సమ్మర్‌ హీట్‌.. 400 కోట్లు!

తెలుగు సినిమా చరిత్రలో కీలక ఘట్టం! Advertisement ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలు దాటడం మాటేమో కానీ తెలుగు సినిమా బిజినెస్‌కి సంబంధించి నాలుగొందల కోట్ల బిజినెస్‌ సమ్మర్‌ సీజన్‌పై డిపెండ్‌ అయి…

తెలుగు సినిమా చరిత్రలో కీలక ఘట్టం!

ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలు దాటడం మాటేమో కానీ తెలుగు సినిమా బిజినెస్‌కి సంబంధించి నాలుగొందల కోట్ల బిజినెస్‌ సమ్మర్‌ సీజన్‌పై డిపెండ్‌ అయి ఉంది. టాలీవుడ్‌ హిస్టరీలోనే ఇది అత్యంత పెద్ద స్టేక్‌ అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. బాలీవుడ్‌లో ఒక్కో సీజన్‌లో ఈ స్థాయి బిజినెస్‌ జరుగుతుంటుంది కానీ రీజనల్‌ సినిమాలో ఒక్క సీజన్‌లో ఇంత వ్యాపారం జరగడం చాలా చాలా అరుదు. ప్రతి వేసవిలోను టాలీవుడ్‌ బిజినెస్‌ టాప్‌ లెవల్లోనే ఉంటుంది కానీ ఈసారి టాప్‌ లేపేసేలా జరగాల్సి ఉంటుంది. ఎన్నో ప్రామిసింగ్‌ సినిమాలు… వాటి మీద కోట్ల కొద్దీ ఆశలు. ఏవి నిలబడతాయో, ఏవి తిరగబడతాయో జోస్యం చెప్పగలిగింది ఎవరు? ఎన్ని రికార్డుల తలలు పగుల్తాయో, కొత్త రికార్డుల కొలతలు ఎందాకా సాగుతాయో అంచనా వేయగలరా మీరు? 

వంద కోట్ల షేర్‌ చూస్తామా?

ఈ సమ్మర్‌లోనే కాదు… ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్‌ మూవీ బాహుబలి. దీనికి జరుగుతోన్న ప్రీ రిలీజ్‌ బిజినెస్సే ఈ చిత్రంపై అంచనాలు ఎలా ఉన్నాయనే దానికి నిదర్శనం. ట్రేడ్‌ లెక్కల ప్రకారం 'బాహుబలి' తొలి భాగం మీదే థియేట్రికల్‌ బిజినెస్‌ పరంగా ఎనభై కోట్ల వరకు ఆధారపడి ఉన్నాయట. అంటే ఈ సినిమా బయ్యర్స్‌కి బ్రేక్‌ ఈవెన్‌ కావాలంటే ఎనభై కోట్ల షేర్‌ రావాలట. అంటే ఇప్పుడున్న ఇండస్ట్రీ హిట్‌ రికార్డుని (75 కోట్లు) దాటితే తప్ప బయ్యర్లు పెట్టిన డబ్బు తిరిగి రాదన్నమాట. ఇక వారు లాభాలు చేసుకుని ఈ చిత్రం సూపర్‌హిట్‌ అనిపించుకోవాలంటే వంద కోట్ల షేర్‌ రావాల్సిందేనట! వంద కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ వచ్చిన తెలుగు సినిమాలున్నాయి. మొదటిసారి వంద కోట్ల షేర్‌ వచ్చిన సినిమాని చూడబోతున్నామా? రాజమౌళి ఆవిష్కరిస్తున్న ఈ అద్భుతంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. కేవలం ఒక్క భాగానికే ప్రతి ఏరియాలోను టాప్‌ కలెక్షన్స్‌ వచ్చిన సినిమా కంటే ఎక్కువ రేట్‌ పెట్టి బయ్యర్స్‌ రైట్స్‌ తీసుకున్నారు. ఇది అంచనాలని మించేలానే ఉండాలి తప్ప ఇంచ్‌ కూడా డిజప్పాయింట్‌ చేయకూడదనే ఆశిద్దాం. 

