సోషల్ మీడియాలో ఇప్పుడు సర్జికల్ స్ట్రైకింగ్స్ ట్రెండింగ్‌గా మారిపోయింది. గత కొద్ది రోజులుగా 'సర్జికల్ స్ట్రైక్స్' అన్న ప్రస్తావన ప్రముఖంగా విన్పిస్తోంది భారతదేశంలో. పాకిస్తాన్, భారత్‌పై యుద్దోన్మాదం ప్రదర్శిస్తున్న దరిమిలా, మనం ఏం చేయగలం.? మనకున్న అవకాశాలేంటి.? అన్న విషయాలపై జరుగుతున్న చర్చల్లో సర్జికిల్ స్ట్రైక్స్ అన్న ప్రస్తావనకీ విశేషమైన ప్రాధాన్యత దక్కుతోంది.
అసలు ఈ సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఏంటి.? అని, నెటిజన్లు ఇంటర్నెట్‌ని జల్లెడ పట్టేశారు. సోషల్ మీడియాలో నెటిజన్లు, తమకు తెల్సిన విషయాల్ని షేర్ చేసుకున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ కోసం ఎలాంటి సైన్యాన్ని వినియోగిస్తుంది.? అసలు సర్జికల్ స్ట్రైక్స్ చేసేవారు సైన్యంలో భాగమేనా.? వారికి ఎలాంటి శిక్షణ లభిస్తుంది.? వారు చేపట్టే ఆపరేషన్స్ ఎలా వుంటాయి.? ఇలా పలు ప్రశ్నల చుట్టూ నెటిజన్లు పరిశోధన షురూ చేసేశారు.
ఆగస్ట్ 15 – భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చలామందికి 'పారాట్రూప్ కమాండోస్' అన్న పేరు తెలిసింది. డిస్కవరీ తదితర ఛానళ్ళలో ఈ పారాట్రూప్ కమాండోస్ గురించి కథనాలు వచ్చాయి. వాటిని కూడా నెటిజన్లు ఆశాంతం తిలకించేశారు. గడచిన కొద్ది గంటల్లోనే ఇంటర్నెట్‌లో ఈ వీడియోలకు, వీటికి సంబంధించిన వార్తలకీ అనూహ్య డిమాండ్ పెరిగిపోయిందంటే, పాకిస్తాన్‌తో యుద్ధమంటూ జరిగితే ఏంటి పరిస్థితి.? అన్న విషయమై దేశంలో ప్రజలెంత ఉత్కంఠతో వున్నారో అర్థం చేసుకోవచ్చు.
పొద్దున్న లేవగానే, 'సర్జికల్ స్ట్రైక్స్'తో పాక్ నోరు మూసేశాం.. అన్న వార్త, భారతీయులందరికీ ఆనందాన్నిచ్చింది. ప్రతి భారతీయుడూ విజయగర్వంతో ఉప్పొంగిపోయాడు. ఈ ఆపరేషన్ కోసం పాతిక మంది కమెండోలనే మాత్రమే వినియోగించినట్లు తెలుస్తోంది. 25 మంది అంటే 2500 మందితో సమానంగా భావించొచ్చేమో.! ఎందుకంటే, ఒక్కొరూ అంత పవర్‌ఫుల్‌గా వుంటారు. వీరికి శిక్షణ ఇచ్చే క్రమంలో 90 రోజులపాటు అత్యంత కీలకమైన ప్రత్యేక శిక్షణ వుంటుంది.
ప్రత్యేక శిక్షణ అంటే అలా ఇలా కాదు, దాంట్లో విష సర్పాల్ని ఎదుర్కొనే నైపుణ్య పరీక్ష ఒకటి. కంటికి నిద్ర అనేదే లేకుండా మూడు రోజులపాటు కఠోరమైన శిక్షణ వుంటుంది. 100 కిలోమీటర్ల మేర వేగవంతమైన నడక మరో మెట్టు. 60 కిలోల పైన బరువుతో పరిగెత్తే శిక్షణ, మైనస్ డిగ్రీల చల్లదనం కలిగిన నీటిలో ఎక్కువసేపు వుండగలగడం.. ఇలా చెప్పుకుంటూ పోతే పారాట్రూప్ కమెండోస్ శిక్షణ అసాధారణం. దేశం కోసం ప్రాణాలైనా ఇస్తాం.. అనే పట్టుదలతో వచ్చినవారు సైతం, 'ఇక మేం ఈ శిక్షణ కొనసాగించలేం' అని చేతులెత్తేస్తారు. కానీ అంతలోనే దేశభక్తితో ముందడుగు వేస్తారు. అదీ ఈ శిక్షణ ప్రత్యేకత. పరీక్షలన్నీ నెగ్గి, కమెండోలుగా ఎంపికైనవారికి నిత్యం శిక్షణ కొనసాగుతూనే వుంటుంది. అత్యాధునిక ఆయుధాలతో, ఆపరేషన్లను అత్యంత ఖచ్చితత్వంతో పూర్తి చేయడం ఈ కమెండోల సొంతం.
ఈ కమెండోలనే భారత్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై ప్రయోగించింది. గతంలో అంటే 70లలో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలోనూ, ఇటీవల మయన్మార్‌లో జరిగిన సర్జికల్ స్ట్రైక్‌లోనూ, ఇంకా పలు సందర్భాల్లోనూ వినియోగించి, మంచి ఫలితాల్ని రాబట్టారు. ఇదీ సర్జికల్ స్పెషలిస్ట్స్ విశేషాలు. ఒక్క మాటలో చెప్పాలంటే, శరీరంలో క్యాన్సర్ కణాల్ని తొలగించడానికి, అత్యంత ఖచ్చితత్వంతో, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, పక్కనున్న ఆరోగ్యకరమైన కణాలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఎలాగైతే సర్జన్లు శస్త్ర చికిత్స చేస్తున్నారో.. పారా ట్రూపర్స్ కూడా అంతే. చిన్న తేడా ఏంటంటే, ఎంత ఖచ్చితత్వంతో, ఎంత 'ప్రిసైజ్'గా ఆపరేషన్ నిర్వహిస్తారో, అవసరమైతే అంతకు వెయ్యి రెట్లు విధ్వంసం సృష్టించి, శతృవుల్ని మట్టుబెట్టడం పారా ట్రూప్ కమాండోల ప్రత్యేకత.