టీమిండియాలో ఒకప్పుడు 'పెద్దన్న' అంటే సచిన్ టెండూల్కర్ మాత్రమే. జూనియర్లను ఎంకరేజ్ చేయడంలో సచిన్ తర్వాతే ఎవరైనా. కెప్టెన్‌కీ జూనియర్లకీ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందంటే చాలు, పెద్దన్న రంగంలోకి దిగేవాడు. సచిన్ స్టార్‌డమ్ కావొచ్చు, ఇంకొకటి కావొచ్చు… కారణం ఏదైతేనేం, సచిన్ సలహాల్ని పాటించేవారు కెప్టెన్సీ ఎవరి చేతిలో వున్నా సరే. బోర్డుతోనూ సచిన్ 'పెద్దన్న'గానే వ్యవహరించేవాడు.
సచిన్ తర్వాత అప్పట్లో టీమిండియాకి పెద్దన్న పోస్ట్‌కి కుంబ్లేనే సరిపోయేవాడు. కుంబ్లే కేవలం బౌలర్ మాత్రమే కాదు, మంచి మనిషి కూడా. కుంబ్లే భుజాలు అరిగిపోయేలా కెప్టెన్లు అతనితో ఎడాపెడా బౌలింగ్ చేయంచినా, ఎప్పుడూ కుంబ్లే మోములో చిరునవ్వు మాత్రం మిస్ అవలేదు. క్రికెట్‌లో సాధించిన విజయాలు ఒక ఎత్తయితే, వివాద రహితుడిగా కెరీర్‌ని కొనసాగించడం ఇంకో ఎత్తు. ఏ కెప్టెన్‌తోనూ అటు సచిన్‌కిగానీ, ఇటు కుంబ్లేకిగానీ విభేదాలుండేవి కాదు. బోర్డుతోనూ అంతే.
ఇప్పుడిదంతా ఎందుకంటే, కుంబ్లే టీమిండియా కోచ్‌గా ఎంపికయ్యాడు. రేసులో చాలామంది పోటీ పడ్డా, చివరకు ఆ పదవి కుంబ్లేని వరించింది. కుంబ్లే ప్రత్యేకత ఏంటంటే, జూనియర్స్‌లో పోరాట పటిమను పెంచేలా వ్యవహరిస్తాడు. జట్టులో వున్నప్పుడు మొత్తంగా జట్టులో స్ఫూర్తిని నింపాడు. క్రికెట్‌కి దూరమయ్యాక కూడా బోర్డుకి అవసరమైనప్పుడు సలహాలిచ్చాడు. ఎక్కడా వివాదాలకు తావివ్వలేదు.
బ్యాటింగ్ చేసినా, బౌలింగ్ చేసినా, ఫీల్డింగ్ చేసినా ఎప్పుడూ జట్టు ప్రయోజనాల గురించే ఆలోచించిన అతి కొద్ది మందిలో కుంబ్లే ఖచ్చితంగా చోటు సంపాదించుకుంటాడు. ఇన్ని ప్రత్యేకతలున్న కుంబ్లే రికార్డుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రికార్డులకన్నా గొప్పది అతని వ్యక్తిత్వం. ఇలా, ఎన్ని కోణాల్లో చూసినా కుంబ్లే వెరీ వెరీ స్పెషల్. అందుకే, కోచ్ పదవికి అనిల్ కుంబ్లే అన్ని విధాలా అర్హుడు.
ప్రపంచ క్రికెట్‌లో మేటి జట్లలో ఒకటైన టీమిండియాకి టాలెంట్ కొరత లేదు. ఆ టాలెంట్‌కి మరింత పదును పెట్టగల సత్తా కుంబ్లేకి నూటికి నూరుపాళ్ళూ వుంది. సో, ఇకపై టీమిండియా నుంచి మరిన్ని సంచలనాల్ని ఆశించొచ్చు.