ది డిస్కవరీ ఆఫ్ ఇండియా.. దేశానికి ప్రధాని కాకముందే జవహార్ లాల్ నెహ్రూ ఈ పుస్తకాన్ని రచించినట్టుగా ఉన్నాడు. భారతదేశాన్ని తను అర్థం చేసుకున్న వైనం గురించి జవహార్ లాల్ నెహ్రూ ఈ పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకం సంగతేమో కానీ.. దేశానికి నెహ్రూ అర్థమయ్యాడు. ప్రజాస్వామ్య యుతంగా ప్రధానమంత్రి అయ్యాడు. బతికున్నంత వరకూ ఆయనే దేశం మెచ్చింది. నెత్తిన పెట్టుకుంది. ఆయన వారసత్వానికి కూడా బోలెడంత విలువను ఇచ్చింది. నెహ్రూ ఇమేజ్ కాంగ్రెస్ కు శతాయుస్సును ఇచ్చింది. ఆయన కూతురిని ప్రధానమంత్రిని చేసింది. ఆమె కూడా తన శక్తియుక్తులు చాటుకుని దేశానికి గొప్ప నాయకురాలిగా పేర్గాంచింది. ఆమె వారసత్వం ఆమె వారసుడిని ప్రధానిని చేసింది. కాంగ్రెస్ పార్టీ వారి కుటుంబం కనుసన్నల్లో మెలిగేలా చేసింది. ఇలా దశాబ్దాలుగా నెహ్రూ-గాంధీ వారసులకు కాంగ్రెస్ పార్టీ పెరడుగా మారింది. మరి ఈ పెరడులో ఇందిరా, రాజీవ్ లు గొప్ప నాయకులుగా పేరు తెచ్చుకుంటే.. సోనియాగాంధీ తన కనుసన్నల్లో దేశాన్ని నడిపిస్తే.. రాహుల్ మాత్రం ఆ శక్తిని ఇంకా అందుకోలేకపోతున్నాడు!
ప్రస్తుతం రాహుల్ గాంధీ దేశమంతా నడుస్తున్నాడు. కన్యాకుమారితో మొదలుపెట్టి.. కశ్మీర్ వరకూ రాహుల్ గాంధీ యాత్ర చేపట్టారు. ఇప్పటికే ఆ యాత్ర దాదాపు దక్షిణభారతదేశం అంతా పూర్తయ్యింది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ తన పూర్తి ఫిట్ నెస్ ను చాటుకుంటూ ఉన్నాడు. రాహుల్ నడుస్తున్న వేగం కానీ, నడవడంలో ఎక్కడా రాహుల్ గాంధీ వెనక్కు తగ్గకపోవడం కానీ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన ఈ యాత్ర ఇలా ఆశ్చర్యపరుస్తూ ఉంది. రాహుల్ గాంధీ ఇన్నాళ్లకు ఓపిక చేసుకుని.. విహారాలు, అర్ధాంతరంగా మాయం కావడాలు పక్కన పెట్టి.. ఒక పనిపై దృష్టి పెట్టడం ఒక ఆశ్చర్యం అయితే, ఈ పనిలో ఆయన అంత ఫిట్ గా కనిపిస్తూ ఉండటం అన్నింటికన్నా పెద్ద విశేషం అవుతోంది.
ప్రతి రోజూ రాహుల్ గాంధీ ఎక్కువ దూరాన్నే నడుస్తున్నాడు. సామాన్యమైన ఫిట్ నెస్ ఉన్న వాడైతే.. ఒక రోజు ఇరవై కిలోమీటర్ల దూరం నడిస్తేనే రెండో రోజు పడుకుంటాడు. అయితే రాహుల్ రోజులు, వారాలు, నెలల తరబడి నడుస్తున్నారు. ఇప్పటికే రాహుల్ నడిచిన దూరం ఏమీ తక్కువ కాదు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను రాహుల్ గాంధీ దాటేశారు. షార్ట్ కట్ లోనే కావొచ్చు.. మూడు వేల కిలోమీటర్ల దూరానికి పైగా దేశాటన చేస్తున్నారు రాహుల్.
