నవ్వి పోదురు గాక, నాకేటి సిగ్గు.. నా ఇచ్ఛయే గాక నాకేటి వెరపు.. అన్న కవితా పంక్తులు చాలా మందికి గుర్తుండే వుంటాయి. కవి దేవులపల్లి అప్పట్లో అన్న వైనం, వ్యవహారం వేరు. కానీ ఈ తరం రాజకీయ నాయకులు అందరూ పక్కాగా ఇదే గీతావాక్యంగా తల దాలుస్తున్నారు. ఎటొచ్చీ.. నా ఇచ్ఛయే గాక అనే బదులు, నా అధికారమే గాక.. అని మార్చుకున్నారంతే.
ముఫై ఏళ్ల క్రితం ఎన్టీఆర్ పార్టీ పెట్టే నాటికి కాంగ్రెస్ నాయకులు ఒకరి కాళ్లు ఒకరు లాగుకోవడం ముమ్మరంగా వుండేది. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల నుంచి, ఎలా దింపేద్దామా అని ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అధిష్టానం ఢిల్లీలో వుండడంతో, ఆంధ్రుల జుట్టు అక్కడ వుండేది. అందుకే ఎన్టీఆర్ ఆంధ్రుల ఆత్మగౌరవం అనడంతో, జనాలు విరగబడి ఓట్లేసారు. ఇప్పుడు మన ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని రాజకీయ నాయకులు ఢిల్లీ స్థాయిలో కాదు, ఇక్కడ గల్లీ స్థాయిలోనే తగలేస్తున్నారు. కేవలం అధికారం పరమావథిగా ఎవరు ఏమనుకుంటే నాకేం అన్నట్లు ప్రవర్తిస్తున్నారు.
నాదెండ్ల భాస్కరరావు టైమ్ లో ఎమ్మెల్యేలు అటు ఇటు గెంతుతుంటే, ఎన్టీఆర్ అభిమానులు కొట్టినంత పని చేసారు. గంటెల సుమన, గ్రంధి మాధవి, లాంటి ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించాల్సి వచ్చింది. అప్పుడు కాస్త ఊగిసలాడారని, జంట ఎమ్మెల్యేలుగా పేరు పొందిన ఎర్రంనాయుడు, గౌతు శివాజీలకు ఎన్టీఆర్ తరువాత టికెట్లు ఇవ్వలేదు. బడుగు వర్గాల నాయకుడిగా పేరొందని గౌతు లచ్చన్న కాస్త అటు ఇటుగా కనిపించేసరికి జనం ఖస్సుమన్నారు. ఎన్టీఆర్‌ను కాదని స్వంతంత్రులుగా పోటీ చేసి, మాంచి మెజార్టీతో గెలిచిన ఎర్రం నాయుడు, శివాజీ, అయిదేళ్ల పాటు కాంగ్రెస్ అనుబంధ ఎమ్మెల్యేలుగా కొనసాగారు. ఆపై మళ్లీ చంద్రబాబు దయతో తెలుగుదేశంలో చేరారు.
చెన్నారెడ్డి టైమ్‌లో మంత్రి పదవి ఇవ్వలేదని పెనుమత్స సాంబశివరాజు పార్టీని వదిలినంత పని చేసారు. అప్పట్లో ఆయన ఫైళ్లు పట్టుకు తిరిగేవారు బొత్స. అయినా పార్టీ మారకుండానే, వేచి వుండి, జనార్థన రెడ్డి టైమ్ లో మంత్రి పదవి తెచ్చుకున్నారు పెనుమత్స. గోదావరి జిల్లాల్లో ఒక్క ముద్రగడ తరచు కాస్త అటు ఇటు మారేవారు కానీ, మిగిలిన వారు కాస్త నిలదొక్కుకునే వుండేవారు.
ఇదంతా ఎందుకు చెప్పడం అంటే, ఒక ఎమ్మెల్యే లేదా ప్రజా నాయకుడు తమ స్టాండ్ మార్చుకోవాలన్నా, స్టాండ్ తీసుకోవాలన్నా ఓ ప్రాతిపదిక వుండేది. కాస్త ఆలోచన వుండేది. కాస్త ముందు వెనుక వ్యవహారం నడిచేది.
