అనుష్క శర్మపై విరుచుకుపడే వాళ్లు కొందరు.. ఇన్ని రోజులూ పూజలు చేసిన క్రికెటర్ల పోస్టర్లకు పూజలు చేసిన వాటినే తగలబెడుతున్నవారు ఇంకొందరు. తెలివిగా సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో సెటైర్లు పోస్టు చేస్తున్నది మరికొంతమంది. ఇలా ఎవరికి వారు తమ అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు. ఒకవేళ టీమిండియా సెమిస్ లో విజయం సాధించి ఉంటే నీరాజనాలు పలికే వాళ్లే ఇప్పుడు బూతులు తిడుతున్నారు.
మరి ఓడింది మనమేనా.. ఇంకెవరూ లేరా, సెమిస్ స్థాయి వరకూ వచ్చి ఓడిపోయిన వాళ్లూ ఉన్నారు. అందుకు కచ్చితమైన ఉదాహరణ దక్షిణాఫ్రికా. ఆ దేశ క్రికెట్ అభిమానులకు ఇంత వరకూ తీరని కల ప్రపంచకప్. ప్రతిసారీ ఆ జట్టు రకరకాల కారణాల చేత సెమిస్ నుంచి వైదొలుగుతోంది. ఫైనల్ కు చేరలేకపోతోంది. ఈ సారి కూడా అదే జరిగింది.
మరి అలా ఇంటికి వెళ్లిన ఏబీ డివిలీర్స్ టీమ్ కు దక్షిణాఫ్రికా అభిమానులు వెల్కవ్ చెప్పిన తీరు భారతీయులు కచ్చితంగా గమనించాలి. విమానాశ్రయం వరకూ వచ్చి అనేక మంది అభిమానులు తమ ఆటగాళ్లకు స్వాగతం పలికారు. 'మీరే కాదు.. మేమూ బాధపడుతున్నాం.. మిమ్మల్ని ఓదారుస్తున్నాం' అని రాసున్న ప్లకార్డులను ప్రదర్శించారు అభిమానులు. మనదేశంలో క్రికెటర్ల పోస్టర్లు దగ్ధం అవుతుంటే.. అక్కడ మాత్రం చాలా భిన్నమైన స్పందన కనిపించింది.
అయితే టీమిండియా ఓటమికి.. సౌతాఫ్రికా ఓటమికీ చాలా తేడా ఉంది. దక్షిణాఫ్రికా పోరాడి ఓడింది. మనోళ్లు మాత్రం చాలా చిత్తుగా ఓడారు. లక్ష్యాం దరిదాపుల్లోకి రాలేకపోయారు. పదిహేనో ఓవర్ కే ఇండియా ఓటమి ఫిక్సయ్యింది. అలాగాక మనోళ్లూ ధాటిగా పోరాడి ఉంటే.. అభిమానులు కూడా కొంత వరకూ సపోర్టుగా నిలిచేవారు. కానీ ధోనీ సేనకు అంత సీన్ లేకపోయింది! ఏదేమైనా.. ఇప్పుడు ఆగ్రహావేశాలు అనవసరమైనవే.