ఆల్‌ రౌండర్‌: త్రిమూర్తులతో లోటు తీరేనా.?

టి20ల్లో ఆల్‌రౌండర్‌ వేరు.. వన్డేల్లో ఆల్‌రౌండర్‌ వేరు.. టెస్టుల్లో ఆల్‌రౌండర్‌ వేరు.. 20 ఓవర్ల మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌ అంటే, జస్ట్‌ బంతిని బాదడం, ఒకటో రెండో వికెట్లు తీయడం. 50 ఓవర్ల మ్యాచ్‌లోనూ కాస్త…

టి20ల్లో ఆల్‌రౌండర్‌ వేరు.. వన్డేల్లో ఆల్‌రౌండర్‌ వేరు.. టెస్టుల్లో ఆల్‌రౌండర్‌ వేరు.. 20 ఓవర్ల మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌ అంటే, జస్ట్‌ బంతిని బాదడం, ఒకటో రెండో వికెట్లు తీయడం. 50 ఓవర్ల మ్యాచ్‌లోనూ కాస్త అటూ ఇటూగా ఆల్‌రౌండర్‌ పని అంతే. కానీ, టెస్టుల్లో పరిస్థితి వేరు. ఆల్‌రౌండర్‌ అంటే వికెట్లు తియ్యాలి.. అవసరమైతే కనీసం 50 పరుగులు చేయగలగాలి.. పరుగులు చేసినా, చెయ్యకపోయినా, మ్యాచ్‌ని నిలబెట్టాలి.. అంటే, క్రీజ్‌లో కుదురుకోవాలి. వికెట్లు తియ్యగలగాలి. 

చాలాకాలంగా టీమిండియాకి సరైన ఆల్‌రౌండర్‌ దొరకలేదు. ఆల్‌రౌండర్లుగా జట్టులోకి వచ్చినవారిని బ్యాటింగ్‌కో, బౌలింగ్‌కో పరిమితం చేసేయడం ద్వారా జట్టు కెప్టెన్‌, సెలక్టర్లు.. ఆయా ఆటగాళ్ళ కెరీర్‌ని నాశనం చేసేసిన సందర్భాలెన్నో వున్నాయి. బహుశా, టీమిండియాకి టెస్టుల్లో సరైన ఆల్‌రౌండర్‌ చాలాకాలంగా దొరక్కపోవడానికి ఇది కూడా ఓ కారణం కావొచ్చు. 

ఎలాగైతేనేం, టీమిండియాకి సరైన ఆల్‌రౌండర్‌ దొరికాడు. ఒకడు కాదు, ఒకడికి ఇద్దరు.. మొత్తం ముగ్గురు ఆల్‌రౌండర్లు దొరికారనే ఆనందం అయితే భారత క్రికెట్‌ అభిమానుల్లో కలుగుతోంది. ఇప్పటికే అశ్విన్‌ ఆల్‌రౌండర్‌గా ప్రూవ్‌ చేసుకున్నాడు. అతనికి తోడు, జడేజా సత్తా చాటుతున్నాడు. కొత్తగా జయంత్‌ యాదవ్‌ కీలకమైన సందర్భంలో జట్టుకి బలంగా నిలిచాడు. 

జడేజా జట్టులో ఎప్పటినుంచో వున్నాడు. మంచి బ్యాట్స్‌మన్‌, మంచి బౌలర్‌, అంతకు మించి మంచి ఫీల్డర్‌. ఏం లాభం.? సర్‌ జడేజా, ఎప్పుడు సరిగ్గా ఆడతాడో ఎవరికీ తెలియని పరిస్థితి. అందుకే, అన్నీ వున్నా అల్లుడి నోట్లో డాష్‌ డాష్‌.. అన్నట్లు తయారైంది జడేజా పరిస్థితి. ప్రస్తుతానికి కుదురుకున్నాడు.. తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడనుకోండి.. అది వేరే విషయం. ఇక, జయంత్‌ యాదవ్‌ బంతితోనూ, బ్యాట్‌తోనూ సత్తా చాటడం టీమిండియాకి పెద్ద ఊరటే. 

టెస్టుల్లో టాప్‌ ఆర్డర్‌ ఎంత ఇంపార్టెంటో, మిడిల్‌ ఆర్డర్‌, లోయర్‌ ఆర్డర్‌, టెయిలెండర్లూ అంతే కీలకం. ఒక్కోసారి మ్యాచ్‌ని నిలబెట్టాల్సిన బాధ్యత టెయిలెండర్ల మీదనే పడుతుంది. పరుగులు చెయ్యక్కర్లేదు, బ్యాట్‌తో మైదానంలో పాతుకుపోతే చాలు.. అనే పరిస్థితులుంటాయి. అలాంటి పరిస్థితుల్లోనే టెయిలెండర్లు బలంగా వుండాలి. జయంత్‌ యాదవ్‌లో ఆ 'బలం' కన్పించింది. అశ్విన్‌ బాగానే అప్‌గ్రేడ్‌ అయ్యాడు. జడేజా కూడా కుదురుకున్నట్లే. 

బ్యాటింగ్‌ మీద శ్రద్ధ పెట్టి, బౌలింగ్‌ని వదిలేస్తాడేమో.. అని అశ్విన్‌ గురించి అంతా అనుకున్నారుగానీ, అశ్విన్‌ మాత్రం బౌలింగ్‌పై పట్టుకోల్పోవడంలేదు. అది చాలా గొప్ప విషయంగా పరిగణించాలి. ఏదిఏమైనా, టీమిండియాకి ఆల్‌రౌండర్‌ దొరికాడు.. ఒకరు కాదు, ముగ్గురు ఆల్‌రౌండర్లు దొరికారు. అయితే, ఈ 'స్ట్రాంగ్‌నెస్‌' ఇలాగే కొనసాగాలి. కొనసాగుతుందా.? విదేశీ పిచ్‌ల మీద అసలు బండారం బయటపడ్తుంది. అప్పటిదాకా, టీమిండియా ఆల్‌రౌండర్ల పరంగానూ స్ట్రాంగ్‌గా వున్నట్లే.