ఈ ఏడాది ఏప్రిల్ నెలలో బాక్సాఫీస్ కళకళలాడింది. మార్చి 30న విడుదలైన రంగస్థలం సినిమా సందడి మొత్తం ఏప్రిల్ లో కొనసాగింది. దీనికి తోడు భరత్ అనే నేను సినిమా కూడా వచ్చింది. అలా నెల ప్రారంభంలో రంగస్థలం, చివర్లో భరత్ అనే నేను సినిమాలతో ఏప్రిల్ నెలంతా బాక్సాఫీస్ వద్ద మంచి ఉత్సాహం కనిపించింది. కాకపోతే మధ్యలో వచ్చిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి.
ఏప్రిల్ మొదటి వారంలో ఛల్ మోహన్ రంగ విడుదలైంది. నితిన్, మేఘా ఆకాష్ జంటగా నటించిన ఈ సినిమా ఫెయిల్ అయింది. త్రివిక్రమ్, పవన్ కల్యాణ్ లాంటి హేమాహేమీల పేర్లు ఈ సినిమాను కాపాడలేకపోయాయి. అప్పటికే విడుదలైన రంగస్థలం సినిమా మంచి ఊపు మీద ఉండడం, ఛల్ మోహన్ రంగ సినిమాలో ప్రాస డైలాగులు తప్ప పస లేకపోవడంతో ఏప్రిల్ ఫస్ట్ వీక్ మొత్తం రంగస్థలం హవా కనిపించింది. ఛల్ మోహన్ రంగతో పాటు అదే వారం విడుదలైన సత్య గ్యాంగ్, ఇంతలో ఎన్నెన్ని వింతలో, గులేబకావళి సినిమాలు కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.
ఫస్ట్ వీక్ వచ్చిన సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడంతో రెండోవారంలో విడుదలకు సిద్ధమైన కృష్ణార్జున యుద్ధంపై అందరి చూపు పడింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని, ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఇది. ఈ సినిమా కూడా సక్సెస్ అయితే నానికి ట్రిపుల్ హ్యాట్రిక్ దక్కేది. కానీ అలా జరగలేదు.
ఏప్రిల్ 12న వచ్చిన కృష్ణార్జున యుద్ధం అట్టర్ ఫ్లాప్ అయింది. అప్పటివరకు నాని సంపాదించుకుంటూ వచ్చిన స్టార్ డమ్, సినిమాపై చేసిన ప్రచారం, అంచనాలు ఏవీ పనిచేయలేదు. విడుదలైన మొదటి రోజు నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా దాదాపు 14కోట్ల రూపాయల నష్టం తెచ్చిపెట్టింది. ఇదే వారం విడుదలైన మెర్కురి అనే సైలెంట్ థ్రిల్లర్ మూవీ అతికొద్ది మందికి మాత్రమే నచ్చింది. ఎక్కువ మందిని మెప్పించలేకపోయింది. అలా ఇది కూడా బాక్సాఫీస్ ముందు బోల్తాకొట్టింది.
ఛల్ మోహన్ రంగ, కృష్ణార్జున యుద్ధం లాంటి సినిమాలు ఫ్లాప్ అయి.. రంగస్థలం దూసుకుపోతున్న టైమ్ లో వచ్చింది భరత్ అనే నేను. మహేష్ నటించిన ఈ సినిమా ఏప్రిల్ మూడో వారంలో విడుదలైంది. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ ముఖ్యమంత్రిగా నటించిన ఈ పొలిటికల్ డ్రామా సూపర్ హిట్ అయింది.
అప్పటివరకు కొనసాగిన రంగస్థలం హవాకు స్పీడ్ బ్రేకర్ లా నిలిచాడు భరత్. పాజిటివ్ టాక్ తో వసూళ్ల వర్షం కురిపిస్తున్నాడు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మహేష్, రామ్ చరణ్ సినిమాల మధ్య రసవత్తర పోరు సాగుతోంది. నాన్-బాహుబలి రికార్డును ఎవరు అందుకుంటారో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
భరత్ అనే నేను తర్వాత బాక్సాఫీస్ మరోసారి డల్ గా మారింది. ఏప్రిల్ చివరివారంలో అత్యథిక సంఖ్యలో సినిమాలు విడుదలైనప్పటికీ ఏ ఒక్కటీ ఆకట్టుకోలేదు. నవ్వులు పూయిస్తాడనుకున్న ఆచారి ఆడియన్స్ ను ఏడిపించాడు. కొత్తగా మెస్మరైజ్ చేస్తుందనుకున్న కణం తుస్సుమనిపించింది. వీటితో పాటు వచ్చిన మరో 3 చిన్న సినిమాలు కూడా డిజాస్టర్ అయ్యాయి.
ఓవరాల్ గా రంగస్థలం, భరత్ అనే నేను సినిమాలు మాత్రమే ఏప్రిల్ నెలలో మెరిశాయి. ఈ రెండు సినిమాలు సాధించిన విజయాలు అలాంటిలాంటివి కావు. ఈ ఏడాది టాలీవుడ్ బిజినెస్ మొత్తాన్ని ప్రభావితం చేసే రేంజ్ లో విజయాలు అందుకున్నాయి. ఇక మే నెలలో రాబోతున్న నా పేరు సూర్య, మహానటి, మెహబూబా, టాక్సీవాలా, నేలటిక్కెట్, నా నువ్వే సినిమాలు ఎలాంటి విజయాలు సాధిస్తాయో చూడాలి.