బీసీసీఐలో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు అన్నట్టుగా ఉంది వ్యవహారం. స్పాట్ ఫిక్సింగ్ అంటూ ఆగమేఘాల మీద అనేక మంది క్రికెటర్లపై వేటు వేశారు. ఐపీఎల్ మ్యాచ్ లలో వాళ్లంతా అవినీతికి పాల్పడ్డారని.. బుకీలతో ఒప్పందాలు చేసుకొని వీరు వాళ్లకు అనుగుణంగా ఆడారన్న ఆరోపణలతో అందరినీ క్రికెట్ నుంచి దూరం పంపించారు. తీరా వాళ్ల కెరీర్ అంతా ముగిసిపోయింది అనుకొంటున్న తరుణంలో సాక్ష్యాధారులు లేవన్న కారణంతో ఆటగాళ్లందరిపైనా వేటు ఎత్తేశారు! ఆటగాళ్లపై వేటు వేసినప్పుడు భారీ ఎత్తున కనిపించిన సాక్షాధారాలు.. తీరా కోర్టులో మాత్రం ఎందుకు కనిపించలేదో అర్థం కాని పరిస్థితి. ఏదేతేనేం.. ఈ వ్యవహారంలో ఏదో నిజమో.. ఏది అబద్దమో అర్థం కాని పరిస్థితి.
ఇదిలా ఉంటే.. సస్పెన్షన్ ను ఎదుర్కొంటున్న చెన్నై, రాజస్థాన్ ఐపీఎల్ టీమ్ ల విషయంలో కూడా ప్రత్యామ్నాయాలను సిద్ధం చేస్తున్నారట. ఎటుతిరిగీ ఐపీఎల్ ను ఎనిమిది టీమ్ లతో ఆడించాలని భావిస్తున్న బీసీసీఐ ఈ విషయంలో అనేక ప్రయత్నాలను చేస్తోంది. ఈ ప్రయత్నాల్లో భాగంగా టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి బంపర్ ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
చెన్నైసూపర్ కింగ్ యాజమాన్య బాధ్యతలను తీసుకోవాలని ధోనీని కోరిందట బీసీసీఐ. ఐపీఎల్ ఆది నుంచి చెన్నై టీమ్ కే ప్రాతినిధ్యం వహిస్తున్న ధోనీని.. యాజమాన్య బాధ్యతలు కూడా తీసుకొమ్మని కోరుతోందట. ధోనీకి ఎలాగూ రితీ స్పోర్ట్స్ అంటూ ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ తరపునన రెండేళ్ల పాటు ఈ జట్టు బాధ్యతలు తీసుకోవాలని కోరుతున్నారట బీసీసీఐ పెద్దలు. మరి ఈ విషయంలో ధోనీ కూడా సానుకూలంగా ఉండవచ్చనే అంటున్నారు. మరి ఆయన ఎంత చెడ్డా జాతీయ జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు… ఆయనకు ఐపీఎల్ టీమ్ బాధ్యతలు ఏమిటి? అంటే.. బీసీసీఐ వ్యవహారాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు కదా! అనే విషయాన్ని గుర్తు చేయాలి.