కానీ ఇప్పుడు పార్టీ మారడం అన్నా, మాట మార్చడం అన్నా, మంచి నీళ్ల ప్రాయమైపోయింది. పోనీ పార్టీ మార్చారు. అందుకోసం మాట మార్చారు అనుకుంటే, అంత నిస్సిగ్గుగా ఎలా మాట్లాడగలుగుతున్నారో అనిపిస్తుంది.
2014 ఎన్నికల నాటికి రాజకీయ వాతావరణం ఎంతలా మారిపోయిందంటే, గంట క్రితం ఏమన్నారు.. ఇప్పుడేమంటున్నారు అన్నది అర్థం కానంత. నిన్నటి వరకు ఎక్కడున్నారు.. ఇవ్వాళ ఎక్కడున్నారు అనుకునేంత.
సమైక్యాంధ్ర ఉద్యమం ఏమయింది? ఆ వేళ ఈ సోకాల్డ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడిన మాటలేమిటి? వాటన్నింటిని మరచిపోయారు. ఆపైన ఎన్నికల వేళ వచ్చేసరికి పార్టీలను దుస్తులు మార్చినట్లు మార్చేసారు. దాంతోపాటే మాటలు కూడా మార్చేసారు. అసలు నిన్నటి సంగతే ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారు.
కెసిఆర్ సంగతే చూడండి.. తాను ఎన్నడూ కాంగ్రెస్‌తో కలుస్తానని అనలేదంటున్నారు. కాంగ్రెస్‌లో కలిసే విషయమై ఎన్నోసార్లు ఆయనను మీడియా అడగడం, ఆయన ఏదో ఒకటి చెప్పడం మామూలే. అవన్నీ మరిచారు. పైగా అన్నింటి కంటే, ఎస్ సి వర్గానికి ముఖ్యమంత్రి పదవి ఇస్తానన్న దాన్నే వదిలేసారు. పైగా గడచిన ఎన్నికల నాటికి తెలుగుదేశం పొత్తుతో ముందుకెళ్లారు. ఇప్పుడు అది సీమాంధ్ర భూస్వామ్య పార్టీ అయిపోయింది.
వెంకయ్యనాయుడు వైనమే గమనించండి.. రెండు రాష్ట్రాల విధానానికి కట్టుబడి వుంది భాజపా, అందుకే విడదీయడానికి అనుకూలం అంటారు. సీమాంధ్రకు ప్యాకేజీ డిమాండ్ చేసింది తామే అంటారు. కానీ కేంద్రం చూస్తే, రెండు రాష్ట్రాలకు ఒకే తరహా ప్యాకేజీ ఇస్తోంది. మరి ఇంక చేసింది ఏమిటి? అంటే సమాధానం వుండదు.
పురంధేశ్వరి, చిరంజీవి ఇద్దరూ కేంద్ర మంత్రులు, తరచు కలిసే సోనియాతో సమావేశం అయ్యేవారు. హైదరాబాద్ యుటి అన్నది చిరంజీవి జపంగా వుండేది. అదే సీమాంధ్ర సర్వరోగ నివారణి అన్నట్లు మాట్లాడేవారు. మొత్తానికి మాట చెల్లలేదు. కానీ ఇప్పుడు ఆ ఊసే మరిచారు. అదేమీ లేనట్లే సీమాంధ్రలో కాంగ్రెస్ కోసం ప్రచారం సాగిస్తున్నారు. మళ్లీ అలా అని తమ్ముడు వ్యవహారం ప్రస్తావిస్తే, ఆయన సిద్ధాంతాలు తనకు తెలియదంటారు. ఏం… పత్రికలు చదవడం లా? దేనికి మద్దతు అంటున్నారో తెలియడలా? వాటిపై కామెంట్ చేయలేరా? మంచిదో చెడ్డదో చెప్పలేరా? అదే మరో నాయకుడు అయితే ఇలాగే మాట్లాడతారా? తమ్ముడు కాబట్టి తప్పించుకోవడం.
