తూటాలకు ఎదురెళ్ళి చచ్చిపోవాలా.?

ఓ వైపు భారత సైన్యానికీ, ఇంకో వైపు పాకిస్తాన్‌ ప్రేరేపిత తీవ్రవాదులకీ భీకరమైన ఎన్‌కౌంటర్‌ జరుగుతోంది.. ఇంకోపక్క, కొందరు 'ఆకతాయిలు' భారత సైన్యం వైపుకి రాళ్ళు రువ్వుతున్నారు.. మరికొందరు ఆకతాయిలు తీవ్రవాదులకు సహాయ సహకారాలు…

ఓ వైపు భారత సైన్యానికీ, ఇంకో వైపు పాకిస్తాన్‌ ప్రేరేపిత తీవ్రవాదులకీ భీకరమైన ఎన్‌కౌంటర్‌ జరుగుతోంది.. ఇంకోపక్క, కొందరు 'ఆకతాయిలు' భారత సైన్యం వైపుకి రాళ్ళు రువ్వుతున్నారు.. మరికొందరు ఆకతాయిలు తీవ్రవాదులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. జమ్మూకాశ్మీర్‌లో ఎప్పుడు ఏ ఎన్‌కౌంటర్‌ జరిగినా, అక్కడ పరిస్థితి దాదాపుగా ఇలానే వుంటుంది. ఈ గలాటాలో కొందరు ఆకతాయిలు ప్రాణాలు కోల్పోవడం మామూలే. మళ్ళీ ఆ తర్వాత ఇంకో గందరగోళం.! 

ఎన్‌కౌంటర్‌ జరుగుతున్న సమయాల్లో అటువైపుకు వెళ్ళొద్దని జమ్మూకాశ్మీర్‌ ప్రభుత్వం తమ పౌరులకు స్పష్టమైన సూచనలు చేసింది. మరోపక్క, భారత వ్యతిరేక నినాదాలు చేస్తే తీవ్రవాదుల్లానే పరిగణిస్తామంటూ ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌ తేల్చి చెప్పారు. అంతే, జమ్మూకాశ్మీర్‌లో కొందరు 'అతివాదులు', రాజకీయ పార్టీలూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడం షురూ అయ్యింది. కాంగ్రెస్‌ పార్టీతో ఈ విషయంలో వామపక్షాలూ గొంతు కలుపుతుండడం గమనార్హం. 

జమ్మూకాశ్మీర్‌లో అన్ని చోట్లా కాకపోయినా, కొన్ని చోట్ల పాకిస్తాన్‌ జెండాలు ఎగరడం అనేది నిత్యకృత్యం. ఐసిస్‌ ఉగ్రవాద సంస్థ జెండాలూ అప్పుడప్పుడూ దర్శనమిస్తుంటాయి. ఇలాంటి సందర్భాల్లోనే ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతుంటాయి. భద్రతాదళాలపైకి స్థానిక యువత (అందరూ కాదు, తీవ్రవాద భావజాలంతో ఊగిపోతున్నవారు మాత్రమే) విరుచుకుపడ్డం, ఈ క్రమంలో భద్రతాదళాలు కాల్పులు జరపడం సర్వసాధారణం. 

దశాబ్దాలుగా కాశ్మీర్‌లో పాకిస్తాన్‌ ప్రేరేపిత తీవ్రవాదం రగుల్చుతోన్న రావణకాష్టం అలాగే మండుతూనే వుంది. ఎప్పుడో ఒకప్పుడు ఈ మారణహోమానికి ముగింపు పలకాల్సిందే. జమ్మూకాశ్మీర్‌ ప్రభుత్వం అయినా, ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌ అయినా.. ఆ దిశగానే అడుగులేశాయనుకోవాలి. ఈ పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు సంయమనం కోల్పోతుండం దురదృష్టకరం. ఎన్‌కౌంటర్‌ జరుగుతోంది.. అటువైపు వెళ్ళొద్దని సూచించడం తప్పట. అంటే, తుపాకీ గుళ్ళకు ఎదురెళ్ళమని సోకాల్డ్‌ రాజకీయ పార్టీలు చెబుతున్నాయా.? దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేయమని రెచ్చగొడ్తున్నాయా.?