ఇసుక మాఫియాపై కరువైన చిత్తశుద్ధి

ఇసుక ర్యాంపుల్లో సిసి కెమేరాలు, మహిళా సంఘాలకు ఇసుక ర్యాంప్ లు, శాటిలైట్ శాయంతో ఇసుక ర్యాంప్ ల గుర్తింపు..ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం చెబుతున్న తాజా నిర్ణయాలు. ఇసుక మాఫియా అన్నది రాష్ట్రంలో అత్యంత…

ఇసుక ర్యాంపుల్లో సిసి కెమేరాలు, మహిళా సంఘాలకు ఇసుక ర్యాంప్ లు, శాటిలైట్ శాయంతో ఇసుక ర్యాంప్ ల గుర్తింపు..ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం చెబుతున్న తాజా నిర్ణయాలు. ఇసుక మాఫియా అన్నది రాష్ట్రంలో అత్యంత బలంగా తయారైంది. గోదావరి జిల్లాల నుంచి సైతం హైదరాబాద్ కు ఇసుక తరలి వస్తోంది. ఆ మధ్య సినిమాలకు, కంపెనీ ఉత్పాదనలకు పోస్టర్లు అంటించినట్లు ఇసుక ర్యాంప్ లకు ప్రచారం నిర్వహించారు. తమ దగ్గర వున్న ఆధునిక సామగ్రి, ఎంత త్వరితంగా ఇసుక లోడ్ చేయగలరో ఆ ప్రకటనల్లో వివరించారు. ఈ వైనం అలా వుంచితే, ఏటి ఒడ్డు గ్రామాల్లోని అనాథరైజ్డ్ గ్రామ కమిటీలతో ఇసుక మాఫియాలు ఎక్కడిక్కడ ఒప్పందం చేసుకుంటున్నాయి. అక్కడ ఇసుక లభ్యతను బట్టి గ్రామానికి ఇంత అని డబ్బులు అందిస్తున్నాయి. 

ఇలా ఒప్పందం కుదరడానికి సహకరించిన గ్రామ పెద్దలకు మళ్లీ లోపాయికారీ ఆమ్యామ్యాలు అందిస్తున్నాయి. ఇవి కాక రెవెన్యూ అధికారులను కట్టడి చేయడం కూడా తప్పదు. ఇంతలా ఖర్చు చేస్తూ, వ్యవస్థీకృతంగా మారిపోయిన ఇసుక మాఫియా వ్యవహారంపై వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అన్నది అనుమానం. ఇసుక ర్యాంపుల్లో వెబ్ క్యామ్ లు పెట్టి ఏం సాధిస్తారు. స్థానికులు, అధికారులు, మాఫియా ఒక్కటైతే వెబ్ క్యామ్ లు ఏం సాధిస్తాయి..పోనీ వెబ్ క్యామ్ లను సెంట్రల్ కార్యాలయంలో మానిటరింగ్ చేస్తారనుకుంటే, అక్కడ ఇంటర్ నెట్ సదుపాయం ఎలా లభిస్తుంది. ఇవ్వాళ పల్లెలకే నెట్ సదుపాయంలేదు. ఇక నదీ తీరాలకు ఎలా సాధ్యం? ఇక మహిళా సంఘాలకు అప్పగించడం అన్న వైనం కూడా అంతంత మాత్రం ఫలితాలనే ఇచ్చే అవకాశం వుంది. 