గుర్రం మళ్లీ దౌడు తీయాల్సిందే!

'రేసుగుర్రం'తో అల్లు అర్జున్‌ రేంజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. అతనికి ఇండస్ట్రీ హిట్టిచ్చి ఊపుమీదున్న త్రివిక్రమ్‌ తోడయ్యాడేమో… జోనరేంటి, ఇది మిస్‌ఫైర్‌ అయితే మిగిలేదేంటి అనే డౌట్లు లేకుండా 'సన్నాఫ్‌ సత్యమూర్తి'కి ఆల్రెడీ కోట్లు కట్టబెట్టేసారు. ఈ సినిమాకి యాభై అయిదు కోట్ల వరకు ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగిందని అంచనా. అంటే ఈ సినిమా బ్రేక్‌ఈవెన్‌ అయి జస్ట్‌ ప్రాఫిట్స్‌ రాబట్టుకోవాలన్నా కానీ 'రేసుగుర్రం' రేంజ్‌ సక్సెస్‌ రావాలన్నమాట. రేసుగుర్రం హీరో, అత్తారింటికి దారేది డైరెక్టర్‌.. జులాయి కాంబినేషన్‌.. ఇలాంటివన్నీ 'సన్నాఫ్‌ సత్యమూర్తి'పై ఎక్స్‌పెక్టేషన్స్‌ని స్కై లెవల్‌కి తీసుకెళ్లాయి. అందుకే టైటిల్‌ కూడా డిసైడ్‌ కాక ముందే బిజినెస్‌ ఫిఫ్టీ క్రోర్స్‌ బోర్డర్‌ దాటేసింది. రోబో హవాలో ఖలేజా నిలబడలేకపోయిందనే కానీ త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో ఇంతవరకు బ్యాడ్‌ మూవీ రాలేదు. డైరెక్టర్‌ ట్రాక్‌ రికార్డ్‌ని, హీరో రేంజ్‌ని దృష్టిలో ఉంచుకుంటే ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌పై పెట్టిన పెట్టుబడి ఆడుతూ పాడుతూ రికవర్‌ అయిపోవాలి. కాకపోతే అందుకు తగ్గ టాక్‌ కూడా రావాలి. 'విలువలే ఆస్తి' అంటోన్న సత్యమూర్తి కొడుకు తనపై నమ్మకంతో కోట్లు పెట్టిన వారి ఆస్తులకి ఏ ఢోకా లేకుండా చేస్తాడనే భావిద్దాం. 

జేజమ్మ జూలు విదిలించాల్సిందే!

హీరోయిన్‌ ఓరియంటెడ్‌ సినిమాల్లో ఇండస్ట్రీ రికార్డు అరుంధతిదే. అప్పట్లో కొందరు స్టార్‌ హీరోల సినిమాల కంటే కూడా అధిక వసూళ్లు సాధించిన సంచలనం సృష్టించిన అనుష్క అదే స్థాయిలో అదరగొడుతుందని 'రుద్రమదేవి' దర్శక, నిర్మాత గుణశేఖర్‌ విశ్వసిస్తున్నాడు. తన సృష్టిపై, అనుష్క సామర్ధ్యంపై అపారమైన నమ్మకంతో ఈ చిత్రంపై కోటానుకోట్లు కుమ్మరించేసాడు. అనుష్కకి అల్లు అర్జున్‌ అండ కూడా తోడయింది. చారిత్రిక నేపథ్యమున్న ఈ భారీ చిత్రానికి హైప్‌ అయితే హై లెవల్లోనే ఉంది. ప్రేక్షకుల్ని అబ్బురపరిచేలా రుద్రమదేవి కదం తొక్కుతుందని.. యాభై కోట్లని అవలలీగా సాధిస్తుందని గుణశేఖర్‌ కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. జేజమ్మ జూలు విదిలించి బాక్సాఫీస్‌ని అదిలించి పారేస్తే చూడాలని ఉందా లేదా? 

సింహం గర్జించక తప్పదు!

