భారతదేశం అభివృద్ధి చెందుతోంది.. సాక్ష్యం కావాలా.? న్యూ ఇయర్ వేడుకల పేరు చెప్పి బెంగళూరులో మహిళలపై జరిగిన 'సామూహిక లైంగిక వేధింపులు' దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాక, ఇంతకన్నా అభివృద్ధికి సాక్ష్యం ఇంకేం కావాలట.! అవును, దేశం అభివృద్ధి చెందుతోంది. ఎక్కడో విదేశాల్లో, గన్ కల్చర్ పెరిగినట్లు.. వెస్ట్రన్ కల్చర్ వెర్రి తలలు వేస్తున్నట్లు.. ఇదిగో, మన భారతదేశంలో కూడా.. 'యువతరం' కొత్త పుంతలు తొక్కుతోందని అనుకోవాలేమో.!
మహిళల వస్త్ర ధారణపై దేశవ్యాప్తంగా ఎప్పటినుంచో చర్చ, రచ్చ.. రెండూ జరుగుతున్నాయి. ఎవరి గోల వారిది. ఏది తప్పు.? ఏది ఒప్పు.? అని ఎవరూ ఇప్పుడు మాట్లాడలేని పరిస్థితి. ఇంటినుంచే అబ్బాయిల్లో 'సంస్కారం' షురూ అవ్వాలన్నది సోకాల్డ్ మహిళా మేధావుల వాదన. 'ఇండియన్ మ్యాన్..' అంటూ బెంగళూరులో జరిగిన వికృత చర్యకి.. దేశంలోని భారతీయ పురుషులందర్నీ ఒకే గాటన కట్టేసింది ఓ జాతీయ మీడియా సంస్థ.
బెంగళూరులో జరిగింది చిన్న ఘటన ఏమీ కాదు. చాలా చాలా పెద్ద ఘటన, చాలా సీరియస్ అంశం కూడా. న్యూ ఇయర్ వేడుకలు గత కొంతకాలంగా గాడి తప్పుతున్నాయన్నది నిర్వివాదాంశం. పాలకులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఇవి ఆగడంలేదు. డ్రగ్స్, గంజాయి న్యూ ఇయర్ వేడుకల్లో యువతీయువకుల్ని మత్తులో ముంచెత్తుతున్నాయి. పార్టీలకు వెళ్ళడం, సెలబ్రేషన్స్ చేసుకోవడమే వెస్ట్రన్ కల్చర్.. అనుకుంటున్నారు తప్ప, అక్కడేం జరుగుతుంది.? అని ఆలోచించలేకపోతున్నారు. ఇక్కడే వస్తోంది సమస్య అంతా.
ఫలానా ఈవెంట్‌లో ఫలానా అకృత్యం జరిగింది గనుక, ఇంకోసారి అలాంటి ఈవెంట్‌కి వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని యువతీ యువకులు అనుకోవడంలేదు. తద్వారా కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. గంజాయి, మాదక ద్రవ్యాల్ని పోలీసులు పట్టుకోవడంలో కొంతవరకు సఫలమవుతున్నారు. అదే సమయంలో, ఇలాంటి ఈవెంట్లు పక్కదారి పడ్తున్నా, వాటిని పూర్తిస్థాయిలో అరికట్టలేని అచేతనావ్యవస్థ పోలీసు శాఖలో వుంటోంది. దానిక్కారణాలనేకం, అందులో ముఖ్యమైనది రాజకీయ ఒత్తిళ్ళు.
పాశ్చాత్య పోకడలన్నిటినీ తప్పు పట్టేయాల్సిన పనిలేదు. కానీ, అవి మన దగ్గర ఎంతవరకు సేఫ్.? మన దగ్గర ఎంతవరకు యాక్సెప్టబుల్.? అనేది కూడా ఆలోచించుకోవాలి కదా.! వస్త్రధారణ అసహ్యంగా వుంటే ఇలాంటి ఘటనలు జరుగుతాయంటూ నిర్లక్ష్యపూరితమైన కామెంట్స్ రాజకీయ నాయకుల నుంచి రావడం సహజమే. చట్టాలు చేసేది వాళ్ళే కదా, వాళ్ళెందుకు డ్రెస్సింగ్ సెన్స్ మీద చట్ట సభల్లో మాట్లాడరు.? ఇంకా నయ్యం, అలా చర్చిస్తే ఓటు బ్యాంకులకు చిల్లుపడిపోదూ.! ఇంత తీవ్రమైన ఘటనలు జరిగినప్పుడు జస్ట్ డ్రెస్సింగ్ మీద కామెంట్ చేసి ఊరుకోవడమంటే అంతకన్నా చేతకానితనం ఇంకోటి వుండదు.
ఒక్కటి మాత్రం నిజం.. దేశంలో లైంగిక వేధింపులు నానాటికీ పెరిగిపోతున్నాయి. నిర్భయ చట్టం కూడా వాటిని ఆపలేకపోతోంది.