Advertisement

Advertisement


Home > Movies - Reviews

రివ్యూ: రామా.. ఏమిటీ లీల?

రివ్యూ: రామా.. ఏమిటీ లీల?

రివ్యూ: రామ్‌ లీల
రేటింగ్‌: 1/5

బ్యానర్‌: రామదూత క్రియేషన్స్‌
తారాగణం: హవీష్‌, అభిజిత్‌, నందిత, అలీ, సప్తగిరి, భానుచందర్‌, నాగినీడు, అక్ష తదితరులు
సంగీతం: చిన్నా
కూర్పు: కార్తీక శ్రీనివాస్‌
ఛాయాగ్రహణం: ఎస్‌. గోపాల్‌ రెడ్డి
నిర్మాత: దాసరి కిరణ్‌ కుమార్‌
కథ, కథనం, దర్శకత్వం: శ్రీపురం కిరణ్‌
విడుదల తేదీ: ఫిబ్రవరి 27, 2015

చూసొచ్చిన సినిమా గురించి సమీక్షించుకోవడానికి అక్షరాల కోసం వెతుక్కోవాల్సి వచ్చిందంటే సదరు చిత్రం మాటలకందని అద్భుతమైనా అవ్వాలి... వర్ణనాతీతమైన హింసకైనా గురి చేసుండాలి. ఇది ఏ బాపతు సినిమా అనేది రేటింగ్‌ చూసిన వెంటనే ఒక క్లియర్‌ పిక్చర్‌ వచ్చేసి ఉంటుంది కాబట్టి ఇక విడమరిచి చెప్పట్లేదు. రోట్లో తల పెట్టి రోకటి పోటు గురించి ఏడవకూడదంటారు కదా... అలాంటిదే ‘రామ్‌లీల’ చూసి తల వాచిపోయింది బాబోయ్‌ అని మొత్తుకోవడం కూడా! 

ఏదో టీవీ ఛానల్‌లో భరతనాట్యం, కుంగ్‌ఫూ, బ్రేక్‌డాన్స్‌, క్షుద్ర తాండవం లాంటివేవో మిక్స్‌ చేసి డాన్స్‌ చేస్తుంటుంది నందిత. అమెరికాలో ఆ నాట్యాన్ని వీక్షించిన అభిజిత్‌ అమాంతం ప్రేమలో పడిపోయి.. ఇండియాలో ఉన్న తన పేరెంట్స్‌కి కాల్‌ చేసి ఫలానా ఛానల్‌ పెట్టండని అంటాడు. వారు కూడా సదరు క్షుద్రతాండవం చూసేసి వావ్‌ అనేస్తారు. ‘ఈ అమ్మాయే మీ కాబోయే కోడలు’ అనేస్తాడు. సరాసరి ఇండియాకి వచ్చేసి ఆమెతో పాటు ఒక డాన్స్‌ స్కూల్‌లో జాయిన్‌ అయిపోయి, వారం రోజుల్లో ప్రేమ, పెళ్లి కానిచ్చేస్తాడు.

అమెరికాలో ఉంటే పండక్కీ పబ్బానికీ కూడా ఇంటికి రాలేనని, అదే సింగపూరో, మలేషియానో అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటికెళ్లి రావచ్చునని నందిత అనడంతో అతను ఉన్నపళంగా తన మలేషియా బ్రాంచ్‌కి ట్రాన్స్‌ఫర్‌ చేయించేసుకుంటాడు. కానీ మలేషియా వచ్చీ రాగానే ఒక ఉత్తరం ముక్క పెట్టి చెక్కేస్తుంది నందిత. తనని ప్రేమించిన వాడు మలేషియాలో ఉన్నాడు కనుక అభిజిత్‌ని అలా వాడుకుని అక్కడికి వచ్చిందట. వారం రోజుల క్రితం టీవీలో చూసి ప్రేమించిన అమ్మాయి తనని దారుణాతి దారుణంగా మోసం చేస్తే... ఆమె ప్రేమ మైకంలో మునిగి తేలుతూ తాము ప్లాన్‌ చేసుకున్న హనీమూన్‌కి ఒంటరిగా బయల్దేరతాడు అభిజిత్‌. 

ఆ ట్రిప్‌లో అతనికి హవీష్‌ తగుల్తాడు. ప్లేబాయ్‌ అయిన హవీష్‌ని వదిలించుకోవాలని చూసినా కుదరకపోవడంతో ఒకవైపు అతడ్ని భరిస్తూ... ఇంకో వైపు లేని తన భార్యని ఊహించుకుంటూ హనీమూన్‌ చేసేసుకుంటూ ఉంటాడు అభిజిత్‌. సమయం, సందర్భం లేకుండా ఊడిపడి... అవసరం లేకుండా వేలాడుతున్న పాత్రని చూస్తేనే నందిత బాయ్‌ఫ్రెండ్‌ అని ఊహించడం తెలుగు సినిమా ప్రేక్షకులకి అంత కష్టమేం కాదు. ఇంకా మాట్లాడితే క్లయిమాక్స్‌లో ఏం జరుగుతుందో కూడా హవీష్‌ కథలోకి ఎంటర్‌ కాగానే చెప్పేస్తారు. 

