మన రాష్ట్రంలోనే ఓ మార్కెట్ సొసైటీ..అక్కడ అమ్మే ఉత్పత్తిపై రెండు పైసలు మినహాయించి పక్కన పెడుతుంది. దాంతో కాలేజీలు, ఆసుపత్రులు నిర్వహిస్తుంది. గల్ఫ్ వార్ టైమ్ లో ఆర్టీసీ టికెట్ పై కొన్ని పైసలు అదనంగా సర్ చార్జి వేసారు. చిల్లర శివా లక్ష్మి అని ఊరికినే అనలేదు. ఎయిర్ టెల్, ఐడియాలాంటి భారీ సంస్థలు సిమ్ కు కోన్ని పైసలు అంటూ పక్కన పెట్టినా కోట్లయి కూర్చుంటాయి.
ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఈ విధంగా ఆలోచించాల్సిన రోజుల వచ్చాయి. నలభై నుంచి యాభై రూపాయిల మధ్యలో బియ్యం ధర వుంటే రూపాయికి ఇస్తున్నాయి. ఏటా వేల కోట్ల రూపాయిలు సబ్సిడీల పేరుతో పంచేస్తున్నాయి. చంద్రన్న కానుక అంటూ ఫ్రీగా వందల కోట్లు పంచేస్తున్నారు. ఈ వేల కోట్లు, వందల కోట్లను కాస్త తగ్గించినా ప్రభుత్వ ఆసుపత్రులు, బళ్లు బాగుపడిపోతాయి.
ఉదాహరణకు చంద్రన్న కానుక అంటూ ఫ్రీగా ఇచ్చేసే బదులు, పది రూపాయిలు వసూలు చేయండి..ఏ మండలంలో అలా వసూలయిన మొత్తం ఆ మండలంలో పాఠశాలల అభివృద్ధికి ఇచ్చేయండి..ప్రభుత్వం ఎలాగూ ఫ్రీగా ఇవ్వదలచింది కదా. ఇంకా ఆ ఆదాయం ప్రభుత్వానికి అక్కరలేదు. మూడు వందల రూపాయిల సరకులు పది రూపాయిలకు వస్తుంటే జనం కూడా మాట్లాడరు. ఏటా నాలుగు సార్లు మండలంలో పాఠశాలలకు నిధులు అందుతాయి.
అలాగే రూపాయికి ఇస్తున్న కిలో బియ్యాన్ని మళ్లీ రెండు రూపాయలు చేయండి. అలా ఏ మండలంలో వచ్చిన ఆదాయాన్ని అదే మండలంలో ఆసుపత్రులకు ఇచ్చేయండి. ఎలాగూ సబ్సిడీ భరించడం అలవాటైపోయింది కదా. పైగా ఇలా పెంచితే ప్రతిపక్షాలు కూడా నోరెత్తలేవు. జనమే ఛీ అంటారు. పైగా ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కేటాయించనక్కరలేదు.
మద్యం ఒక్క సీసా మీద రూపాయి అదనంగా వసూలు చేయండి..ఏ మండలంలో అమ్మకాలపై వచ్చిన ఆ 'రూపాయి'లు ఆ మండలానికే ఇవ్వండి..ఇలా వీలయిన చోట్ల, రూపాయి జోడించండి. కానీ నిధులను రాష్ట్రానికి తీసుకెళ్లకూడదు. వెళ్తే, ఇక అంతే సంగతులు, మహా సముద్రంలో కలిసినట్లే. జిల్లా కాదు, మండల స్థాయిలోనే వుంచాలి.
వీలయింతే మండల స్థాయిలో ఎమ్మెల్యే, మండలాధ్యక్షుడు, జెడ్పీటీసీ, ఎమ్మార్వో, ఎండీవోలతో కమిటీ వేయాలి. ఆ నిధులు మండల అవసరాలకు ప్రయారిటీతో ఖర్చు చేయాలి. అయిదేళ్లు ఇలా చేసి చూడండి. ప్రభుత్వం ఇచ్చే నిధులకు అదనంగా ఈ నిధులు తోడయితే పనులు ఎలా జరుగుతాయో? కానీ వ్యక్తిగత లబ్ది చేకూర్చి, వారి నుంచి ఓట్లు గుంజి అధికారం సంపాదించాలనుకునే రాజకీయ పార్టీలకు ఇలాంటి ఐడియాలను చెవికెక్కవు.