టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న కొలంబో టెస్ట్‌లో పలితం తేలేలానే కన్పిస్తోంది. తొలిరోజు వర్షం కారణంగా దాదాపు రెండు సెషన్లపాటు మ్యాచ్ అటకెక్కగా, రెండోరోజు మాత్రం మ్యాచ్ రసవత్తరంగా సాగింది. పిచ్ బౌలింగ్‌కి అనుకూలించడంతో లంక బౌలర్లు చెలరేగిపోయారు. ఫలితంగా టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 292 పరుగులు చేసింది రెండోరోజు ఆట ముగిసే సమయానికి.
ఇక మూడోరోజు ఆట ప్రారంభమైన కాస్సేపటికే టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. టీమిండియా 312 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక, చకచకా వికెట్లు కోల్పోయింది. చివర్లో హెరాత్, పెరీరా భారత బౌలర్లను కాస్సేపు నిలువరించగలిగారు. ఫలితంగా 201 పరుగులు చేసిన లంక ఆలౌట్ అయ్యింది. ఇషాంత్ శర్మ ఐదు వికెట్లు తీసుకున్నాడు.
తొలి ఇన్నింగ్స్‌లో 111 పరుగుల ఆధిక్యం సాధించిన టీమిండియా, రెండో ఇన్నింగ్స్ ప్రారంభిస్తూనే టపటపా వికెట్లు కోల్పోయింది. సింగిల్ డిజిట్ స్కోరుకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది టీమిండియా. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చేలరేగిన టీమిండియా బ్యాట్స్‌మన్ పుజారా డకౌట్ అవడం విశేషం. లోకేష్ రాహుల్, రహానే నిరాశపర్చారు. కోహ్లీ, రోహిత్‌శర్మ క్రీజ్‌లో వున్నారు మూడో రోజు ఆట ముగిసే సమయానికి. 21 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా, ఇంకో 200 పరుగులు అదనంగా చేస్తే తప్ప లంకపై పట్టు సాధించలేని పరిస్థితి.
కాగా, బ్యాటింగ్‌లో ఫెయిలయినా లంక, బౌలింగ్‌లో ఆదరగొట్టేసిందనే చెప్పాలి. టీమిండియాని అతి త్వరగా ఆలౌట్ చేస్తే, మ్యాచ్ లంక చేతుల్లోకి వెళుతుంది. మూడో రోజు సైతం వరుణుడు కాస్సేపు ఇబ్బంది పెట్టడంతో మ్యాచ్ ఫలితంపై అనుమానాలు లేకపోలేదు.
మొత్తంగా ఈ రోజు (మూడో టెస్ట్ మూడో రోజు) 15 వికెట్లు పడ్డం బౌలర్లకు పిచ్ ఏ స్థాయిలో అనుకూలిస్తోందో చెప్పడానికి నిదర్శనం. ఇటు టీమిండియా, అటు లంక.. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ దక్కించుకోవాలన్న కసితో వున్నాయి. మ్యాచ్ ఎవరి పక్షాన నిలుస్తుందో వేచి చూడాల్సిందే.