ఇలాంటి విషయ శూన్యమైన కథని సినిమాగా మలచడానికి దర్శకుడు శ్రీపురం కిరణ్‌ అష్టకష్టాలు పడ్డాడు.. చూసే వాళ్లని ‘చిత్ర’ వధకి గురి చేసాడు. కార్డ్‌ బోర్డ్‌ క్యారెక్టర్స్‌తో, కార్టూన్లని తలపించే సిల్లీ ఎమోషన్లతో ఈ చిత్రాన్ని సీరియస్‌గా తీసుకోవడం అస్సలు వీలు కాదు. తనని మోసం చేసిన భార్యపై కోపం రాలేదనడం, ఆమెతో వెళ్లాలనుకున్న ట్రిప్‌కి ఒక్కడే వెళ్లడం వరకు ఓకే కానీ.. మరీ ఆమెని ఊహించుకుంటూ చూపించే ఆ పిచ్చితనం చిరాకు పెడుతుంది. అందులో అతని ప్రేమ తాలూకు లోతు తెలియజెప్తున్నానని దర్శకుడు అనుకుని ఉంటే అంతకంటే పిచ్చితనముండదు. 

అది చాలదన్నట్టు ఇందులో కామెడీ పేరుతో ఇరికించినది కూడా హనీమూన్‌కని పిచ్చోళ్ళ ప్లానెట్‌కి ట్రిప్‌ ప్లాన్‌ చేసాడేమో అనిపిస్తుంది. పెట్రోల్‌ తాగుతూ కార్ల కంటే వేగంగా పరుగెత్తే అలీని చూసి నవ్వు వచ్చిందంటే క్షణం ఆలోచించకుండా ఎవరైనా మాంఛి మానసిక నిపుణుడ్ని కలిసి తీరాలి. మల్టిపుల్‌ పర్సనాలటీ ఉన్నట్టు యాక్ట్‌ చేసే సప్తగిరి పెట్టే కామెడీ టార్చర్‌ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. నేటి తరం ప్రేక్షకులకి సందేశం ఇవ్వడం కోసం పాతికేళ్ల నాటి కథని తెచ్చి సినిమా తీయడంలో లాజిక్కేంటో అర్థం కాదు. 

ప్రేమించిన వాడిని చేరుకోవడానికి ఒకడిని దారుణంగా మోసం చేయడానికి వెనకాడని హీరోయిన్‌... తన ప్రియుడు తననో మాట అన్నాడని వెంటనే అతడ్ని వదిలేసి తను మోసం చేసిన వాడి దగ్గరకి తిరిగొచ్చేసి వాటేసుకుంటుంది. ఇలాంటి యువతి కోసం హీరోలిద్దరూ త్యాగాల మీద త్యాగాలు చేసేస్తుంటే వారు గొప్ప ప్రేమికుల్లా కాక బాగా డెస్పరేట్‌గా ఉన్నారనిపిస్తుంది. మొదటి సినిమాలోనే చాలా బాగా నటించి మార్కులు కొట్టేసిన నందిత కూడా ఇందులో ఎలిమెంటరీ లెవల్‌ నటిలా కనిపించిందంటే ఇక మిగిలిన వారి గురించి చెప్పుకోవడం కూడా దండగే. 

అతీ గతీ లేకుండా సాగిపోయే ఈ అవక తవక సినిమాలో చెప్పుకోతగ్గది ఏమైనా ఉంటే అది గోపాల్‌రెడ్డి సినిమాటోగ్రఫీ, ఈ సినిమాపై నిర్మాత పెట్టిన ఖర్చు మాత్రమే. విజువల్స్‌ క్వాలిటీగా ఉన్నాయనే పాజిటివ్‌ పాయింట్‌ తప్పిస్తే ఈ లీలని చివరి దాకా భరించడానికి ఇంకో ఎలిమెంటే లేదంతే. కష్టపడి సంపాదించిన డబ్బుని ఇలాంటి సినిమా చూడ్డానికి ఖర్చు పెట్టినందుకు మిమ్మల్ని మీరు శిక్షించుకోవడానికి తప్పిస్తే దీనిని చివరి వరకు చూడ్డానికి కారణమే కనిపించదు. రెండు గంటల పాటు నవ నాడులపై జరిగే ఈ క్రియేటివ్‌ దాడిని తట్టుకోవడం మానవమాత్రుల తరం కాదు.  

 బోటమ్‌ లైన్‌: రామా.. ఏమిటీ లీల?

-గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?