ఓడలు బండ్లు, బళ్లు ఓడలు అవుతాయంటారు. మూడు సినిమాలు నిర్మించిన వాడు, ఓ సినిమా నిర్మించండి, అంటూ తన దగ్గర వున్న మంచి పాయింట్ పట్టుకుని, నిర్మాతల చుట్టూ తిరగడం అంటే ఏమనుకోవాలి? అలా కిందా మీదా పడి సినిమా సంపాదించి, తనేంటో ప్రూవ్ చేసుకున్న తరువాత మళ్లీ బోలెడు ఆఫర్లు ఫోన్ ల రూపంలో రావడం అంటే ఇంకేమనుకోవాలి.
సినిమా ప్రపంచం ఇంతే అని సరిపెట్టుకోవడమే. నిర్మాత, దర్శకుడు మహీ వి రాఘవ్ సంగతి ఇలాంటిదే. విలేజ్ లో వినాయకుడు, కుదిరితే కప్పు కాఫీ లాంటి కాస్త మంచి సినిమాలు నిర్మించారు. పాఠశాల లాంటి అవుట్ ఆఫ్ ది బాక్స్ సినిమాను తానే దర్శకత్వం, స్క్రిప్ట్ సమకూర్చి అందించారు. కానీ ఎక్కడా కమర్షియల్ విజయం ఆశించన మేరకు సాధించలేదు. కానీ తొలిసారి ఓ మంచి హిట్ సాధించారు. అదే ఆనందో బ్రహ్మ. ఈ నేపథ్యంలో మహీ వి రాఘవ్ తో చిట్ చాట్.
ఎక్కడో పుట్టి, ఎక్కడికో వెళ్లి సినిమాల్లోకి ఎందుకు వచ్చారు?
నేను విదేశాలకు వెళ్లి వుండొచ్చు. మంచి ఉద్యోగాలు చేసి వుండొచ్చు. కానీ బేసిక్ గా నేను పెరిగింది చిన్న పల్లెటూ్ళ్లో, పక్కా మన తెలుగు సినిమాలు చూస్తూ పెరిగా. ప్రపంచ సినిమాను నేను పరిచయం చేసుకునే నాటికే నా బుర్ర నిండా తెలుగు సినిమా నిండిపోయింది. అందుకే ఇక్కడకు వచ్చా.
కానీ సరైన మాంచి స్టార్ట్ లేదా మాంచి బ్రేకప్ రాలేదు కదా? ఏం చేసారు?
ఏం చేసాను. రెండేళ్లు ఫారిన్ వెళ్లి పనిచేయడం, నాలుగు డబ్బులు సంపాదించి తెచ్చి, సినిమాల మీద పెట్టడం. నాకు కానీ, నా ఫ్యామిలీ కి కానీ లగ్జరీ లైఫ్ మీద ఆసక్తి లేదు. నాకు ఇక్కడ ఏదో ఒకటి సాధించాలన్న తపన వుంది. అందుకే ఇదంతా.
అంటే ఆనందో బ్రహ్మ ఆడకపోయి వుంటే మళ్లీ..?
అంతేగా? అది డిసైడ్ అయి వుంటూనే సినిమాలు చేస్తూ వున్నా.
పాఠశాల లాంటి మంచి సినిమా చేసి, ఒక్కసారిగా ఆనందోబ్రహ్మ లాంటి ఫక్తు కమర్షియల్ సినిమాకు ఎందుకు షిప్ట్ అయ్యారు?
నాకు తెలుగు సినిమా అంటే ఇష్టం అండీ. అది ఎలాంటి సినిమా అన్నది కాదు. నేను అన్నీ తీయగలను. రేపు ఎవరైనా అవకాశం ఇస్తే పక్కా భారీ కమర్షియల్ సినిమా కూడా చేయగలను. అంతే తప్ప ఒకే తరహా సినిమాకు నేనేం కట్టుబడి లేను. రేపు అవకాశం వస్తే మాంచి రొమాంటిక్ కామెడీ కూడా తీయాలని వుంది. లేదూ యాక్షన్ థ్రిల్లర్ అయినా చేయాలని వుంది.
పాఠశాల తరువాత నిర్మాతగా మీరు సినిమా చేయలేదు. ఈ సినిమాకు అవకాశం ఎలా వచ్చింది?
నిజం చెప్పాలంటే, ఆనందో బ్రహ్మ సబ్జెక్ట్ ను చాలా మందికి చెప్పాను. కోటిన్నరలో తీసి ఇస్తా అన్నా. కానీ ఎవ్వరూ అవకాశం ఇవ్వలేదు. వాళ్ల తప్పేం లేదు. ఎవరైనా సరేనా విజయం వెనుకే పరుగెట్టాలనుకుంటారు. కానీ అదృష్టం కొద్దీ ఈ నిర్మాతలు నా స్క్రిప్ట్ ను నమ్మారు. అవకాశం ఇచ్చారు. ప్రూవ్ చేసుకున్నాను.
సినిమాను థియేటర్ లో చూసాక ఎలా అనిపించింది?
జనాల స్పందన చూసి, కళ్ల నీళ్లొచ్చినంత పనయింది. కాస్త మంచి సినిమా ఇస్తే వాళ్లు ఇంత అభిమానం చూపిస్తారు కదా అనిపించింది. అది నిలబెట్టుకోవడానికి జాగ్రత్తగా వుండాలనిపించింది.
స్క్రిప్ట్ ను ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేయాలని అనిపించిందా?
అది ఎప్పుడూ అనిపిస్తుంది. ఇదే కాదు మరే స్క్రిప్ట్ అయినా, కానీ ఒక స్థాయి వరకే కరెక్షన్లు కానీ, ఇంప్రూవ్ మెంట్ కానీ చేయగలం. స్క్రిప్ట్ మీద ఒక పాయింట్ దగ్గర శాటిస్ ఫై అయితేనే లాక్ చేయగలం. ఇదే సినిమా రేపు ఏదైనా భాషలోకి రీ మేక్ చేస్తే, అప్పుడు ఇంకా ఇంప్రూవ్ మెంట్ చేయగలను.
తరువాతి సినిమా ఎప్పుడు?
ఇప్పుడే కదా ఈ ఆనందం అనుభవంలోకి వచ్చింది. మాంచి రొమాంటిక్ కామెడీ జోనర్ లో చేయాలని వుంది. ఈ నిర్మాతలు నాకు అవకాశం ఇచ్చి, ప్రూవ్ చేసుకోవడానికి దోహదం చేసారు. అందుకే వాళ్లు వద్దంటే తప్ప, లేదూ అంటే అదే బ్యానర్ లో సినిమా చేస్తా. మాంచి అయిడియాలు కొన్ని వున్నాయి. వాటికి తగిన స్టార్ కాస్ట్, బ్యానర్లు దొరకాలి. తొందరేం లేదు. ఇప్పట్లో మళ్లీ విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేసి డబ్బులు తెచ్చుకోవాల్సినంత అగత్యం లేదని ఆనందోబ్రహ్మ భరోసా ఇచ్చింది. అది చాలు.