ప్రతి ఏటా జులైలో ఓ సర్ ప్రైజ్ హిట్ పడుతూనే ఉంది. 2015 జులైలో బాహుబలి వచ్చింది. చరిత్ర సృష్టించింది. 2016 జులైలో పెళ్లిచూపులు సినిమా వచ్చింది. ఊహించని విధంగా హిట్ అయింది. 2017 జులైలో ఫిదా వచ్చింది, బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 2018 జులైలో ఆర్ఎక్స్ 100 వచ్చింది. సెన్సేషనల్ హిట్ అయింది. ఈ ఏడాది జులైలో ఆ స్థానాన్ని ఇస్మార్ట్ శంకర్ భర్తీ చేసింది. ఈ సినిమాతో పాటు జులై నెలలో వచ్చిన ఓ బేబీ సినిమా కూడా హిట్ అయింది.
జులై మొదటివారంలో మెరిసిన ఒకే ఒక్క సినిమా ఓ బేబీ. సమంత నటించిన ఈ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా మంచి ఫలితాన్నందుకుంది. ఇంకా చెప్పాలంటే సమంత సోలోగా కొట్టిన హిట్ ఇది. అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరింది. ఈ మూవీతో పాటు వచ్చిన మిగతా సినిమాలేవీ ఆడలేదు. ఆది సాయికుమార్ నటించిన బుర్రకథ, ప్రేక్షకుల బుర్ర తినేసింది. ఇక తారకరత్న నటించిన కాకతీయుడు సినిమాతో పాటు దుర్మార్గుడు అనే మరో సినిమాను ఆడియన్స్ అస్సలు పట్టించుకోలేదు.
జులై రెండోవారంలో ఏకంగా 5 సినిమాలొచ్చాయి. ఇదేవారంలో శ్రీహరి కొడుకు మేఘాంష్, విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ తమ అదృష్టాల్ని పరీక్షించుకున్నారు. అంతేకాదు, హీరో సందీప్ కిషన్ కూడా నిర్మాతగా మారి తన లక్ చెక్ చేసుకున్నాడు. ఆనంద్ దేవరకొండ నటించిన దొరసాని సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది తప్ప కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది. ఆనంద్ దేవరకొండ నటనకు కూడా పెద్దగా మార్కులు పడలేదు. కానీ ఇదే సినిమాతో హీరోయిన్ గా మారిన రాజశేఖర్ చిన్నకూతురు శివాత్మిక నటనను మాత్రం అంతా మెచ్చుకున్నారు.
దొరసానితో పాటు విడుదలైన శ్రీహరి కొడుకు సినిమా రాజ్ దూత్ డిజాస్టర్ అవ్వగా.. తొలిసారి నిర్మాతగా మారి సందీప్ కిషన్ తీసిన నిను వీడని నీడను నేనే సినిమా ఓ మోస్తరు విజయాన్నందుకుంది. వీటితో పాటు ఆ వారంలో వచ్చిన మార్కెట్లో ప్రజాస్వామ్యం, కేఎస్100 సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి.
జులై మూడోవారంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ దుమ్ముదులిపింది. పూరి-రామ్ ఫస్ట్ కాంబోలో వచ్చిన ఈ సినిమా వసూళ్ల పరంగా డబుల్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. జులైలో అతిపెద్ద కమర్షియల్ హిట్ ఇదే. పైగా ఇది ఎవరూ ఊహించని విజయం కూడా. ఎందుకంటే పూరి ట్రాక్ రికార్డు అందరికీ తెలిసిందే. అటు రామ్ కూడా ఫ్లాపుల్లో ఉన్నాడు. కాబట్టి మహా అయితే సినిమా యావరేజ్ అవుతుందని అంతా అనుకున్నారు. రిలీజైన మొదటిరోజు కూడా అదే టాక్ వచ్చింది. కట్ చేస్తే, సినిమా బ్లాక్ బస్టర్ అయింది.
ఇస్మార్ట్ దెబ్బకు అమలాపాల్ నటించిన “ఆమె” సినిమా నిలబడలేకపోయింది. పైగా రిలీజ్ కష్టాలు ఈ సినిమాను వెంటాడాయి. నగ్నంగా నటించిందనే బజ్ తో సినిమాకు మొదటి రోజు టిక్కెట్లు బాగానే తెగాయి. కానీ ఆర్థిక సమస్యల వల్ల ఫస్ట్ డే రిలీజ్ కాలేదు. అలా “ఆమె” సినిమా క్రేజ్ కోల్పోయింది. ఇక విక్రమ్ నటించిన మిస్టర్ కెకె సినిమా డిస్కషన్ లోకి కూడా రాలేదు. విక్రమ్ సినిమాల్ని తెలుగు ఆడియన్స్ పట్టించుకోవడం మానేశారు.
ఇక జులై ఆఖరివారంలో డియర్ కామ్రేడ్, నేను లేను సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. వీటిలో నేను లేను సినిమా డిజాస్టర్ అనిపించుకోగా.. డియర్ కామ్రేడ్ సినిమా మిక్స్ డ్ టాక్ తో మొదలైంది. ప్రస్తుతం ఈ సినిమాకు కలెక్షన్లు బాగా పడిపోయాయి. బ్రేక్ ఈవెన్ కోసం కిందామీద పడుతోంది.
ఇలా జులై నెలలో అటుఇటుగా 17 సినిమాలు రిలీజ్ అయితే వీటిలో ఇస్మార్ట్ శంకర్, ఓ బేబీ మాత్రమే క్లిక్ అయ్యాయి. ఆగస్ట్ లో మన్మథుడు-2, రణరంగం, సాహో లాంటి సినిమాలొస్తున్నాయి. వీటిలో ఎన్ని నిలబడతాయో చూడాలి.