ఒలింపిక్స్ పోటీల విషయం లో ఏనాడూ లేనంత ఆశావాదంతో ఉంది భారత్. ఒక్కొక్క ఒలింపిక్స్ కూ క్రమంగా మెరుగుపడుతున్న ప్రదర్శన నేపథ్యం.. ఈ సారి ఏకంగా 118 మంది అథ్లెట్లు టీమిండియాలో ఉండటంతో.. ఈ సారి పాత రికార్డులు చెదిరిపోయే స్థాయిలో పతకాలు వస్తాయని భారతీయులు ఆశిస్తున్నారు. మరి ఈ ఆశలు ఏ మేరకు నెరవేరతాయో తెలిసిపోయే సమయం వచ్చేసింది.
ఈ శనివారం జరిగే వివిధ పతకాంశాల్లో రెండు పతకాల విషయంలో ముగ్గురు భారతీయ క్రీడాకారులు పోటీలో ఉన్నారు. గత ఒలింపిక్స్ లో భారత్ కు పతకాలిచ్చిన షూటింగ్ విభాగంలో నేడు ఈ పోటీ జరగుతుండటంతో భారత్ ఖాతా తెరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. పది మీటర్ల ఎయిర్ పిస్టల్ లో జీతూ రాయ్ పోటీలో ఉన్నాడు. పది మీటర్ల ఎయిర్ రైఫిల్ లో అపూర్వీ చండేలా, అయోనికాపాల్ లు పోటీలో ఉన్నారు. ఈ పోటీల్లో పతాకాలు ఎవరికి అనేది క్లారిటీ వస్తుంది కాబట్టి.. ఈ రోజు ఒలింపిక్స్ భారతీయులకు ఆసక్తికరమైనవే.
అలాగే.,. పతకావశాలు కలిగిన హాకీ టీమ్ కూడా తమ తొలి మ్యాచ్ ను ఇదే రోజు ఆడనుంది. ఐర్లాండ్ తో భారత్ తలపడనుంది. టెన్నిస్ పురుషుల డబుల్స్ లో బొపన్నా-పేస్ ల జోడి తమ తొలి మ్యాచ్ ను ఆడనుంది. మహిళ డబుల్స్ లో తొలిరౌండ్ మ్యాచ్, టేబుల్ టెన్నిస్ లో రెండు ఆరంభ మ్యాచ్ లు, రోయింగ్.. తదితర పోటీల్లో భారతీయ క్రీడాకారులు పోటీలో ఉన్నారు. ఈ మ్యాచ్ లన్నీ భారత కాలమానంలో సాయంత్రం వేళ జరుగుతున్నాయి. దూరదర్శన్ నేషనల్ ఛానల్ లో ఈ మ్యాచ్ ల లైవ్ ఉంటుంది.