమైన వ్యక్తి' కాదు. అంటే నిందితురాలు. అక్రమాస్తుల కేసులో జయయలితతోపాటు శశికళ, జె.ఇళవరసి, విఎన్. సుధాకరన్ నిందితులు. బెంగళూరులోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం వీరందరినీ దోషులుగా తేల్చి శిక్షలు విధించింది.
దీనిపై వీరు కర్నాటక హైకోర్టుకు వెళ్లగా నిర్దోషులుగా విడుదల చేసింది. ఈ తీర్పుపై తీవ్ర విమర్శలు చెలరేగడంతో కర్నాటక సర్కారు, మరికొందరు సుప్రీం కోర్టుకు వెళ్లారు. అక్కడ విచారణ జరిగింది. ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. అంటే ప్రకటించాల్సివుందన్నమాట. కాని ఈలోగానే జయలలిత కన్ను మూశారు. కాని శశికళను, ఇతరులను నిర్దోషులని చెప్పలేం. అనూహ్యంగా జయ కన్నుమూయడంతో ఆమెకు 'నిర్దోషి' ముద్ర పడిపోయింది. సో…మిగిలినవారు శశికళ, ఇళవరసి, సుధాకరన్. వీరు దోషులా? నిర్దోషులా? అనే తీర్పు రావల్సివుంది. నిందితుల్లో ఒకరు పోయినంతమాత్రాన కేసు మూసేసినట్లు కాదు. చిన్నమ్మ దోషి అని తీర్పు వస్తే జైలుకెళ్లాల్సి ఉంటుంది. అక్రమాస్తుల కేసులో విచారణను కొనసాగించి సాధ్యమైనంత త్వరగా తుది తీర్పు ఇవ్వాలని ఈమధ్య కర్నాటక ప్రభుత్వం సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేసింది. జయ చనిపోవడంతో అక్రమాస్తుల కేసు కథ కంచికి వెళ్లిపోయినట్లేనని భావించిన అన్నాడీఎంకే నాయకులు చిన్నమ్మను వెంటనే ముఖ్యమంత్రిని చేయాలనుకున్నారు. కాని ఇప్పుడు ఆ కేసే వారిని కలవరపెడుతోంది.