సరిగ్గా ఏడాది కిందట ఆగస్ట్ నెలలో డిజాస్టర్లు చూసింది టాలీవుడ్. ఆ చేదు జ్ఞాపకం మరోసారి రిపీట్ అవుతుందేమో అని ట్రేడ్ భయపడింది. కానీ ఈ ఏడాది ఆగస్ట్ మాత్రం మెరిసింది. చాపకింద నీరులా వచ్చిన గూఢచారి మెరవగా, భారీ అంచాల మధ్య వచ్చిన గీతగోవిందం ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది.
ఆగస్ట్ మొదటివారం ఏకంగా అరడజను సినిమాలతో బాక్సాఫీస్ ఓపెన్ అయింది. వీటిలో బాగా ఆకట్టుకున్న సినిమా గూఢచారి. అన్నీ తానై అడివి శేష్ తీసిన ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంది. కేవలం 5 కోట్ల రూపాయల బడ్జెట్ లో తీసిన ఈ సినిమా 20 కోట్ల రూపాయల రిచ్ నెస్ తీసుకొచ్చింది. ఈ సినిమాతో నటుడిగానే కాకుండా, రచయితగా కూడా తనలో టాలెంట్ ఉందని మరోసారి నిరూపించుకున్నాడు అడవి శేషు. అటు సాక్ష్యం దెబ్బతో డీలాపడిన అభిషేక్ నామాకు కూడా గూఢచారి కాస్తంత ఊరటనిచ్చింది.
ఇక ఇదేవారం గూఢచారితో పాటు చిలసౌ, బ్రాండ్ బాబు సినిమాలు కూడా థియేటర్లలోకి వచ్చాయి. వీటిలో సుశాంత్ నటించిన చిలసౌ మూవీ ఓ మోస్తరుగా ఆకట్టుకుంది. ప్రేమ కంటే కామెడీ బాగా వర్కవుట్ అవ్వడంతో ఇది సేఫ్ వెంచర్ అనిపించుంది. కానీ గూఢచారిలో థియేటర్లలో గట్టిగా నిలబడలేకపోయింది. ఇక మారుతి బ్రాండ్ తో వచ్చిన బ్రాండ్ బాబు అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ సినిమాలతో పాటు వచ్చిన తరువాత ఎవరు?, మన్యం, శివకాశీపురం సినిమాలు కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.
రెండో వారంలో రెండే సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. రెండూ హైప్ ఉన్న సినిమాలే. కానీ రెండూ ఫ్లాప్ అయ్యాయి. అవే శ్రీనివాస కళ్యాణం, విశ్వరూపం-2. దిల్ రాజు బ్యానర్ పై నితిన్ చేసిన సినిమా శ్రీనివాసకళ్యాణం. మరోసారి బొమ్మరిల్లు, శతమానంభవతి టైపు మేజిక్ ను రిపీట్ చేస్తుందని ఊహించిన ఈ సినిమా మేకర్స్ కు షాకిచ్చింది. ఈ మూవీ తర్వాత 24 గంటల గ్యాప్ లో వచ్చిన విశ్వరూపం-2 సినిమా కూడా ఫ్లాప్ అయింది. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత సీక్వెల్ గా రావడం, కథ-స్క్రీన్ ప్లే అగమ్యగోచరం, అయోమయంగా ఉండడంతో ఈ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయింది.
అలా రెండోవారం స్తబ్దుగా మారిన బాక్సాఫీస్ కు ఓ ఊపుతెచ్చింది గీతగోవిందం. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాకు మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. అలా బ్లాక్ బస్టర్ హిట్ తో ఇప్పటికీ థియేటర్లలో కొనసాగుతోంది ఈ సినిమా. గీతగోవిందం సినిమా అల్లు అరవింద్ కు లాభాలు తెచ్చిపెట్టడంతో పాటు విజయ్ దేవరకొండకు యూత్ లో ఉన్న ఫాలోయింగ్ ను ఎలివేట్ చేసింది.
