కాస్త టెక్నికల్‌గా ఆలోచిస్తే, ఆంధ్రప్రదేశ్‌కి తమిళ సినిమా ఎంతో, హిందీ సినిమా ఎంతో, తెలుగు సినిమా కూడా అంతే.! అవును మరి, బాలీవుడ్ ముంబై కేంద్రంగా పనిచేస్తోంది. కోలీవుడ్, చెన్నయ్ కేంద్రంగా పనిచేస్తోంది. తెలుగు సినీ పరిశ్రమ హైద్రాబాద్ కేంద్రంగా పనిచేస్తోంది. ఒకప్పటి పరిస్థితులకీ, ఇప్పటి పరిస్థితులకీ ఇంత స్పష్టమైన తేడా వుంది.! నిజం నిప్పులాంటిది.. తప్పదు.. అంగీకరించాల్సిందే.!
మరి, తెలుగు సినిమాపై ఆంధ్రప్రదేశ్‌లోని అధికార తెలుగుదేశం పార్టీ పెత్తనమేంటట.? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. తెలుగు రాష్ట్రం గనుక, తెలుగు సినిమాకి పురస్కారాల్ని ప్రకటించింది. దానికోసం జ్యూరీలను నియమించడం, ఆ జ్యూరీ సరిగ్గా పనిచేయలేదన్న విమర్శలు రావడంతో, ప్రభుత్వం హుందాగా వ్యవహరించాల్సి వుంది. కానీ, వివాదాల నందుల వ్యవహారంపై 'చమురు' చల్లినట్టు, మంత్రి నారా లోకేష్ ఆధార్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. అదెంత సిల్లీ టాపిక్ అన్న కనీస విజ్ఞత కూడా ప్రదర్శించలేకపోయారాయన. పోనీ, నోరు జారారని అనుకుందామంటే, అదీ లేదాయె.. తన వ్యాఖ్యల్ని మళ్ళీ సమర్థించుకున్నారు.
'నా ఆధార్, ఓటు హక్కు కోసం వెతుకుతున్నారు..' అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి. అసలు నారా లోకేష్ ఆధార్ ఎక్కడుంటే ఎవరికి కావాలి.? ఆయన ఎక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటే ఎవరికి లాభం.? ఎవరికి నష్టం.! మంత్రి అయితే కావొచ్చుగాక.! అలాంటి విషయాల గురించీ ఆరా తీస్తారా ఎవరైనా.? అంటే, ఇక్కడ లోకేష్ తన గురించి తాను చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారన్నమాట.
తెలుగు సినీ పరిశ్రమలో మెజార్టీ సినీ ప్రముఖులు ఆంధ్రప్రదేశ్‌కి చెందినవారే. నిజానికి, తెలుగు సినీ పరిశ్రమ హైద్రాబాద్‌కి రాకముందు, చెన్నయ్ కేంద్రంగా పనిచేసేది. అక్కడ తెలుగు సినీ పరిశ్రమ వున్నప్పుడు సైతం, ఇప్పుడు తెరపైకొస్తున్న స్థాయిలో ప్రాంతీయ విధ్వేషాల్ని అక్కడి తమిళ ప్రభుత్వం రెచ్చగొట్టలేదన్నది నిర్వివాదాంశం.
'మన తెలుగు గడ్డ..' అంటూ తెలుగు సినీ ప్రముఖులు చెన్నయ్ నుంచి, హైద్రాబాద్‌కి తరలివచ్చారు. అలా తరలివచ్చే ప్రక్రియ చాలాకాలంపాటు సాగింది. ఇప్పటికీ, తెలుగు సినీ ప్రముఖులకి చెన్నయ్‌తో సంబంధాలు పూర్తిగా తెగిపోలేదు. చెన్నయ్‌లో తెలుగువారికి ఇప్పటికీ ఆ స్థాయిలో గౌరవం లభిస్తోంది మరి.! కానీ, తెలుగు రాష్ట్రంలోనే తెలుగు సినీ పరిశ్రమ పట్ల, ప్రభుత్వం నుంచి ఇంత వ్యతిరేకతా.? టీడీపీ సర్కార్ కుటిల నీతికి ఇదొక నిదర్శనమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
విపక్షాల్ని బెదిరించి, బ్లాక్మెయిల్ చేసిన చందాన, తెలుగు సినీ పరిశ్రమని బెదిరించాలనో, బ్లాక్మెయిల్ చెయ్యాలనో ఏపీలోని అధికార టీడీపీ భావిస్తే ఎలా.? అసలు, తెలుగు సినిమాపై టీడీపీ పెత్తనమేంటి.?