నందమూరి ఇంటి పేరు తారక్ వెన్నంటే ఉన్నప్పటికీ… ఇన్నేళ్లుగా నందమూరి కుటుంబీకులతో తారక్ అటాచ్‌మెంట్ కేవలం హరికృష్ణ మాత్రమే. తండ్రి మాత్రమే నందమూరి కుటుంబంతో తారక్ బంధం కొనసాగడానికి కారణం అయ్యాడు. రెండోభార్య పిల్లలకు తండ్రితో మాత్రమే అటాచ్‌మెంట్ ఉంటుంది. ఇదెలా ఉంటుందో సినిమా రూపకంగా చెప్పాలంటే మణిరత్నం 'ఘర్షణ' చూడాలి. కార్తీక్, ప్రభులు నటించిన తమిళ సినిమా 'అగ్నినక్షత్రం' తెలుగులోకి 'ఘర్షణ' పేరుతో అనువాదం అయ్యింది.
డబ్బింగ్ క్లాసిక్స్‌లో ఒకటిగా నిలిచింది ఆ సినిమా. అందులో విజయ్ కుమార్‌కు రెండోభార్య కొడుకు కార్తిక్. రెండో భార్యను, ఆ భార్యతో కలిగిన పిల్లలను చాలా ఆప్యాయంగా చూసుకొంటూ ఉంటాడు ఆ తండ్రి. అయితే మొదటి భార్యకు సహజమైన కోపం, విజయ్ కుమార్ తల్లి మద్దతు కూడా మొదటిభార్య వైపే. ఇదంతా సినిమా కథ మాత్రమేకాదు.. భారతీయ సమాజంలో కొన్నేళ్ల కిందటి వరకూ చాలా కామన్ అయిన చిన్నిల్లు కథే ఇది. ఈ పరిస్థితి మారి మహా అంటే రెండు దశాబ్దాలు అయి ఉండవచ్చు.
ఇప్పటికీ పల్లెల్లోకి వెళ్లిచూస్తే… ఇద్దరు భార్యలున్న వ్యక్తులు.. ఇద్దరితోనూ సంసార భవబంధాన్ని ఈదుతున్న మగాళ్లు చాలామంది కనిపిస్తారు. విడాకుల చట్టం వచ్చాకా.. కొన్ని దశాబ్దాల పాటు ఇండియాలో చాలామంది మగాళ్లు ఈ ఫ్లెక్సిబులిటీని ఉపయోగించుకున్నారు. మొదటిభార్య చనిపోయాకా రెండోపెళ్లి చేసుకున్న వాళ్లు కొందరైతే.. భార్య బతికి ఉండగానే.. రెండో ఇళ్లను పెట్టినవాళ్లు మరెంతో మంది. వంద ఇళ్లున్న గ్రామంలో కూడా కనీసం ఇద్దరు ముగ్గురు అయినా ఈ తరహాలో కనిపిస్తూ ఉంటారు.
అయితే ఇప్పుడు రోజులు అలా లేవు. ఈ సోషల్ మీడియా యుగంలో పెళ్లితో సంబంధం లేకుండా సంబంధాలు పెట్టుకునే వాళ్లు చాలామందే కనిపిస్తారు కానీ, రెండో పెళ్లిని అధికారికం చేసుకునేవాళ్లు మాత్రం తక్కువైపోయారు. గుట్టుగా నడిపించే వాళ్లు ఉన్నారేమో కానీ… రెండోభార్యకు, రెండోభార్య పిల్లలకు అధికారిక గుర్తింపును ఇచ్చేవాళ్లు మాత్రం తక్కువైపోయారు. ఓపెన్‌గా చెప్పాలంటే.. గ్రామాల్లో కూడా ఆర్థికంగా, సామాజికంగా ఇప్పటికీ వెనుకబడ్డ కొన్ని సామాజికవర్గాల్లో మాత్రమే ఇంకా అధికారికమైన రెండో ఇళ్లు కొనసాగుతూ ఉంది. వాళ్లలోకూడా చదువుకున్న వాళ్లు దీనికి దూరం అయిపోయారు.
ఇక ఈ చిన్నిల్లు కల్చర్‌కు రెండోపెళ్లికి సెలబ్రిటీలు అతీతులు కాదు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ ఆరాధ్య నాయకులుగా నీరాజనాలు అందుకున్న చాలామంది హీరోలు, దర్శకులు, రచయితలు… రెండో కుటుంబానికి అధికారిక గుర్తింపును ఇచ్చిన వాళ్లుగా ఉన్నారు. అలనాటి బాలీవుడ్ సూపర్‌స్టార్ ధర్మేంద్ర రెండు సంసారాలను ఈదిన వ్యక్తే. మొదటి భార్యతో కలిగిన సంతానం సన్నీ, బాబీ డియోళ్లతో చాలా ఫ్రెండ్లీగా కనిపిస్తాడు ధర్మేంద్ర.
ఇక రెండోభార్య హేమతో ఆడపిల్లలే. ఈషా, అహనా.. వీళ్ల పెళ్లిళ్లను కూడా చేశాడు ధర్మేంద్ర. మొదటి భార్యతో విడాకులు తీసుకోలేదు.. రెండో భార్యతో ఎంచక్కా దశాబ్దాలుగా కాపురం చేస్తున్నాడు. మరింత విశేషం.. చట్టబద్ధం కానీ ఈ రెండోభార్య దేశ చట్టసభలో ఎంపీ. ఇక విడాకుల తర్వాత మొదటి భార్యతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూ.. రెండోభార్యతో సెటిలైన మరో ప్రముఖుడు బోనీకపూర్. శ్రీదేవి భర్తగా భారతీయులందరికీ ఇతడు పరిచితుడే.
