ఇది లాక్ డౌన్ టైమ్…కొందరికి ఇబ్బంది కావచ్చు. కానీ కొంత మందికి ఇది ఓ మంచి సదవకాశం. ముఖ్యంగా క్రియేటివ్ పీపుల్ కి. సినిమా దర్శకులు ఫుల్ గా ఇప్పుడు తమ తమ వ్యాపకాల్లో మునిగిపోయారు. కొత్త అయిడియాలకు పదును పెడుతున్నారు. కొత్త స్క్రిప్ట్ లు తయారు చేసుకుంటున్నారు. అలాంటి దర్శకులను పలకరిస్తే…
పాఠశాల లాంటి మంచి సినిమా తీసినా సరైన గుర్తింపు రాలేదు డైరక్టర్ మహి కి. కానీ యాత్ర సినిమా తీసి, తనేంటో తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. యాత్ర సినిమా తరువాత సైలంట్ మోడ్ లోకి వెళ్లిపోయిన మహి ఈ క్వారంటైన్ టైమ్ లో ఏం చేస్తున్నారు..జస్ట్ ఓ సారి హలో చెబుదాం.
-హాయ్ మహీ గారూ
హాయ్ అండీ..
-ఎలా వున్నారు? ఏం చేస్తున్నారు?
వంట చేస్తున్నా అండీ. ఇంట్లో ఇప్పుడ నా డ్యూటీ కుకింగ్.
-అదేంటీ
క్వారంటైన్ టైమ్ కదా..మెయిడ్స్ లేరు. పనులు షేర్ చేసుకోవాలి. ఈ గిన్నెలు తోమడం, ఇల్లు మ్యాపింగ్ అదంతా మన వల్ల కాదు, అని ఈ కుకింగ్ పోర్ట్ ఫోలియో తీసుకున్నాను.
-అవునా, మరేం చేస్తున్నారు డైలీ పిల్లలకు స్పెషల్స్
ఒకటేమిటి అన్నీ చేయగలను. బిరియానీ, చికెన్, మటన్, చైనీస్ ఏదైనా రెడీ.
-నోరు ఊరించేస్తున్నారుగా..
అవునా..అడ్రస్ చెప్పండి పంపేస్తాను
-వద్దు లెండి కానీ, యాత్ర తరువాత మల్టీస్టారర్, భారీ సినిమా అని విన్నాము. ఇప్పుడేంటి పరిస్థితి
తాత్కాలికంగా ఆ ప్రాజెక్టు పక్కన పెట్టాం అండీ. ఈ పరిస్థితులు చూడాలి కదా. ఈ లోగా వెబ్ సిరీస్ మీదకు వెళ్తున్నా. ఆహా కు ఒకటి, నెట్ ఫ్లిక్స్ కు ఒకటి చేసే అవకాశం వుంది.
-మన వాళ్లు వెబ్ సిరీస్ లు అంటే చాలు, అడల్ట్ టచ్ కు వెళ్లిపోతున్నారు. కానీ నేషనల్, ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ లు చూస్తుంటే, ఆ స్టాండర్డ్, ఆ కాన్సెప్ట్ లు చాలా భిన్నంగా వుంటున్నాయి.
దీనికి చాలా కారణాలు వున్నాయి. నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థ రోజుకు ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల కోట్లు ఖర్చుచేస్తుంది అంటే రోజుకు ఓ బాహబలి అన్నమాట. అలాంటి సంస్థతో వెబ్ సిరీస్ అంటే మనమే వెళ్లాలి, కూర్చోవాలి. డిస్కస్ చేయాలి. చేతిలో సినిమాలు వున్న పెద్ద డైరక్టర్ లు ఎందకు వెళ్తారు.వెళ్లరు. ఇక రీజనల్ ఓటిటి లు బడ్జెట్ ఎక్కువ పెట్టలేవు. దానికి తగినట్లు చేయాలి. పైగా రీజనల్ ఓటిటి లు అంటే ఆ ఆడియన్స్ సెటప్ వేరు. దీంతో సినిమాల్లో చాన్స్ లు తగ్గిన వారో, ఏదో ఒకటి చేయాలి అనుకున్నవారో అక్కడికి వెళ్లి, ఆ బడ్జెట్ లో ఎంతో కొంత మిగుల్చుకుని , ఏదో ఒకటి చేసి వస్తే ఇలాగే వుంటుంది. అలా కాకుండా వెబ్ సిరీస్ లను ప్రేమించి, ఆకళింపు చేసుకుని, చేస్తే మరోలా వుంటుంది.
-ఇంతకీ మీరేం చేయబోతున్నారు.
వెబ్ సిరీస్ మార్కెట్ మరో పదిహేనేళ్లు వుంటుంది. అందుకే నేను ఇప్పటి నుంచే మిగుళ్లు, లాభాలు చూడాలనుకోవడం లేదు.ముందు మంచి ప్లేస్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. మరీ యూనివర్సల్ అప్పీల్ కాకున్నా, కాస్త ఫన్, ఎంటర్ టైన్ మెంట్ వుండాలనుకుంటున్నాను.
-ఇంతకీ మీ యాత్ర 2, అదే వైఎస్ జగన్ బయోపిక్ సంగతేమిటి?
చేయాలండీ. అయితే ఇప్పుడే కాదు. ఒ ఏడాది వెబ్ సిరీస్ లు, మరో ఏడాది ఓ చిన్న సినిమా చేసి, అప్పుడు 2022 లేదా 2023 నాటికి చేయాలనుకుంటున్నాను.
-జగన్ జీవిత కథ సినిమాకు సెట్ అవుతుందా?
అబ్సల్యూట్లీ. నిజానికి వైఎస్ కథను సినిమా చేయడానికి ఇబ్బంది పడాలేమో కానీ, జగన్ జీవితం గురించి కాదు. ఎందుకంటే గాడ్ ఫాదర్ అంత డెప్త్ వుంది. హీరోయిజం వుంది. కష్టాలు వున్నాయి. దరిద్రం వుంది. అడ్మిరేషన్ వుంది. పోరాటం వుంది. ఇలా ఓ మాంచి ఎమోషనల్ జర్నీ వుంది. అంతకన్నా సినిమాకు ఏం కావాలి?
-మరి ఎందుకు ఆలస్యం?
అంటే జగన్ అన్న ఓకె అనాలి. దానికి తగిన కాస్టింగ్ సెట్ కావాలి. మళ్లీ కథకు అవసరం అయితే వైఎస్ క్యారెక్టర్ ను కూడా చూపించాలి. ఇవన్నీ వున్నాయి. ఈలోగా ముందు నేను రెండు వెబ్ సిరీస్ లు, ఓ చిన్న సినిమా చేయాలి.
-థాంక్యూ…వీలయినంత త్వరగా కరోనా వంట డ్యూటీ నుంచి బయటకు వచ్చి, గరిటె బదులు మళ్లీ మెగాఫోన్ పట్టుకుంటారని ఆశిస్తూ, పట్టుకోవాలని కోరుకుంటూ..
థాంక్యూ..తప్పకుండా
విఎస్ఎన్ మూర్తి