చివరి సారి భారత జట్టు ఐసీసీ టోర్నీని సాధించింది ఎప్పుడు? అంటే వీర క్రికెట్ అభిమానులు కూడా సమాధానం చెప్పడానికి తడుముకోవాల్సిందే! ఇండియన్ క్రికెట్ టీమ్ చివరి సారిగి 2011లో ప్రపంచకప్ నెగ్గింది. ఆ తర్వాత రెండు వన్డే వరల్డ్ కప్ లు, పలు టీ20 వరల్డ్ కప్ లు జరిగాయి. అయితే వీటిల్లో ఒక్కటంటే ఒక్కదాన్ని కూడా భారత జట్టు సాధించలేకపోయింది. ఈ పదకొండు సంవత్సరాల్లో చాలా మంది ఆటగాళ్లు మారారు. కెప్టెన్లు మారారు. మొత్తం టీమ్ మారింది. ఒకరిద్దరు ఆటగాళ్లు మాత్రమే కొనసాగుతూ ఉన్నారు. మరి ఇన్ని మార్పు చేర్పులు జరిగినా, జరుగుతున్నా.. అద్భుత విజయాలు మాత్రం లేవు!
అలాగని భారత క్రికెట్ జట్లు పూర్తిగా వైఫల్యం అవుతోందని కాదు. గత దశాబ్దంలో చెప్పుకోదగిన విజయాలు చాలానే ఉన్నాయి. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా మీద రెండు సార్లు టెస్టు సీరిస్ లను నెగ్గింది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలను వరసగా ఆస్ట్రేలియా మీద నెగ్గి తీసుకు వచ్చింది. సౌతాఫ్రికా, ఇంగ్లండ్ లలో కూడా చెప్పుకోదగిన స్థాయిలో టెస్టు విజయాలను సొంతం చేసుకుంది. ఆ దేశాల్లో టెస్టు సీరిస్ లను నెగ్గడం అంటే మాటలేమీ కాదు. అలాంటి గొప్ప విజయాలను భారత జట్టు గత దశాబ్దకాలంలో సాధించింది. అయితే ఎటొచ్చీ ప్రపంచకప్ లలో మాత్రం భారత్ ది ఫెయిల్యూర్ షో గానే కొనసాగుతూ ఉంది.
ప్రతిసారీ సెమిస్ వరకూ వచ్చి ఓడిపోవడం రివాజుగా మారింది. ఒకవైపు బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా వెలుగొందుతూ ఉంది. బోలెడంత దేశవాళీ క్రికెట్ జరుగుతూ ఉంది. ఐపీఎల్ రూపంలో భారత క్రికెటర్లు అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లతో కలిసి ఆడుతున్నారు. దేశవాళీ ఆటగాళ్లకు కూడా అంతర్జాతీయ ఆటగాళ్లతో కలిసి డ్రస్సింగ్ రూమ్ లను పంచుకుంటున్నారు. కలిసి మైదానంలోకి దిగుతున్నారు. బోలెడంత అనుభవాన్ని సంపాదిస్తున్నారు. ఇలాంటి వారికి జాతీయ జట్టులో కూడా వేగంగానే చోటు దక్కుతూ ఉంది.
భారత క్రికెట్ బోర్డు దేశవాళీ క్రికెట్ ను నిర్వహిస్తున్న తీరును విదేశీ మాజీలు కూడా మెచ్చుకుంటూ ఉంటారు. దీని వల్ల దేశంలో క్రికెట్ లో బాగా అభివృద్ధి చెందుతుందని వారు అంటూ ఉంటారు. ఇలా ఎన్ని మెచ్చుగోళ్లు వచ్చినా… అంతిమంగా విజయాలు మాత్రం అపురూపం కావడం లేదు! భారత జట్టుకు ఉన్న వనరులు, టీమ్ కు ఉన్న రిసోర్సెస్ ప్రకారం చూస్తే.. గత దశాబ్దకాలంలో కనీసం రెండు మూడు ప్రపంచకప్ లను ఈ జట్టే ఎగరేసుకుపోయి ఉండాలి!
ఒక దశలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఎలా ప్రపంచ క్రికెట్ ను శాసించిందో ఇప్పుడు భారత జట్టు కూడా అలాంటి ప్రదర్శన ఇవ్వాల్సింది! అయితే.. అలాంటివే జరగడం లేదు. 1999తో మొదలుకుని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు అద్వితీయ ప్రదర్శన చేసింది. తిరుగులేని ఆధిపత్యం చలాయించింది. దశాబ్దాల పాటు టెస్టు, వన్డే క్రికెట్ లలో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగింది. టెస్టుల్లో అయినా, వన్డేల్లో అయినా.. ఓటమిని ఎరుగక అత్యధిక విజయాలను సాధించింది ఆస్ట్రేలియా జట్టు. కాలక్రమంలో ఆ ప్రభ మసకబారింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఆ స్థాయిలో లేదు. మరి ఆస్థాయిని అందుకోవాల్సిన పరిస్థితులు ఉన్నా.. భారత జట్టు మాత్రం అలాంటి విజయపథాన్ని అందుకోలేకపోతోంది.
టెస్టుల్లో భారత జట్టు ప్రదర్శన సంతృప్తికరంగానే ఉంటోంది. వన్డే, టీ20 సీరిస్ ల వరకూ కూడా ఓకే ఓకే! తిరుగులేని విజయపథం కాకపోయినా ఫర్వాలేదు. ప్రపంచకప్ ల లోటు మాత్రం కొనసాగుతూ ఉంది. ఏవేవో జట్లు ఎలాగోలా ప్రపంచకప్ లను సొంతం చేసుకుంటున్నాయి కానీ.. ఇండియా క్రికెట్ జట్టుకు మాత్రం ఇది కష్టసాధ్యంగా కొనసాగుతూ ఉంది. మరి ఈ ప్రపంచకప్ ల కరువు భారత క్రికెట్ కు తీరేదెన్నడో!