సర్జికల్ స్ట్రైక్.. ఈ పదం ఇప్పుడు ఇండియాలో సూపర్ ట్రెండింగ్. ప్రధాని నరేంద్రమోడీ హయాంలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌పై జరిపిన తొలి సర్జికల్ స్ట్రైక్ దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపింది.
పాక్ సైన్యం, భారత సైన్యంపై కాల్పులు జరపడం, ఈ గందరగోళం నడుమ తీవ్రవాదుల్ని భారత్‌లోకి పాక్ సైన్యం పంపించడం.. ఇదంతా ఎప్పటినుంచో జరుగుతున్న తంతే. అయితే, యురీ ఘటన భారత సైన్యాన్ని తీవ్రస్థాయిలో రెచ్చగొట్టిందనే చెప్పాలి. 19 మంది సైనికులు చనిపోవడంతో, సైన్యం ఆగ్రహావేశాలతో ఊగిపోయింది. దేశమంతా ఒక్కటవడం, దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ప్రభుత్వానికి అండగా నిలవడంతో, 'ఆపరేషన్' షురూ అయ్యింది. ఇది జరిగిన కథ.
వాస్తవానికి సర్జికల్ స్ట్రైక్స్ భారత్‌కి కొత్తేమీ కాదు. గతంలో మయన్మార్‌లో కూడా తీవ్రవాదులపై సర్జికల్ స్ట్రైక్స్ చేసింది భారత సైన్యం. 2011లో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో కూడా సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. మయన్మార్‌లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ ప్రపంచానికి తెలిసిన విషయమే. 2011లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ మాత్రం ఎవరికీ తెలియని వ్యవహారం. ఆ వివరాలు ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్నాయి.
పాకిస్తాన్ సైన్యం, 2011లో భారత సరిహద్దుల్లోకి చొచ్చుకువచ్చి, ఐదుగురు భారత సైనికుల్ని హతమార్చింది, మరికొంతమందిని అపహరించి, వారిని దారుణంగా హింసించి, వారి తలల్ని తెగనరికింది. అంతే, భారత సైన్యం రగిలిపోయింది. పాకిస్తాన్‌కి బుద్ధి చెప్పే క్రమంలో సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. ఆనాటి ఘటనలో పలువురు పాక్ సైనికులు హతమయ్యారు. ఈ వివరాలు తాజాగా వెలుగు చూశాయి. ఓ ఆంగ్ల పత్రిక ఈ విషయాల్ని వెలుగులోకి తీసుకొచ్చింది.. ఆధారాలతో సహా.
సర్జికల్ స్ట్రైక్ అంటే అత్యంత గోప్యంగా జరిగే ఆపరేషన్. వాస్తవానికి ఇలాంటి ఆపరేషన్స్ జరుగుతాయంతే.. వాటి వివరాలు బయటకు పొక్కవు. కానీ, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై ఇటీవల జరిగిన సర్జికల్ స్ట్రైక్స్‌కి విపరీతమైన పబ్లిసిటీ వచ్చి చేరింది. కారణం, యురీ ఘటన అంత తీవ్రమైనది కావడమే. ఈ స్ట్రైక్స్‌పై భారతదేశంలో కొందరు రాజకీయ నాయకులు 'ఆధారాలు కావాలి' అంటూ శవరాజకీయం షురూ చేశారు. బీజేపీ సర్జికల్ స్ట్రైక్స్‌తో రాజకీయం చేస్తోందని విమర్శిస్తున్నారు.
ఈ క్రమంలోనే 2011 నాటి సర్జికల్ స్ట్రైక్స్ వ్యవహారం వెలుగు చూసిందా.? అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో వుంది. 'మీరే కాదు, మేమూ చేశాం..' అని చెప్పుకోడానికే అత్యంత రహస్యమైన పత్రాల్ని లీక్ చేశారేమో.. అన్న వాదనలు తెరపైకి వస్తున్న వేళ, సైన్యానికి సంబందించిన అత్యంత గోప్యతతో కూడిన ఆపరేషన్స్ తాలూకు వివరాలు ఎలా లీక్ అవుతాయి.? అన్న ప్రశ్నలూ పుట్టుకొస్తున్నాయి.
ఏదిఏమైనా కుక్క కాటుకి చెప్పు దెబ్బ పడాల్సిందే. అదే సమయంలో, సైన్యానికి సంబంధించిన ఇలాంటి విషయాల్లో గోప్యత అవసరం.. రాజకీయ నాయకులకి సంయమనం కూడా అవసరం.