ఆసీస్‌ని పడగొట్టిన కివీస్‌

టైటిల్‌ ఫేవరెట్‌ జట్లు రెండూ తలపడ్డాయి. హోరాహోరీ పోరాటం జరుగుతుందని అంతా ఊహించారు. కానీ విచిత్రంగా ఓ జట్టు చేతులెత్తేసింది. 151 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. కివీస్‌ దెబ్బకి కంగారూలు విలవిల్లాడారు. కివీస్‌ బౌలర్ల…

టైటిల్‌ ఫేవరెట్‌ జట్లు రెండూ తలపడ్డాయి. హోరాహోరీ పోరాటం జరుగుతుందని అంతా ఊహించారు. కానీ విచిత్రంగా ఓ జట్టు చేతులెత్తేసింది. 151 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. కివీస్‌ దెబ్బకి కంగారూలు విలవిల్లాడారు. కివీస్‌ బౌలర్ల ధాటికి ఆసీస్‌ బ్యాటింగ్‌ లైనప్‌ తునాతునకలైపోయిందనే చెప్పాలి.

ఆక్లాండ్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ ఎవరూ అర్థ సెంచరీ చేయలేకపోయారు. చివర్లో హడిన్‌ ఒక్కడే కాస్త ఫర్వాలేదన్పించాడు. 30 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా, కాస్త కుదురుకున్నట్లే కన్పించింది. కానీ 80 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. అప్పుడు మొదలైన వికెట్ల పతనం కొనసాగుతూనే వుంది. చివరికి 151 పరుగులకు అన్ని వికెట్లూ సమర్పించేసుకుంది ఆస్ట్రేలియా.

కివీస్‌ బౌలర్లలో బోల్ట్‌ 5 వికెట్లు తీస్తే, చెరో రెండు వికెట్లు నేలకూల్చారు సౌతీ, వెటోరీ, ఒక వికెట్‌ కోరె అండర్సన్‌కి దక్కింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ బ్యాట్స్‌మన్‌, ఆసీస్‌ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. 3 ఓవర్లకే 39 పరుగులు చేసింది కివీస్‌. అద్భుతాలు జరిగితే తప్ప, ఆసీస్‌పై కివీస్‌ గెలవడం పక్కా.