ఏదో విధంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె ముగిసింది. ఆర్టీసీని ఖతం చేస్తానని హూంకరించిన సీఎం కేసీఆర్ అనేక కారణాల వల్ల మెట్టు దిగాల్సి వచ్చింది. రాజకీయంగా లాభనష్టాలను బేరీజు వేసుకునే ఆయన ఆర్టీసీ కార్మికులను బేషరతుగా విధుల్లో చేర్చుకున్నారు. వారిని విధుల్లో చేర్చుకునే ముందు ఆయన పెద్ద కసరత్తే చేశారు. సరే…విధుల్లో చేర్చుకున్నారుగాని వారి జీతాల విషయం ఇంకా తేల్చలేదు. సెప్టెంబరులో డ్యూటీ చేశారు కాబట్టి ఆ ఒక్క నెల జీతం ఇచ్చి ఊరుకుంటారా? సమ్మె చేసిన రెండు నెలల జీతం కూడా ఇస్తారా? అనేది నిర్ణయించాల్సి ఉంది.
నిన్న ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకున్నట్లు ప్రకటించిన కేసీఆర్ అదే సమయంలో ఆర్టీసీలో తాత్కాలిక ప్రాతిపదికపై తీసుకున్న కార్మికులకు అంటే డ్రైవర్లుగా, కండక్టర్లుగా పనిచేసినవారికి ధన్యవాదాలు తెలియచేశారు. సమ్మె కాలంలో తాత్కాలిక కార్మికులను బెదిరించినా, అవమానించినా వారు అన్ని భరించి పనిచేశారని కేసీఆర్ వారిని ప్రశంసించారు. 'భవిష్యత్తులో మీ గురించి తప్పకుండా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది' అని హామీ ఇచ్చారు. ఊరికే మాట వరుసకు అన్నాడో, నిజంగానే వారిని గుర్తు పెట్టుకుంటారో చెప్పలేం. కాని వారు మాత్రం 'మేము రోడ్డున పడ్డాం…మా పరిస్థితి ఏమిటి?' అంటూ భోరుమంటున్నారు. తాము ఆర్టీసీ కార్మికులు సమ్మె మొదలుపెట్టినప్పటినుంచి విధులు నిర్వహిస్తున్నామని, ఇప్పుడు వారు విధుల్లో చేరారు కాబట్టి తమను పట్టించుకునే నాథుడు లేడని అంటున్నారు.
సమ్మె సమయంలో తాము ప్రభుత్వానికి అండగా ఉండి, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలు అందించామని అంటున్నారు. కేసీఆర్ తమను ఆదుకోవాలని, అవసరం ఉన్నప్పుడు తీసుకొని,అవసరం తీరాక రోడ్డున పడేయడం సరికాదన్నారు. ఎప్పుడైనా ఆర్టీసీలో ఉద్యోగాలు పడినప్పుడు తమను గుర్తుంచుకొని పరిగణనలోకి తీసుకోవాలంటున్నారు. సరే…ఏం చేస్తాం? వీరి ఆవేదన వీరిది. కాని తాత్కాలిక డ్రైవర్ల వల్ల చాలా ప్రమాదాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. సమ్మె కాలంలో తాత్కాలిక డ్రైవర్లు నడిపిన బస్సులు ఢీకొని కొందరు చనిపోయారు. అలాగే తాత్కాలిక కండక్టర్లు చేతివాటం ప్రదర్శించారని పలు సందర్భాల్లో ప్రయాణికులు ఆరోపించారు. ఒక చోట డ్రైవరు మహిళా కండక్టరుపై అత్యాచారయత్నం కూడా చేశాడు.
తాత్కాలిక డ్రైవర్ల కారణంగా జరుగుతున్న ప్రమాదాలపై హైకోర్టులోనూ పిటిషన్ దాఖలైంది. దీంతో డ్రైవర్లకు ఆరు నెలలపాటు శిక్షణ ఇవ్వాలని హైకోర్టు సర్కారుకు సూచించింది. తాత్కాలిక డ్రైవర్లు ఎవరు? లారీలు, ట్రక్కులు, కార్లు, ట్యాక్సీలు నడపడంలో అనుభవం ఉన్నవారు. వారికి ఆర్టీసీ బస్సులు నడిపిన అనుభవం ఉండదు. కొందరు రిటైర్ట్ డ్రైవర్లు ఉన్నా ఉండొచ్చు. ఆర్టీసీ డ్రైవర్లు శిక్షణలో ఆరితేరి ఉంటారు. వారికి ఓ పద్ధతి ప్రకారం డ్యూటీలు వేస్తారు. నిర్ణీత సమయాల్లో ఆరోగ్య పరీక్షలు చేస్తారు. ఫిట్నెస్ చూస్తారు. ముఖ్యంగా కంటిపరీక్షలు చేస్తారు. మద్యం సేవించి విధులు నిర్వహిస్తున్నారా? అనేది పరీక్షిస్తారు. ఇలా అనేక నిబంధనలు, క్రమశిక్షణ మధ్య వారు పనిచేస్తారు. ప్రైవేటు డ్రైవర్ల మాదిరిగా బస్సులను నిర్లక్ష్యంగా నడిపేందుకు వీలు ఉండదు.
డ్రైవింగ్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో బస్సులో డ్రైవరు ఎదురుగానే బోర్డు ఉంటుంది. 'డ్రైవరన్నా జాగ్రత్త' అని ఉంటుంది ఆ బోర్డు మీద. ఇలా అనేక జాగ్రత్తలతో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు విధులు నిర్వహిస్తారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించారు కాబట్టి తాత్కాలిక కార్మికులకు బాధగా ఉన్నా ఇంటికి వెళ్లక తప్పదు. ప్రభుత్వం వారి సేవలను గుర్తుంచుకుంటుందో లేదో చెప్పలేం. భవిష్యత్తులో ఆర్టీసీలో ఖాళీలు ఏర్పడతాయా? లేదా? అనేది కూడా చెప్పలేం. కేసీఆర్ సీఎంగా ఉన్నంతవరకు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయకపోవచ్చు. పొరపాటున చేశారో ఆర్టీసీయే ఉండకపోవచ్చు.