చిత్రంగా పురంధేశ్వరి రివర్స్ అయ్యారు. నిన్నటి దాకా రాహుల్ కోటరీలోని మనిషి. మంత్రి పదవి చివరి రోజు వరకు వుంచుకుని, సకల సదుపాయాలు అనుభవించి, ఇప్పుడు మోడీ జపం చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా తెదేపా – భాజపా కూటమి విజయం సాధించాలంటున్నారు. మరి తేదేపాతో పడేక కదా, తండ్రి ఎన్టీఆర్ జీవితకాలం ద్వేషించిన కాంగ్రెస్‌లో చేరింది. చంద్రబాబుతో పడేక కదా, భర్త దగ్గుబాటి దూరంగా వున్నది. పుస్తకం రాసింది. మరి ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఎలా అనగలుగుతున్నారు? అసలు స్థానికుల పదవులు పైవాళ్లు కొట్టుకుపోతుంటే కదా, తెలంగాణ లాంటి ఉద్యమాలు పుడుతున్నాయి. అలాంటిది తనేక సంబంధం లేని రాజంపేట వెళ్లడం ఎందుకు? ఎక్కడో అక్కడ పోటీ పడాల్సిందేనా? పైగా నిన్నటి దాకా కాంగ్రెస్‌ను, సోనియా, రాహుల్‌ను కీర్తించిన నోటితో, ఇప్పుడు మోడీ భజన, బాబు కీర్తన ఎలా పాడగలుగుతున్నారు?
జగన్ మాత్రం తక్కువ తిన్నాడా? తల్లి విజయమ్మను ఆ కొస నుంచి తీసుకు వచ్చి, ఇక్కడ విశాఖ నెత్తిపై వుంచడం ఎందుకో? ఇప్పటికే ఉత్తరాంధ్ర నెత్తిపై దక్షిణ కోస్తా రాజకీయ నాయకులు ఎక్కి తొక్కుతున్నారు. అది చాలక సీమ వాసులు కూడా అన్నమాట. మరి ఉత్తరాంధ్ర జనం కినిసి కినిసి, మరో ఉద్యమానికి బాటలు వేస్తే బాధ్యత ఎవరిది? అదొక్కటే కాదు, తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వడం, మళ్లీ వెనక్కు తీసుకోవడం అంటే ఏమిటి? విభజన అన్నది కీలకమైన విషయం. అలాంటి దానిపై లేఖ ఇవ్వడం అంటే ఎంత ఆలోచించాలి.
చంద్రబాబు. గడచిన ఎన్నికల తరువాత వైఎస్ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభిస్తే, విమర్శలతో విరుచుకుపడ్డ పార్టీ. అంతే కాదు. కాంగ్రెస్ వాదులను అవినీతి పరులు, దొంగలని విమర్శించిన పార్టీ. మరి ఏ ప్రాతిపదికన వారందరినీ పార్టీలోకి చేర్చుకుంది. గంటా శ్రీనివాసరావు విజయవాడలో పర్యాటక ప్రాజెక్టు చేజిక్కుంచుకుంటే, ఆందోళన జరిపింది తెలుగుదేశం వారే కదా. అవన్నీ ఎలా మరిచిపోయారు? ఒక్క గంటా అనే మాటేమిటి? ఇప్పుడు దేశంలో చేర్చుకున్న వారందరితో గతంలో ఇంతో అంతో పార్టీ జనాలకు వైరం లేకుండా వుందా? అవన్నీ హాయిగా మరిచిపోయారు.
కిరణ్ కుమార్ రెడ్డి వైనమైతే మరీ చిత్రం. సమైక్య ఉద్యమ సమయంలో ఆయన పలికినన్ని ఉత్తరకుమార ప్రగల్భాలు ఎవరూ పలికివుండరు? కానీ ఇప్పుడు విభజన పాపాన్ని మిగిలిన వారిపైకి నెట్టేయడానికి చూస్తున్నారు.
