వీణా-వాణి విభజనకు 10 కోట్లు.?

ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయిందిగానీ, అవిభక్త కవలలు వీణా-వాణిల విభజనకు మోక్షం కలగలేదు. తెలంగాణ ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తే, అతి త్వరలోనే వీణా – వాణి వేరు పడే అవకాశం వుంది. లండన్‌కి…

ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయిందిగానీ, అవిభక్త కవలలు వీణా-వాణిల విభజనకు మోక్షం కలగలేదు. తెలంగాణ ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తే, అతి త్వరలోనే వీణా – వాణి వేరు పడే అవకాశం వుంది. లండన్‌కి చెందిన వైద్యులు, ఇటీవలే హైద్రాబాద్‌లోని నీలోఫర్‌ ఆసుపత్రిలో వీణా – వాణిలను పరీక్షించిన విషయం విదితమే.

తాజాగా లండన్‌ వైద్యులు నీలోఫర్‌ ఆసుపత్రికి లేఖ రాశారు. అందులో వీణా – వాణిలకు శస్త్ర చికిత్స చేయడం వీలుపడ్తుందని పేర్కొంటూ, 10 కోట్ల వరకూ ఖర్చవుతుందనే విషయాన్ని ఆ లేఖ ద్వారా తెలిపినట్లు సమాచారం. పది కోట్లు కాదు, నలభై నుంచి యాభై కోట్లు ఖచ్చయ్యే అవకాశం వుందని గతంలో ఊహాగానాలు వచ్చిన దరిమిలా, ఖర్చు విషయమై సందిగ్ధం అలానే వుంది.

ఇక, వీణా – వాణిలను విభజించేందుకు తాము సిద్ధమని లండన్‌ వైద్యులు ప్రకటించిన దరిమిలా, ఇప్పటికైనా వీణా – వాణి వేరు పడితే అదే చాలని ఈ అవిభక్త కవలల తల్లిదండ్రులు అంటున్నారు. వాస్తవానికి ఎప్పుడో వీణా ` వాణి విభజన జరగాల్సి వుంది. ప్రముఖ వైద్యుడు నాయుడుమ్మ, తన పర్యవేక్షణలో విభజన ఆపరేషన్‌ చేయాలనుకున్నా, అప్పటి ప్రభుత్వాలు అందుకు సానుకూలత వ్యక్తం చేయలేదు. ఆ తర్వాత వివిధ రకాలుగా ప్రయత్నాలైతే జరిగాయిగానీ, ఏ ప్రయత్నంలోనూ చిత్తశుద్ధి కన్పించలేదు.

చిన్నప్పుడే విభజించి వుంటే బాగుండేదనీ, ఇప్పుడు ఆపరేషన్‌ మరింత సంక్లిష్టంగా మారనుందని కొందరు వైద్యులు అభిప్రాయపడ్తున్నారు. పలు దఫాలుగా ఆపరేషన్‌ చేస్తే తప్ప, ఇద్దరు పిల్లలకూ ప్రాణాపాయం లేకుండా వేరు చేయడం కష్టమని లండన్‌ వైద్యులు తేల్చి చెప్పారు. సుమారు ఏడాదిపాటు ఈ ఆపరేషన్ల ప్రక్రియ కొనసాగనుందట.
లండన్‌ వైద్యుల నుంచి వీణా ` వాణి విభజనపై ఓ నివేదిక అందిన దరిమిలా, దానిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదానిపై వీణా ` వాణి భవిష్యత్‌ ఆధారపడి వుంది.