ఉనట్లుండి మెగాస్టార్, చిరంజీవి పేరు జంప్ జిలానీల జాబితాలో చేరుతుందని ఎందుకు వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ చిరంజీవిని తమ పార్టీలోచేర్చుకోవాలని ఎందుకు ఉబలాటపడుతోంది. ఒకప్పుడు తమ పార్టీ ఓటమికి కారణమైన వ్యక్తిని ఇప్పుడు తెలుగుదేశంలోకి లాగాలని ఎందుకు చూస్తోంది. ఈ మేరకు తెలుగుదేశం అభిమానులు ఎందుకు లోపాయికారీ ప్రచారం సాగిస్తున్నారు.
దీనంతటకూ ఒకటే సమాధానం వినిపిస్తోంది..పవన కళ్యాణ్ మద్దతు అనేది నమ్మకంగా కొనసాగతుందని నమ్మకం లేకపోవడమే అన్నదే ఆ సమాధానం. పవన్ కళ్యాణ్ వైనం చాలా చిత్రమైనది. తనకు నచ్చడం, నచ్చకపోవడం అన్నదాన్ని బట్టి వుంటుంది మద్దతు ఇవ్వడం ఇవ్వకపోవడం. అన్న వున్నాడు కదా అని కాంగ్రెస్ పార్టీని నమ్మలేదు..మద్దతు ఇవ్వలేదు.
ఇప్పుడు అయిదేళ్ల తరువాత భాజపాతోనే వుండాలనీ లేదు ఉండకూడదనీ లేదు. జనసేన పార్టీగా మారదనీ లేదు. దానికి భాజపా మద్దతు ఉండకూడదనీ లేదు. అందుకే ముందు జాగ్రత్తగా చిరంజీనిని ఇటు తీసుకువస్తే బాగుంటుందని తెలుగుదేశం వర్గాలు భావిస్తున్నట్లు బోగట్టా.
ఒకవేళ భవిష్యత్ ఎన్నికల యుద్ధంలో పవన్ ఎదురు నిలిచినా, చిరంజీవి ఇటు వుంటే కాస్త సేఫ్. ఎందుకంటే పవన్ నేరుగా అస్త్రాలు సంధించడు. అటు వైకాపా వైపు అస్త్రాల గురి మార్చేస్తాడు. మొన్నటి ఎన్నికల్లో కూడా పవన్ కాంగ్రెస్ మీద కన్నా, వైకాపా మీదే గురి ఎక్కువగా పెట్టాడన్నది వాస్తవం.
ఎవరు ఎన్ని చెప్పినా అన్నదమ్ములంతా ఒకటే అని, వారు వారు తమ తమ అనుబంధాలు కలిగే వున్నారని రాజకీయ జనం భావిస్తున్నారు. అందువల్ల చిరు తెలుగుదేశంలో వుంటే పవన్ ను కాస్త తట్టుకోవచ్చని, పార్టీలోని కాపు నాయకులు కూడా కూడా వుంటారని భావిస్తున్నారు. చిరు కు సిద్ధాంత బేధాలు, పార్టీ మారకూడదన్న భేషజాలు ఎలాగూ లేవు. ఒకసారి పార్టీ మారినా, వంద సార్లు మారినా ఒకటే. ఉపముఖ్యమంత్రి పదవి లాంటిది ఆశచూపితే చిరు హాయిగా ర్యాంప్ వాక్ చేసుకుంటూ వచ్చేస్తారన్నది తెలుగుదేశం అభిమానుల ధీమా.
అందుకే చిరంజీవి తెలుగుదేశం పార్టీలోకి ఎప్పటికైనా వస్తారన్న ప్రచారం షురూ అయిందంటున్నారు. ఇది ఎంతవరకు నిజమవుతుందో కాలమే చెప్పాలి. ఎందుకంటే చిరు రాజ్యసభ సభ్యత్వం ముగియడానికి ఇంకా చాలా కాలం వుంది కనుక.