చంద్రబాబు ప్రభుత్వానికి మళ్లీ రైతుల సెగ మొదలైంది. అయితే ఇది ఇప్పటికిప్పుడు ఆయనకు కానీ, ఆయన ప్రభుత్వానికి కానీ తెచ్చే ముప్పేమీ లేదు. ఇంకా నాలుగేళ్ల సమయం వుంది. మరోసారి రైతుల ముందుకు వెళ్లడానికి. అప్పుడు ఏదో బైరాగి చిట్కా వేసి గట్టెక్కేయచ్చు. కానీ ఇప్పుడు రైతులు మాత్రం లబోదిబో అంటున్నారు. రుణమాఫీ అంటే తమకు బ్యాంకులో వున్న రుణం, అలా అలా మాయం అయిపోతుందని అనుకున్నారు.
అందుకు ఆధార్ లు, రేషన్ కార్డులు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ లు వంటి పదాలు అడ్డం పడతాయని వారికి తెలియదు. అప్పట్లో వారికి ‘పచ్చ’పాత పత్రికల్లో కనిపించిన హెడ్డింగ్ లు అన్నీ ఒకటే….బాబు అధికారంలోకి వస్తే రైతుల రుణాలన్నీ మాఫీ’…ఆ రోజు ఆ తరహా హెడ్డింగ్ ల పెట్టిన బాబు కుడి ఎడమల పత్రికలు ఇప్పుడు మరో తరహా హెడ్డింగ్ లు పెట్టడానికి సాహసించడం లేదు.
రుణమాఫీకి షరతులు పెట్టిన బాబు, రుణమాఫీ హామీకి గండికొట్టిన బాబు అనే హెడ్డింగ్ లు పెట్టడినికి చేతులు రావడం లేదు. పైగా బాబు నేను బాండ్లు ఇస్తా,,మీ రుణాలు మీరు తీర్చుకోండి అని స్పష్టంగా చెబితే. దాన్ని అటు ఇటు తిప్పి, కొత్త రుణాలుగా మార్చుకోండి..మీకు ఆరుశాతం వడ్డీ ఆదా అవుతుంది..అనే విధంగా వార్తలువండి వార్చారు.
ఇప్పుడు వాస్తవానికి రైతుల సెగ ప్రభుత్వానికి తగులుతోంది. పైకి పట్టించుకోనట్లు బింకంగా వుంది అంతే. అందుకే భీమా సొమ్ము తాము తీసేసుకుందామనుకున్న ప్రభుత్వం ఇప్పుడు దిగి వచ్చి వాటిని రైతుల ఖాతాకే మళ్లించేలా జీవో ఇచ్చింది. రుణమాఫీ పై రైతులు ఇప్పుడు బ్యాంకుల మీద దండయాత్ర చేస్తున్నారు. బ్యాంకు సిబ్బందిని బందీలను చేస్తున్నారు. బ్యాంకుల ముందు ఆందోళనలు సాగిస్తున్నారు. ఇవన్నీ దేనికి? తమ తమ రుణాలు మాఫీ కానందున? ఎందుకని కాలేదు అంటే రైతులకు ఈ నిబంధనలు అన్నీ తెలియవు.
బ్యాంకులు తమ రుణాల గురించి బాబు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వలేదు. అందుకే మాఫీ కాలేదు అనుకుంటున్నాయి. వాళ్లకి వివరంగా చెప్పడానికి స్థానికంగా ఎవరూ ముందుకు రావడం లేదు. కాంగ్రెస్, వైకాపా, సిపిఎమ్ నాయకులు టీవీ మైకుల ముందు, పత్రికల ముందు ప్రకటనలు చేసి చేతులు దులుపేసుకున్నారు.
రుణమాఫీ ఆందోళన అలా వుంటే, మరోపక్క రాజధానికి భూములు ఇవ్వాల్సిన రైతులు ఆందోళన కూడా తోడవుతోంది. ఈ రైతుల విషయంలో మార్చినట్లే, తమ విషయంలో మార్చరని గ్యారంటీ ఏమిటన్నది వారి ఆందోళన. అందువల్లనే రాను రాను రైతుల ఆందోళనకు మరిన్ని గొంతులు తోడవుతున్నాయి. దాంతో ఈ వ్యవహారం బిగిసి, మరిన్ని చిక్కులు తెచ్చే లోగానే సరైన లాండ్ పూలింగ్ తో కూడిన రాజధాని చట్టాన్ని తేవాలని ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.
ఇన్ని జరుగుతున్నాబాబు ధీమాగానే వున్నారు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు తనకు రైతులతో పనిలేదు. అయిదేళ్ల తరువాత హామీలు ఇవ్వడానికి తాను, బాకా ఊదడానికి తన పచ్చ పాత ప్రతికలు వున్నాయన్న ధీమా.