భారత క్రికెట్ జట్టులో చోటు కోసం ఎంతో కాలం వేచి చూసి, ఎట్టకేలకు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కించుకున్న అంబటి తిరుపతి రాయుడు, సరిగ్గా వరల్డ్ కప్ క్రికెట్ పోటీలకు ముందు బీసీసీఐ నిర్లక్ష్యానికి బలైపోయాడు.
వరల్డ్ కప్ ఆడే టీమ్‌లో రాయుడికి చోటివ్వలేదు సెలక్టర్లు. దాంతో, మనోడికి బాగానే ఒళ్ళు మండిపోయింది. కానీ, ఏం చేయగలడు.? గట్టిగా బీసీసీఐనిగానీ, సెలక్టర్లనుగానీ ప్రశ్నించలేడాయె.! అందుకే, ఓ ట్వీటేసి ఊరుకున్నాడు.
ఎవరికి ఎలా అర్థమవ్వాలో అలా అర్థమయ్యేలా అంబటి రాయుడు వేసిన ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెను సంచలనమే సృష్టిస్తోంది. త్రీడీ గ్లాసులకి ఆర్డర్ ఇచ్చా, వరల్డ్ కప్ పోటీల్ని తిలకించడానికంటూ రాయుడు వేసిన ట్వీట్‌ని ఒక్కొక్కరూ ఒక్కోలా అర్థం చేసుకున్నారు.
'చాలా స్పోర్టివ్‌గా తీసుకున్నావ్ గురూ..' అంటూ కొందరు అంబటి 'పెద్ద మనసుని' ఆకాశానికెత్తేశారు. మరికొందరేమో, 'కుక్క కాటుకి చెప్పుదెబ్బలా సెలక్టర్లకు, బీసీసీఐకి సమాధానమిచ్చావ్..' అంటూ రాయుడిని ఇంకోలా మోసేస్తున్నారు.
ఒక్కటి మాత్రం నిజం, అంబటి తిరుపతి రాయుడికి అన్యాయం జరిగింది. విజయ్ శంకర్ అనే ఆల్‌రౌండర్, అంబటి రాయుడికంటే ఎక్కువ స్కోర్ చేశాడన్నది చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ చెబుతున్న మాట.
'బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో' విజయ్ శంకర్ స్కోర్ చేశాడనీ, త్రీ డైమన్షన్‌లో అంబటి వెనకబడ్డాడనీ ఎమ్మెస్కే చేసిన వ్యాఖ్యలకే అంబటి 'త్రీడీ' అంటూ పెర్‌ఫెక్ట్ కౌంటర్ ఇచ్చాడన్నది నిర్వివాదాంశం.
ఇదిలా వుంటే, అంబటి తిరుపతి రాయుడి 'పెయిన్' తాను అర్థం చేసుకోగలననీ, ఇలాంటి రాజకీయాలు తానూ చాలానే ఎదుర్కొన్నానని ఇటీవలే క్రికెట్‌కి గుడ్ బై చెప్పిన టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సోషల్ మీడియా వేదికగా స్పందించడం గమనార్హం.
మరోపక్క, 'అప్పుడే ఆట ముగిసిపోలేదు.. కెరీర్‌కి ఎండ్ కార్డ్ పడిందని భావించొద్దు.. ఇంకా అవకాశం వుంది. ఎవరో ఒకరు గాయాల బారిన పడి, జట్టుకి దూరమవుతారు.. ఆ లిస్ట్‌లో రాహుల్ మిగతావారందరికన్నా ముందుంటాడు.. అది నీకోసమే..' అని అభిమానులు, అంబటి రాయుడికి ధైర్యం నూరిపోస్తున్నారు. అభిమానులు చెబుతున్నట్లు ఈ తెలుగు క్రికెటర్‌కి ఇంకో ఛాన్స్ దొరుకుతుందా? వేచి చూడాల్సిందే.