రెండోభార్య పిల్లలతో సమానంగా మొదటిభార్య పిల్లలను కూడా చూసుకుంటూ వస్తున్నాడు. తనయుడిని సొంత ప్రొడక్షన్లో హీరోగా ఇంట్రడ్యూస్ చేశాడు. ఇలా సమన్యాయం చేశాడీయన. తెలుగు హీరోల్లో సూపర్‌స్టార్ కృష కూడా సమన్యాయం చేసిన వ్యక్తే. పవన్ కల్యాణ్ మాత్రం ఎప్పటికప్పుడు కొత్త కుంపట్లు పెడుతూ వస్తున్నాడు. నాగార్జున కూడా సంతానం విషయంలో సమన్యాయం చేస్తున్నాడు. ఇదే కోవకే వస్తారు దివంగత హరికృష్ణ కూడా.
నందమూరి కుటుంబంలో ఎన్టీఆర్ తర్వాత నటన విషయంలో బాలయ్య సత్తాచూపిస్తే.. ఆ తర్వాతి తరంలో మాత్రం గంపెడు సంతానంలో సత్తా చూపిస్తున్నది ఒక్క తారక్ మాత్రమే. కానీ పై కుటుంబాలకూ నందమూరి కుటుంబంలోని వ్యవహారాలకు మధ్య వ్యత్యాసం ఒక్కటే. అదే తారక్‌ను కొంతవరకూ నిర్లక్ష్యం చేశారనే ప్రచారం రావడం. హరికృష్ణ తన తనయుడిని బాగా చూసుకున్నాడు. కానీ.. మిగిలిన కుటుంబం మాత్రం ఆయన రెండో ఇంటికి గుర్తింపును ఇవ్వలేదనే ప్రచారం మొదటి నుంచి ఉంది.
ఆఖరికి బాలయ్య పెద్ద కూతురు పెళ్లి సమయంలో ఈ వ్యవహారంపై చాలా చర్చే జరిగింది. అయితే అప్పటికి నందమూరి ఫ్యామిలీ దాదాపుగా నారా గుప్పిట్లోకి వెళ్లిపోయింది. చంద్రబాబు నాయుడు తారక్‌ను తన అవసరానికి వాడుకోవడం మొదలుపెట్టాడు. 2009 ఎన్నికల్లో ప్రచారం చేయించుకున్నాడు. అయితే అందుకు ఫలితం దక్కలేదు. ఆ తర్వాత తారక్‌ను చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం మానేశాడు.
తాతనే అవసరానికి వాడుకుని అవసరం లేనప్పుడు తొక్కేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన ముందు ఈ మనవడో లెక్క? ఇక ఇన్నాళ్లూ ఒక లెక్క.. ఇప్పుడు మరోలెక్క. ఇన్నేళ్లూ నందమూరి కుటుంబానికి తారక్‌కు ఉన్న అటాచ్‌మెంట్ హరి. తండ్రిపై ప్రేమాప్యాయతలతో తారక్ నడుచుకొంటూ వచ్చాడు. అదే సమయంలో అన్నదమ్ములతో మంచి బంధాన్ని కొనసాగించాడు.
హరి పెద్ద తనయుడు జానకిరాంతో తారక్‌కు చాలా సాన్నిహిత్యం ఉందని, ప్రేమ వివాహం చేసుకున్న జానకిరామ్‌కు చిన్న తమ్ముడు తారక్ చాలా అండగా నిలిచాడని అంటారు. అలాగే హీరోగా సక్సెస్‌ఫుల్ గా కెరీర్‌ను సాగించలేకపోతున్న కల్యాణ్‌రామ్‌కు కూడా ఇప్పుడు తారక్ అండగా మారాడు. ఇక బాలయ్య కొన్నేళ్లుగా ఎన్టీఆర్‌పై అంత ప్రేమతో అయితే కనిపించడంలేదు. ఒకేరోజు సినిమాలతో ఢీకొనే దశకు వచ్చి చాలాకాలం అయ్యింది.
ఇక అభిమానుల్లో కూడా బాలయ్య ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనే స్పష్టమైన చీలిక ఉంది. కోస్తాజిల్లా కమ్మ వాళ్లలోనే ఈ రెండువర్గాలు ఏర్పడటం గమనార్హం. ఏం జరిగినా చంద్రబాబును వదిలి పక్కకు రాలేని పరిస్థితిలో ఉన్నాడు బాలయ్య. ఇలాంటి నేపథ్యంలో హరి అనంతరం తారక్ ప్రస్థానం మరోరకంగా ఉండబోతోంది. తాతయ్య నటనా పటిమనే కాకుండా.. నాయకత్వ లక్షణాలను కూడా అందిపుచ్చుకునేలా ఉన్నాడు తారక్.
దీన్నిబట్టి ఇతడే ఇకపై బాలయ్య మినహా నందమూరి కుటుంబానికి పెద్దదిక్కుగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తెలుగుదేశం వారసత్వాన్ని పూర్తిగా తన తనయుడికే అప్పగించాలి అనేది బాబు లెక్క. 'పప్పు' అనిపించుకుంటున్న లోకేష్‌కే పార్టీకి భావి నాయకుడు తప్ప మరెవరూ కాదని బాబు తేల్చి చెబుతున్నాడు.
అయితే మరికొంచెం నిలదొక్కుకుంటే.. చంద్రబాబు, లోకేష్‌లకు భవిష్యత్తులో పెద్ద సవాల్‌గా మారే అవకాశాలు మాత్రం ఖాయంగా ఉన్నాయి.