మహిళా సంఘాల పేరిట బినామీలు రంగప్రవేశం చేయడం గ్యారంటీ. లేదా మహిళా సంఘాలు భారీ ఎత్తున ఇసుక తరలింపు, అధికారులను ప్రసన్నం చేసుకోవడం వంటి వ్యవహారాలు సాగించలేదు. అక్కడ మళ్లీ ఇసుక మాఫియా ప్రత్యక్షమై హోల్ సేల్ గా హక్కులు తీసుకుని వారికి ఇంత అని ఇచ్చే పని ప్రారంభించదని గ్యారంటీ ఏమిటి? అంతకన్నా ఇసుక ర్యాంపులనే కాదు. అసలు ఇసుక తరలింపుపైనే తాళాలు వేయాలి. ఎక్కడి ఇసుక అక్కడి గ్రామాలకు అప్పగించాలి. తరలించే ప్రతి ఇసుక వాహనానికి గ్రామ కార్యాలయం నుంచి అనుమతి పత్రం వుండాలి. అలా అనుమతి పత్రం వుండాలంటే, గ్రామ పంచాయతీకి ఇంత అని ప్రతి వాహనానికి రుసుం చెల్లించాలి. లారీ, ట్రాకర్ట్, ఎడ్లబండి..ఇలా సామర్ధ్యం ప్రాతిపదికన రుసుం నిర్ణయించాలి. రుసుం చెల్లించిన రసీదు లేని వాహనాలను పట్టుకుని, కఠిన శిక్షలు, జరిమానాలు అమలు చేయాలి. అందుకు అనుగుణంగా చట్టాలు మార్చాలి..కొత్త నిబందనలు చేర్చాలి. 

ఇలా చేయడం వల్ల గ్రామాలకు నిధులు అందుతాయి..మాఫియా అరికట్టడానికి సాధ్యం అవుతుంది. అలా కాకుండా గంపగుత్తన ఇచ్చేయడం వల్ల మాఫియాలు లాభపడతాయి..ఆదాయం గ్రామాలకు కాకుండా ప్రభుత్వానికి చేరుతుంది. గ్రామాలు అలాగే అభివృద్ధికి దూరంగా వుండిపోతాయి. కానీ ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించదు. ఎందుకంటే ప్రభుత్వానికి ఆదాయం రావాలి. మాఫియా అనబడే రాజకీయ అనుబంధ జనాలు బాగుపడాలి..వారు కోట్లు సంపాదించి, మళ్లీ ఎన్నికల నిధులు ఇచ్చేందుకు బలోపేతం కావాలి. అందుకే ఈ కర్ర విరగకూడదు..పాము చావకూడదు అనే విధానం. ఒకేసారి ఫీజు అని కాకుండా ఎప్పటిప్పుడు వసూళ్లు చేయడం వల్ల ఎంతయినా ఆదాయం వస్తుంది. ఉదాహరణకు టోల్ గేట్లు ఇంత అని గంపగుత్తగా ఇస్తున్నారు. పాడుకున్న రాజకీయ అనుబంధ రాబందులు హాయిగా అంతకు పదింతలు వసూళ్లు సాగిస్తున్నారు. అదే కనుక ప్రభుత్వమే సిబ్బందిని నియమించి, ఇప్పుడు ప్రయిువేటు జనాలు సాగిస్తున్నట్లు పకడ్బందీగా వసూళ్లు సాగిస్తే ఎంత ఆదాయం పెరుగుతుంది. కానీ ప్రభుత్వాలు అలా చేయవు. ఎందుకంటే పరోక్షంగా తమ రాజకీయ పార్టీలను నమ్ముకున్న వారికి మేలు చేయాల్సిన బాధ్యత వాటిపై వుంటుంది కాబట్టి, ఎందుకంటే మళ్లీ ఎన్నికల వేళకు వాళ్లు బలోపేతమై తమకు ఎన్నికల నిధులు అందించాలి కాబట్టి. 

అందుకే ఈ చిత్తశుద్ది లేని వృధా ప్రయత్నాలు. జనాలకు మాత్రం ప్రభుత్వం ఏదో భారీగా చేస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ మళ్లీ మాఫియాదే పైచేయి అవుతుంది. ఎటొచ్చీ వాటాలు పెరగడం వల్ల, ఇసుక రేటు మరింత ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. గవర్నమెంట్ పెంచేసింది..మమ్మల్నేంచేయమంటారు అని జనాల ముక్కుపిండి వసూళ్లు చేసుకుంటారు. దీంతో నిర్మాణ వ్యయం పెరిగి సామాన్యుడే బాధపడతాడు. ఈ కథ ఎప్పటికీ ఇంతే..ప్రభుత్వాలు నడిపే పార్టీలు ఏవైనా, చిత్తశుద్ది కరువైనంత కాలం,.

చాణక్య

[email protected]