ఏదో గాలివాటుగా అర్జున్ రెడ్డి హిట్ అయిందని, విజయ్ దేవరకొండకు అంత సీన్ లేదని వచ్చిన విమర్శలకు గీతగోవిందంతో ఫుల్ స్టాప్ పడింది. కేవలం ఆగస్ట్ లోనే కాదు, ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది గీతగోవిందం సినిమా. అటు ఓవర్సీస్ లో కూడా ఆల్ టైం హిట్స్ లిస్ట్ లోకి చేరిపోయింది. ఇక ఈ మూవీతో పాటు అదే వారం వచ్చిన జ్యోతిక డబ్బింగ్ సినిమా ఝాన్సీని పట్టించుకున్న నాధుడులేడు.
గీతగోవిందం ఎఫెక్ట్, ఆ తర్వాత వారం విడుదలైన సినిమాలపై కాస్త గట్టిగానే పడింది. ఆగస్ట్ నాలుగో వారంలో ఆటగాళ్లు, నీవెవరో, అంతకుమించి, లక్ష్మి సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో ఏ ఒక్కటి థియేటర్లలో నిలవలేకపోయింది. ముందుగా ఆటగాళ్లు విషయానికొస్తే, జగపతిబాబు-నారా రోహిత్ కలిసి నటించిన ఈ సినిమా స్క్రీన్ ప్లేతో మేజిక్ చేస్తుందని అంతా ఊహించారు. కానీ ఇదో నాసిరకమైన సినిమా. ఈ మూవీతో పాటు వచ్చిన నీవెవరో సినిమా కోన వెంకట్ రైటింగ్ తో మెస్మరైజ్ చేస్తుందనుకుంటే, అందరూ ఊహించే విధంగా సాగే ట్విస్టులతో ఇది కూడా నీరసంగా తయారైంది.
ఈ రెండింటితో పాటు వచ్చిన అంతకుమించి, లక్ష్మి సినిమాలది కూడా అదే వ్యథ. హాట్ బ్యూటీ రష్మి అందాలనే నమ్ముకొని తెరకెక్కించిన అంతకుమించి సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. గత చిత్రాలతో పోలిస్తే రష్మి అంతకుమించి చూపిస్తుందని జనాలు భావించారు. కానీ మూవీలో మేటర్ వేరు. ఇక ప్రభుదేవా నటించిన డాన్స్ షో లక్ష్మి చిత్రం కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.
ఆగస్ట్ ఆఖరివారం కూడా రిలీజ్ ల సందడి కనిపించింది. ఆగస్ట్ కు ఫినిషింగ్ టచ్ ఇస్తూ ఏకంగా 5 సినిమాలొచ్చాయి. వీటిలో నర్తనశాల, పేపర్ బాయ్ సినిమాలపై ప్రేక్షకుల్లో ఓ మోస్తరు అంచనాలుండేవి. కానీ ఈ రెండు సినిమాలు ఆ అంచనాల్ని అందుకోలేకపోయాయి. కామెడీ పండించడం చేతకాక నర్తనశాల, ప్రేమ పొంగించడంలో విఫలమై పేపర్ బాయ్ ఫ్లాప్ అయ్యాయి.
వీటితో పాటు వచ్చిన సమీరమ్, కోకో కోకిల, క్రైమ్ 23 సినిమాలు కూడా ఫ్లాపులే. నయనతార నటించిన కోకో కోకిల సినిమా కోలీవుడ్ లో పెద్ద హిట్. కానీ ఆ మేజిక్ ఇక్కడ పనిచేయలేదు. మొత్తమ్మీద ఆగస్ట్ నెలలో దాదాపు 20 సినిమాలు విడుదలైతే, వాటిలో గీతగోవిందం, గూఢచారి, చిలసౌ మాత్రమే ఆకట్టుకున్నాయి.