జయప్రకాష్ నారాయణ్ చూడండి. లోక్ సత్తా అన్నారు. కూకట్ పల్లి నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఏ నాయకుడైనా నిబద్ధత వుంటే, అక్కడ స్థిరంగా వుండి సేవ చేయాలి కదా. ఇప్పుడు ఎంపీ అంటున్నారు. సమైక్య ఉద్యమ సమయంలో అప్రస్తుత ప్రసంగంలా జగన్‌ను తిడుతూ ఊరూరా తిరిగారు,. బాగానేవుంది. కేజ్రీవాల్ విజయం సాధించగానే అటు దృష్టి పెట్టారు. అవసరమైతే విలీనానికి రెడీ అన్నారు. అమ్ ఆద్మీకి రాష్ర్టంలో సారధ్యం తమదే అన్నంతగా వెళ్లారు. అంతలోనే మోడీ పక్కన చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఫలించలేదు. తేదేపా పొత్తు వుంటుదంటే సమాధానం రాలేదు. విసిగి నామినేషన్ వేసేసారు. తీరా విజయం అవసరం అనుకుని, ఇప్పుడు మళ్లీ మోడీ భజన చేస్తున్నారు.
రాజమౌళి ప్రచారం జెపికి మాత్రమేనా. లోక్ సత్తా అభ్యర్థులు ఇంకెక్కడా లేరా? వారి విజయానికి జెపి ప్రచారం చేయరా? తన విజయం కోసం తహ తహ లాడుతున్న జెపి, పార్టీ అధ్యక్షుడిగా మిగలిన వారికోసం, పార్టీ విస్తృతి కోసం ఏం చేస్తున్నట్లు? ఎందుకిలా మాటలాడుతున్నట్లు?
జెసి దివాకర రెడ్డి. ఆయనకు తెలుగుదేశం బద్ధ శతృవు. ఆయన సోదరుడి బస్సు ప్రమాదం వ్యవహరంలో ఆందోళన జరిపినవారిలో దేశం వారు కూడా వున్నారు కదా? కిరణ్ అధికారంలో వున్నన్నాళ్లు అటు మోసారు కదా? మరి ఇప్పుడు? ఏమైపోయాయి సిద్ధాంతాలు, శతృత్వాలు.
సమైక్యాంధ్ర కోసం విస్తృత పోరాటంపై పేటెంట్ హక్కులు తనవే అన్న తీరు టిజి వెంకటేష్‌ది. సమైక్య ఉద్యమం సాగినన్నాళ్లు, తెలుగుదేశం పార్టీని ఆడిపోసుకోని రోజు లేదు. మరి ఇప్పుడు అక్కడే తలదాచుకోవాల్సి వచ్చింది.
పవన్ కళ్యాణ్ సంగతి సరేసరి. మొదటి సమావేశానికి మూడో సమావేశానికి ముఫై మూడు మార్పులు. ఆఖరికి తేలింది అతగాడు సిద్ద పడింది.. ప్రాణాలకు తెగించింది, గుండెల్లో ధైర్యంతో చీకటి ప్రయాణానికి దిగింది.. తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి అని. మళ్లీ అక్కడ అన్న చిరంజీవిని పల్లెత్తు మాట అనరు. అది ఆయన దృష్టిలో విధి లీల.
ఇలా గడికో మాట.. తడవకో చేతతో అధికారమే పరమావథిగా సాగిపోతున్నారు తెలుగునాట రాజకీయనాయకులు. వీరికి పార్టీలతో సంబంధం లేదు. ఇజాలు, నిజాలు, సిద్ధాంతాలు లేనే లేవు. టికెట్ ఎవరు ఇస్తారు.. ఎలా గెలవాలి? అనేదే పరమావథి. అందుకోసమే తహతహ. దానికి అనుగుణంగానే మాటలు. అందుకు అనుకూలంగానే చేతలు.
కానీ జనమే ఇవేవీ ఆలోచిస్తున్నట్లు కనిపించడం లేదు. నిజంగా ఆలోచిస్తే, ఎవరైనా గెలిచి గట్టెక్కగలరా? అనుమానమే.
– చాణక్య