సరికొత్త రికార్డ్: రజత సింధూ

స్వర్ణం మీద ఆశలు పెట్టుకున్న వారికి కొంచెం నిరాశే కానీ.. సరికొత్త షటిల్ సంచలనంగా నిలిచింది పీవీ సింధూ. మహిళ విభాగం సింగిల్స్  లో సింధూ రజత పతకధారిణి అయ్యింది. శుక్రవారం రాత్రి జరిగిన…

స్వర్ణం మీద ఆశలు పెట్టుకున్న వారికి కొంచెం నిరాశే కానీ.. సరికొత్త షటిల్ సంచలనంగా నిలిచింది పీవీ సింధూ. మహిళ విభాగం సింగిల్స్  లో సింధూ రజత పతకధారిణి అయ్యింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్ లో సింధూ 1-2 సెట్స్ తో రజతాన్ని సాధించింది. రెండు సెట్స్ లో విజయం సాధించిన స్పెయిన్ షట్లర్ స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. 

ఆద్యంతం పోటాపోటీ గా జరిగిన మ్యాచ్ లో తొలి సెట్ లో విజయకేతనం ఎగరేసింది పీవీ సింధూ. ఈ సెట్ లో తొలి దశలో వెనుకబడినా.. ఆ తర్వాత సింధూ పుంజుకుని స్పెయిన్ షట్లర్ మీద పై చేయి సాధించింది. అయితే రెండో సెట్ లో స్పెయిన్ క్రీడాకారిణి నుంచి సింధూకు తీవ్రమైన పోటీ ఎదురైంది. ఈ సెట్ ను ఆమె సొంతం చేసుకుంది.

నిర్ణయాత్మక మూడో సెట్ లో సింధూ తిరిగి పుంజుకుంది. ఈ సెట్ తొలి సగంలో సింధూ, స్పెయిన్ షట్లర్ సమాన స్థాయిలో నిలిచారు. ఒక దశలో ఈ సెట్ 10 – 10 గా ఉండి ఉత్కంఠను రేకెత్తించింది. అయితే స్పెయిన్ అమ్మాయి ఆ సమయంలో దూకుడు కనబరిచింది. అంతిమంగా సెట్ ను సొంతం చేసుకుని స్వర్ణ పతాకాన్ని సొంతం చేసుకుంది.

తీవ్రమైన ఒత్తిని ఎదుర్కొని కూడా సింధూ అభినందనపూర్వకమైన ఆటతీరునే కనబరిచింది. ఆఖరి వరకూ పోరాట స్ఫూర్తిని కనబరిచింది. భారత బ్యాడ్మింటన్ చరిత్ర లో సింధూ కొత్త చరిత్ర సృష్టించినట్టే. ఇది వరకూ సైనా సాధించిన కాంస్య పతకమే ఒలింపిక్స్ లో అత్యుత్తమ ప్రదర్శన కాగా.. ఇప్పుడు ఈ సారి ఆ ఘనతను అధిగమించింది.