అతి త్వరలో టీ20 ప్రపంచకప్ పోటీలు జరగనున్నాయి. ఈలోగా భారత క్రికెట్‌లో పెద్ద కుదుపు తప్పేలా కనిపించడంలేదు. ఆ కుదుపు పేరు మహేంద్రసింగ్ ధోనీ. టెస్టుల నుంచి రిటైర్‌మెంట్ తీసుకున్న ధోనీ, గత కొన్నాళ్ళుగా వన్డేలు, టీ20లనుంచి విరామం తీసుకున్నాడు. తిరిగి జట్టులోకి వచ్చాడు. సౌతాఫ్రికా టూర్‌లో టీమిండియా వన్డే, టీ20లను ఆడనున్న విషయం విదితమే. దీనికి సంబంధించి ఈ రోజు ఆటగాళ్ళ ఎంపిక ప్రక్రియ జరగనుంది.
ప్రస్తుతానికైతే టీమిండియా నుంచి ధోనీని పక్కన పెట్టే పరిస్థితులు లేవు. కానీ, సమీప భవిష్యత్తులో.. అంటే టీ20 ప్రపంచ కప్ ప్రారంభ సమయానికి ఎలాంటి చిత్ర విచిత్రాలైనా చోటుచేసుకోవచ్చు. ప్రస్తుతం టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ పేరు స్థిరపడిపోయింది. దానిక్కారణం, ధోనీ రెస్ట్ తీసుకోవడమే. కెప్టెన్‌గా రెహానే కొన్ని మ్యాచ్‌లు ఆడినా, కోహ్లీ నాయకత్వం గురించి జరిగిన పబ్లిసిటీ అంతా ఇంతా కాదు. అలా ఆటగాళ్ళూ కోహ్లీని కెప్టెన్‌గా ఫిక్సయిపోయారు.
ఇప్పటికిప్పుడు ధోనీ తిరిగి కెప్టెన్‌గా కొనసాగినా, ఎంతోకాలం ఆయన జట్టులో వుండబోడన్న ఖచ్చితమైన సమాచారం ఆటగాళ్ళకు అందేసింది. ఈ క్రమంలో జట్టులోని ఆటగాళ్ళపై ధోనీకి కమాండ్ ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. అలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవడం ధోనీకి అంత తేలికైన విషయం కానే కాదు. అందుకే, హుందాగా ధోనీ వన్డే, టీ20 నుంచి సైతం 'రిటైర్‌మెంట్' తీసుకునే అవకాశాలున్నాయంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.
మరోపక్క, తొలి టీ20ని టీమిండియా దక్కించుకుందంటే, ఆ క్రెడిట్ మొత్తం ధోనీదేననీ, టీ20 వరల్డ్ కప్ తర్వాతే పూర్తిగా క్రికెట్ నుంచి విరామం తీసుకోవచ్చన్న వాదనా లేకపోలేదు. మొత్తమ్మీద, ధోనీ కుదుపుకు సంబంధించిన క్లారిటీ సౌతాఫ్రికా టూర్‌లోనే దొరకవచ్చు.