రాహుల్ యాత్ర ఆయనకు ఆరోగ్యం బాగోలేదనో, అలిసిపోయారనో.. కాళ్లకు బొబ్బలెక్కాయనో ఇప్పటి వరకూ ఆగడం లేదు. రాహుల్ నడుస్తున్నారు, నడుస్తున్నారు, నడుస్తూనే ఉన్నారు. రాహుల్ యాత్ర ఇప్పటికే మీడియా అటెన్షన్ ను డ్రా చేస్తోంది. మరి ఇప్పుడు రాహుల్ యాత్రలో కీలకఘట్టం మొదలైనట్టే. అది మహారాష్ట్ర, ఆ పైన ఈ యాత్రకు ఎలాంటి స్పందన వస్తుంది.. ఉత్తరాది రూరల్ లో రాహుల్ కు ఎలాంటి జననీరాజనాలు దక్కుదాయనేదే కీలకమైన విషయం. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం చేజిక్కించుకోవాలంటే దక్షిణాది కన్నా ఉత్తరాదిన మెరుగైన స్థాయిలో సీట్లను పొందడమే కీలకం. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో వచ్చే సారి కాంగ్రెస్ పార్టీ మెరుగైన స్థాయిలో సీట్లను పొందాల్సి ఉంది.
యూపీపై కాంగ్రెస్ ప్రస్తుతానికి ఆశలు పెట్టుకునేది ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడే యూపీలో ఈ పార్టీకి పది లోపు ఎంపీ సీట్లు మాత్రమే ఉండేవి. యూపీలో కనీసం రాహుల్ కూడా గెలవలేకపోయారు క్రితం సారి. ఇలాంటి నేపథ్యంలో.. వచ్చేసారి రాహుల్ మళ్లీ అక్కడ పోటీ చేసి నెగ్గితే అదే గొప్ప ప్రగతి అనుకోవాలి! రాహుల్ పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు కోలుకుంటుందో అనేది ఇప్పటికీ సందేహాస్పదంగా ఉన్న విషయమే!
రాహుల్ యాత్ర ఫలప్రదం కావడం అంటే.. కాంగ్రెస్ పార్టీ దేశంలో కనీసం 150 కి పైగా ఎంపీ సీట్లను నెగ్గడం. ఆ పై దాని మిత్రపక్షాలు కూడా లాభపడటం. కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్, ఛత్తీస్ గడ్, రాజస్తాన్, కేరళ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రతిపక్ష స్థాయిలో తలెత్తుకునేలా ఉంది. ఇప్పటికీ దేశంలో బీజేపీకి కావొచ్చు, ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న వేరే పార్టీలకు కావొచ్చు.. కాంగ్రెస్ పార్టీనే ప్రధాన పోటీదారుగా ఉన్న సీట్లు 300 కు పైనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ సొంతంగా అభ్యర్థులు పెట్టుకోగల ఈ మూడు వందల సీట్లలో 50 శాతం సీట్లను సంపాదించినా రాహుల్ గాంధీ అద్భుతం చేసినట్టే. అయితే.. గత ఎన్నికల్లో ఎంతో పోరాడితే 60 సీట్ల స్థాయిలో దక్కాయి. మరి ఈ నంబర్ ఎప్పుడు 150 వరకూ చేరాలి, అదే సమయంలో కాంగ్రెస్ మిత్రపక్షాలు మరో వందకు పైగా ఎంపీ సీట్లు ఎప్పటికి నెగ్గుకురావాలనేది ఇప్పుడప్పుడే తేలే అంశం కాదు.
స్థూలంగా తన నడకతో రాహుల్ గాంధీ తన ఫిట్ నెస్ ను నిరూపించుకుంటూ ఉన్నాడు. ఈ ఫిట్ నెస్ ఆయనను ప్రధానిగా చేయగలదా అనేది మాత్రం ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నే!