ఒక భారీ హిట్‌ ఇచ్చిన తర్వాత కొంత కాలం పాటు నిరాశ పరచడం బాలకృష్ణకి రివాజుగా మారింది. ఒక పెద్ద హిట్‌ తర్వాత నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్‌ని కరెక్ట్‌గా సెట్‌ చేసుకోవడంలో కూడా ఆయన విఫలమవుతూ వచ్చారు. అందుకే బాలకృష్ణ విజయాల మధ్య అంత గ్యాప్‌ ఉండేది. కానీ లెజెండ్‌ తర్వాత వస్తున్న లయన్‌ మాత్రం అంచనాలు రేకెత్తిస్తోంది. బాలకృష్ణ నుంచి మరో సమ్మర్‌ బొనాంజా ఖాయమనే నమ్మకం కలిగిస్తోంది. అందుకే లయన్‌కి దర్శకుడు కొత్తవాడే అయినా బిజినెస్‌ సూపర్‌గా జరుగుతోంది. లెజెండ్‌ ఖాతాలో ఈ లయన్‌ నలభై కోట్ల విజయాన్ని వేస్తుందనే అంచనాలున్నాయి. టైటిల్‌లో సింహముంటే నటసింహం గర్జన ఇంకో లెవల్లో ఉంటుందని ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. లయన్‌ సెంటిమెంట్‌ని రిపీట్‌ చేస్తే నిర్మాతలకి, బయ్యర్లకీ అంతకంటే ఏం కావాలి? 

రౌండ్‌ 2!

రవితేజ, సురేందర్‌ కాంబినేషన్‌లో వచ్చిన కిక్‌ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు దాని సీక్వెల్‌ డబుల్‌ కిక్‌ ఇస్తుందనే అంచనాలున్నాయి. టాప్‌ ఫామ్‌లో ఉన్న సురేందర్‌, రవితేజతో నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రంతో రవితేజకి తొలి ముప్పయ్‌ కోట్ల హిట్‌ వస్తుందనేది ఫాన్స్‌ ఎక్స్‌పెక్టేషన్‌. 

'లౌక్యం'తో బ్లాక్‌బస్టర్‌ కొట్టిన గోపీచంద్‌ 'జిల్‌' కూడా చాలా ప్రామిసింగ్‌గా కనిపిస్తోంది. ఆడియో, ప్రోమోస్‌ అన్నీ సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి. ఇది గోపీ కెరీర్లో మరో ఇరవై కోట్ల సినిమాగా నిలుస్తుందేమో చూడాలి. 

ఈ భారీ సినిమాలే కాకుండా ఈ సీజన్‌లో వస్తోన్న మరికొన్ని నోటబుల్‌ రిలీజెస్‌ ఉన్నాయి. వాటిలో నాగచైతన్య, సుధీర్‌వర్మ 'దోచెయ్‌'తో పాటు రామ్‌, గోపీచంద్‌ మలినేనిల 'పండగ చేస్కో' ముందుంటాయి. ప్రామిసింగ్‌ యంగ్‌ హీరోస్‌కి డైరెక్టర్స్‌ ట్రాక్‌ రికార్డ్‌కి తోడై ఇవి కూడా ఆశలు రేకెత్తిస్తున్నాయి. అనువాద చిత్రాలైన 'ఉత్తమ విలన్‌', 'ఓకే బంగారం', 'మాస్‌' కూడా ఈ సమ్మర్‌లోనే వస్తున్నాయి. 

కమల్‌హాసన్‌, మణిరత్నం, సూర్యల బ్రాండ్‌ ఇమేజ్‌ కారణంగా వీటిపై కూడా భారీగా వ్యాపారం జరుగుతోంది. ఇవి కాకుండా ఇంకా మీడియం రేంజ్‌ సినిమాలు, బాగుంటాయనిపిస్తోన్న చిన్న సినిమాలు పదుల సంఖ్యలో సమ్మర్‌లో రిలీజ్‌కి టైమ్‌ కోసం చూస్తున్నాయి. అంచనాలున్న అన్ని సినిమాలు అందుకు తగ్గట్టే ఆడినట్టయితే ఈ సమ్మర్‌ టాలీవుడ్‌ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. తెలుగు సినిమా స్థాయి ద్విగుణీకృతమవుతుంది. 

– గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri