తాళి తెంచాలా? వుంచాలా?

వైవాహిక బంధానికి ప్రతీక మహిళ మెడలో తాళిబొట్టు.. అన్నది హిందూ సంప్రదాయం. కానీ తమిళ తంబిలు కొందరు, తాళి వుంటేనే వైవాహిక బంధానికి గుర్తు.. అనడంలో అర్థం లేదంటున్నారు. అనడమే కాదు, పుటుక్కున తాళి…

వైవాహిక బంధానికి ప్రతీక మహిళ మెడలో తాళిబొట్టు.. అన్నది హిందూ సంప్రదాయం. కానీ తమిళ తంబిలు కొందరు, తాళి వుంటేనే వైవాహిక బంధానికి గుర్తు.. అనడంలో అర్థం లేదంటున్నారు. అనడమే కాదు, పుటుక్కున తాళి తెంచేస్తున్నారు. షాకింగ్‌ విషయమే ఇది. ఓ రాజకీయ పార్టీ ఈ తాళి తెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆ పార్టీ పేరు ద్రవిడ కజగం.

భర్త చనిపోతే తాళి తెగిపోతుంది.. హిందూ సంప్రదాయం ప్రకారం మనుగడలో వున్న ఆచారం ఇది. తప్పా? ఒప్పా? అన్నది వేరే విషయం. కానీ, భర్త వుండగా తాళి తెంచేయడమేంటో ఎవరికీ అర్థం కావడంలేదు. అసలు తెంచాల్సిన అవసరమేంటి.? దాన్ని ఓ నగలా అయినా మెడలో వుంచుకోవచ్చు కదా.. అన్న వాదన విన్పిస్తోంది.

ఓ రాజకీయ పార్టీ జనంలోకి వెళ్ళాలన్నా, అందరి దృష్టినీ ఆకర్షించాలన్నా పబ్లిసిటీ అవసరం. నెగెటివ్‌ పబ్లిసిటీతో ఏ అంశానికైనా విస్తృత ప్రాచుర్యం లభిస్తుంది. ద్రవిడ కజగం కూడా అలాగే ఆలోచించి వుండొచ్చు. భార్యా భార్తల్ని పిల్లతో సహా వేదిక మీదకు తీసుకొచ్చి, కత్తెరతో తాళి తెంచి పారేశారు ద్రవిడ కజగం ప్రతినిథులు. ఇదిప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. 

పార్టీల సిద్ధాంతాలు వేరు, ఆచారాలు వేరు.. ఇష్టం లేకపోతే తాళి ధరించడం మానెయ్యొచ్చు.. లేదంటే తాళిని తెంపేసుకోవచ్చు.. కానీ అలా తాళి తెంచేయడాన్ని బహిరంగంగా ఓ పెద్ద వేదికను ఏర్పాటు చేసి, అక్కడ ఆ పని చెయ్యడమంటే హిందూ మత ధర్మాన్ని అపహాస్యం చేయడమేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎవరేమనుకున్నా సరే, తమ వాదనే కరెక్ట్‌ అన్నది ద్రవిడ కజగం వాదన. ఈ వాదనని ఎలా అర్థం చేసుకోవాలి.? పైత్యం ప్రకోపిస్తోందని అనుకోవాలా.? మనిషి ఆలోచనలు వికృతంగా మారిపోతున్నాయని అనుకోవాలా.? ఏమో మరి, ఎవరికీ అర్థం కావడంలేదు.