త్యాగధనులకు దక్కుతున్నది ఏమిటి?

ఒక చిన్నమాట.. భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ఇది రాసుకోవడానికి, చదువుకోవడానికి బాగుంటుంది. అయితే దేశంలో చాలా వ్యవహారాలు అనువంశికంగానే సాగుతున్నాయి. అర్హత ఉన్నా, లేకపోయినా వారసులు పదవులు అధిష్టించేస్తున్నారు. సరిగ్గా మాట్లాడటం రాని వీళ్లు…

ఒక చిన్నమాట..
భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ఇది రాసుకోవడానికి, చదువుకోవడానికి బాగుంటుంది. అయితే దేశంలో చాలా వ్యవహారాలు అనువంశికంగానే సాగుతున్నాయి. అర్హత ఉన్నా, లేకపోయినా వారసులు పదవులు అధిష్టించేస్తున్నారు. సరిగ్గా మాట్లాడటం రాని వీళ్లు మంత్రులై నిర్ణయాలు తీసేసుకొంటున్నారు. వీళ్ల ప్రతిభ ఏస్థాయిలో ఉందో ప్రజలకు అర్థం అవుతూనే ఉంది. ఇలాంటి వాళ్లు తీసుకునే నిర్ణయాలే ప్రజల జీవితాలను నిర్దేశిస్తూ ఉండటం దేశం చేసుకున్న దౌర్భాగ్యం. ఇలా కనకపు సింహాసనాలను అధిష్టిస్తున్న శునకాల సంగతలా ఉంటే, దేశంకోసం నిజంగా త్యాగం చేసిన త్యాగధనుల విషయంలో జరుగుతున్న అన్యాయం మరోవైపు.

మనం అనునిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నా.. నియంత్రణ రేఖ వద్ద ప్రతిరోజూ ఎంతమంది సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారో పత్రికలు లెక్కగట్టి చెబుతూనే ఉన్నాయి. ఇక్కడ ప్రాణం విలువ కేవలం నంబర్లలో మాత్రమే. అంతకు మించి వారి త్యాగం మన హృదయాలను తాకడంలేదు. ఎవరికైనా తమవరకూ వస్తే కానీ ప్రాణం విలువ తెలియకపోవచ్చు. అనుకోకుండా వచ్చే మరణాలనే జీర్ణించుకోలేరు. అలాంటిది చనిపోతామని తెలిసీ కదనరంగంలోకి దూకడం అంటే.. వారి గొప్పదనాన్ని ఎలా కీర్తించగలం? ఏ కీర్తనలు త్యాగధనులకు సిసలైన నివాళి కాగలవు?

ఇటీవలే కార్గిల్‌ విజయ్‌ దివస్‌ను జరుపుకున్నాం. అది గర్వకారణమని భారత ప్రభుత్వం ప్రకటించింది. జనాలు కూడా సోషల్‌ మీడియాలో పోస్టులతో హడావుడి చేశారు. ఇంతేనా? ఇదేనా? త్యాగధనులకు ఇచ్చే నివాళి? ఏదో నామమాత్రంగా ప్రభుత్వం అధికారికంగా నివాళి ఘటించడం, జనాలు కూడా అదేరీతిన తామేదో చేసేశాం అనిపించుకోవడమేనా? ఇంతకు మించి ప్రాణత్యాగం చేసిన సైనికులకు, వారిని కోల్పోయిన కుటుంబాలకు ఇంకేం చేయలేమా? ఇలాగైతే వారి త్యాగం మన హృదయాలను ఏం స్ఫుశిస్తున్నట్టు?

యాంత్రికత మనల్ని ఆలోచించనీయడం లేదా? లేక మనలో వ్యవస్థకు, మనకూ మానవత్వం లేకుండాపోయిందా? ఇలాంటి ప్రశ్నలను మనల్ని మనం వేసుకున్నప్పుడు కొన్ని ఆలోచనలు అయినా రాకమానవు. త్యాగాల్లోకెళ్లా అత్యంత కఠినమైన ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబాలకు ఏదో నష్టపరిహారం అంటూ కొన్ని రూపాయలను ముష్టిగా వేయడం, పురస్కారాల పేరుతో మమ అనిపించడం కన్నా… ఇలాంటి కుటుంబాలను మరింతగా గుర్తించాల్సి అవసరం ఎంతైనా ఉంది.

దేశంలో ఎన్నో నామినేటెడ్‌ పోస్టులను ఎవరెవరికో కేటాయిస్తూ ఉన్నారు. సినిమా వాళ్లకు, క్రికెటర్లకు, ఇలాంటి గ్లామరస్‌ ప్రొఫెషన్లో ఉన్న వాళ్లకు ప్రభుత్వమే నామినేటెడ్‌ పోస్టులు ఇస్తోంది. వీరి సేవలు ఉపయోగపడుతున్నాయని అనుకుంటాం కానీ, ఇదొక వికట ప్రయోగం అని ఇప్పటికే తేటతెల్లం అయ్యింది. ఇలాంటి పదవులు తీసుకున్న సెలబ్రిటీలు కూడా పరువు పోగొట్టుకుంటున్నారు కానీ, అంతకు మించి సాధిస్తున్నది శూన్యం. అందుకే ఒకమాట.. మార్పు తీసుకొద్దాం.

త్యాగధనుల కుటుంబీకులకు, దేశంకోసం దశాబ్దాల పాటు తమ జీవితాలను పణంగాపెట్టి సేవలు చేసిన వారికి నామినేటెడ్‌ గౌరవాలను ఇస్తే? అది వారిని గొప్పగా గౌరవించడమే కదా. మరింతమందిలో స్ఫూర్తిని రగిలించగల మార్పే కదా ఇది? ప్రభుత్వాలు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని, వారిలో ఈ తరహా మార్పు వస్తుందని ఆశిద్దాం.
-ఎల్‌.విజయలక్ష్మి