కాంగ్రెసు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీకి అధ్యక్షుడు కావాలనేది ప్రస్తుత అధ్యక్షురాలు సోనియా గాంధీ కోరికే కాదు, పార్టీ నాయకుల, కేడర్ ఆకాంక్ష. నిజానికి ఆయన ఈపాటికి అధ్యక్షుడైపోవాల్సింది. కాని వాయిదా పడుతూ వస్తోంది. కొంతకాలం క్రితం జరిగిన కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యుసీ) సమావేశంలో నేతలంతా ముక్తకంఠంతో 'రాహుల్ మీరు అధ్యక్ష పదవి స్వీకరించండి' అని కోరారు. కాని యువరాజు ఇప్పుడే కాదని ఏడాదిపాటు వాయిదా వేశారు. దీంతో సోనియా గాంధీ పదవీ కాలాన్ని పొడిగించాల్సివచ్చింది. కాని ఏడాదిపాటు సోనియా గాంధీ అధ్యక్ష పదవిలో కొనసాగే పరిస్థితి లేదు. ఆమె ఆరోగ్యం బాగాలేకపోవడమే ఇందుకు కారణం. చాలాకాలంగా అంతంతమాత్రంగా ఉన్న సోనియా గాంధీ ఈమధ్య అస్వస్థత పాలై ఆస్పత్రిలో చేరారు. ఈ ఏడాది (2017) ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాల ఎన్నికలు పూర్తికాగానే పదవి నుంచి దిగిపోవాలని నిర్ణయించుకున్నారని వార్తలొచ్చాయి. కేంద్ర బడ్జెటు, ఎన్నికలు చూసుకొని సోనియా గాంధీ పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం జరిగింది.
ఆమె బలవంతంగా పదవిలో ఉన్నా అది నామమాత్రమే. కాబట్టి రాహుల్ గాంధీ కాంగ్రెసు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాల్సిందే. అయితే రాజీవ్ గాంధీని అధికారికంగా అధ్యక్షుడిగా ప్రకటించేవరకు కూడా సోనియా గాంధీ పనిచేసే పరిస్థితి లేదు. దీంతో ఆమె క్రమంగా తెర వెనక్కి వెళ్లిపోతున్నారు. తాను చేయాల్సిన పనులన్నింటినీ రాహుల్‌కే అప్పగించారు. ఆయన అధికారికంగా అధ్యక్షుడు కాకపోయినా ఆ బాధ్యతలన్నీ చూసుకుంటున్నారు. గత ఏడాది నవంబర్ ఏడో తేదీన జరిగిన కీలకమైన కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యుసీ) సమావేశానికి రాలేకపోయిన సోనియా గాంధీ అప్పటి నుంచి క్రమంగా తన కార్యకలాపాలను తగ్గించుకుంటున్నారు. గర్భాశయ ముఖద్వార కేన్సర్‌తో బాధపడుతున్న ఆమెకు ఇప్పటికే రెండుసార్లు అమెరికాలో ఆపరేషన్ జరిగింది. ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిన్న తరువాత ఒకప్పటిలా చురుగ్గా పనిచేయలేకపోతున్నారు. కొంతకాలం క్రితం యూపీలోని వారణాసిలో (ప్రధాని మోదీ నియోజకవర్గం) ఎన్నికల ప్రచారం చేస్తూ హఠాత్తుగా అనారోగ్యం పాలైన తరువాత గతంలోని చురుకుదనం తగ్గిపోయింది.
వాస్తవానికి అధ్యక్ష పదవి తీసుకునేందుకు రాహుల్ మానసికంగా సిద్ధంగా లేరని సీడబ్ల్యుసీ సమావేశంలోనే తేలిపోయింది. అయినప్పటికీ తల్లికి చేతకావడంలేదు కాబట్టి అంతా తానే చూసుకుంటున్నారు. గత ఏడాది డిసెంబరు 28న జరిగిన పార్టీ వ్యవస్థాక దినోత్సవాన్ని ఆయన నేతృత్వంలోనే నిర్వహించారు. తాజాగా డీమానిటైజేషన్‌పై జరిగిన జాతీయస్థాయి సమావేశానికి కూడా రాహుల్ గాంధీయే అధ్యక్షత వహించారు. సీడబ్ల్యుసీ, పార్టీ వ్యవస్థాక దినోత్సవం, డీమానిటైజేషన్‌పై సమావేశానికి వరుసగా సోనియా హాజరుకాకపోవడంతో ఆమె క్రమంగా తప్పుకుంటున్నట్లు (స్లో ట్రాన్సిషన్) నాయకులు భావిస్తున్నారు. ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల్లో ఆమె ప్రచారం చేయకపోవచ్చని చెబుతున్నారు. పార్టీ కార్యకలాపాల నుంచి దూరంగా ఉన్నారు. త్వరలో జరగబోతున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలను పూర్తిగా రాహుల్‌కే అప్పగించారు.
పార్టీ అభ్యర్థుల ఎంపిక నుంచి ఎన్నికల ప్రచారం వరకు పూర్తిగా రాహుల్‌నే ప్లాన్ చేసుకోమ్మని సోనియా చెప్పారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కూడా రాహుల్ గాంధీయే కీలకంగా వ్యవహరించారు. సభలోనే కాకుండా బయట కూడా మోదీపై రాహుల్ విరుచుకుపడ్డారు. డీమానిటైజేషన్ అంశంపై రాహుల్ తీవ్ర విమర్శలు చేయడంతో ఆయనపై నాయకులకు నమ్మకం పెరుగుతోంది. పార్టీ గళాన్ని బలంగా వినిపించారని అభిప్రాయపడుతున్నారు. పార్లమెంటులో రాహుల్ గాంధీ గట్టిగా నిరసన తెలియచేయడమే కాకుండా ప్రతిపక్షాలను ఒక తాటి మీదకు తెచ్చారు. ఢిల్లీలోని రాజకీయ విశ్లేషకుడు ఎన్. భాస్కర్‌రావు దీనిపై మాట్లాడుతూ తాను తప్పుకుంటున్నానని ప్రకటించకుండానే సోనియా గాంధీ తెరమరుగవుతున్నారని అన్నారు. కుమారుడు సొంతంగా ఎదగడం కోసమే సోనియా బాధ్యతలన్నీ అతనికి అప్పగించారని చెప్పారు. త్వరలో జరగబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ జయాపజయాల మీదనే రాహుల్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.