బహుశా రాజరికపు రోజుల్లోనే అలాంటి నిబంధనలు ఉన్నాయని విని ఉంటామేమో… స్వేఛ్చాయుత వాతావరణమే మనిషి, మనసు ఎదుగుదలకు రాచమార్గంగా భావిస్తున్న ఆధునిక కాలంలోనూ… ఇలాంటి రూల్స్ ఉన్నాయా అనిపిస్తుందా కాలేజ్ తీరు చూస్తే…
చెన్నైలోని సాయిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్‌కి చెందినదిగా చెబుతున్న ఒక ఇంటర్నల్ సర్కులర్ బయటకు రావడం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. సదరు అంతర్గత ఆదేశ పత్రంలో నియమ నిబంధనలు నిబంధనల పేరిట ఆ కాలేజీ కనీసపు స్వేఛ్చను కూడా కాలరాస్తున్న వైనాన్ని నెటిజన్లు నిరసిస్తున్నారు.
సదరు ఆదేశాల ప్రకారం.. అమ్మాయిల్ని అసలు వీరు మనుషుల్లా భావిస్తున్నారా అనే సందేహం వస్తుంది. వీరిపై ఉన్న నిబంధనలేమిటంటే… పొట్టి డ్రెస్సులు మాత్రమే కాదు లెగ్గింగ్స్ వంటి టైట్ ఫిట్స్, షార్ట్ కుర్తాలు కూడా వేసుకు రాకూడదు. అబ్బాయిలతో మాట్లాడడం నిషేధం. మొబైల్ ఫోన్స్ వాడకం నిషేధం, ఫేస్‌బుక్ అకౌంట్ నిషిద్ధం, వాట్సప్ వినియోగం కుదరదు.
లూజ్ హెయిర్ వద్దు, హెయిర్ కలరింగ్ వద్దు, బనియన్ టైప్ క్లాత్ డ్రెస్‌లు కుదరదు, దుపట్టా రెండువైపులా పూర్తిగా పిన్‌తో గుచ్చి ఉంచాలి, పుట్టినరోజు సెలబ్రేషన్స్ నిషిధ్దం, పెన్‌డ్రైవ్‌లు, సిమ్‌కార్డ్‌లు కలిగి ఉండకూడదు…. ఇలా మొత్తం 22 రకాల నిబంధనలతో జారీ అయిన సర్క్యులర్ ను ఎవరో స్క్రీన్ షాట్ తీసి నెట్లో ఉంచారు. ఇప్పుడది సంచలనంగా మారింది. సదరు కాలేజ్ నిబంధనలు అమ్మాయిల కనీసపు హక్కుల్ని కాలరాచే విధంగా ఉండడాన్ని ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఉమన్ అసోసియేషన్ సెక్రటరీ కవితా కృష్ణన్ ఖండించారు.
అయితే ఈ సర్క్యులర్ తమది కాదని దానిపై ఎటువంటి అధికారిక సీల్ లేదని కాలేజీ యాజమాన్యం వాదిస్తోంది. కాని… సదరు కాలేజీకి చెందిన పూర్వ విద్యార్దులు మాత్రం ఆ కాలేజీలో అంతకు మించిన కఠిన పద్ధతులున్నాయని అంటున్నారు.
ఈ కాలేజ్‌లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ స్టాఫ్ దారుణంగా వ్యవహరిస్తారని, గత 2010లో అక్కడి నాన్ టీచింగ్ స్టాఫ్ ఇద్దరు విద్యార్ధులపై తీసుకున్న క్రమశిక్షణ చర్యలకు వ్యతిరేకంగా కళాశాల ముందు, నగరంలోనూ విద్యార్ధులు నిరసనోద్యమాలు చేసిన విషయాన్ని వీరు గుర్తు చేస్తున్నారు.
ఏదేమైనా… చెన్నైలోని పలు ఇంజనీరింగ్ కళాశాలలు ఇదే రకంగా అనధికారిక కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా విద్యార్ధుల పేరెంట్స్‌ను ఆకట్టుకునేందుకు ఈ తరహా నిబంధనలను అవి అనధికారికంగా అమలు చేస్తున్నాయని సమాచారం.