సచిన్ టెండూల్కర్.. పరిచయం అక్కర్లేని పేరిది. చిన్న కుర్రాడిని పట్టుకుని, నువ్వు పెద్దయ్యాక ఏమౌతావురా.? అనంటే, ఫలానా సినిమా హీరోనవుతానని చెప్పే రోజులు పోయి, నేను సచిన్ టెండూల్కర్నవుతా.. అనేంతలా క్రికెట్‌కి దేశంలో క్రేజ్ పెంచిన 'క్రికెట్ దేవుడు' సచిన్ టెండూల్కర్. క్రికెటర్‌గా యాక్టివ్‌గా వున్న కాలంలో, రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూనే వున్నాడు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాక, అడపా దడపా మాత్రమే మీడియా ముందుకొస్తున్నాడు సచిన్.
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలోగల పుట్టంరాజు కండ్రిగ అనే గ్రామాన్ని సచిన్ టెండూల్కర్ దత్తత తీసుకున్నాడు కొన్నాళ్ళ క్రితమే. దేశంలో చాలామంది ఎంపీలు చాలా గ్రామాల్ని దత్తత తీసుకున్నారు. పలువురు సినీ ప్రముఖులూ కొన్ని గ్రామాల్ని దత్తత తీసుకున్నారు. కానీ, చాలా తక్కువమందే దత్తత తీసుకున్న గ్రామాలపై దృష్టిపెట్టారు. అందులో ఖచ్చితంగా సచిన్ టెండూల్కర్ పేరు ముందు వరుసలో వుంటుంది.
ఇప్పుడు పుట్టంరాజు కండ్రిగ గ్రామస్తులకు సచిన్ టెండూల్కర్ నిజంగానే దేవుడు. ఎందుకంటే, గ్రామాన్ని దత్తత తీసుకున్నది మొదలు, ఆ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల్ని పర్యవేక్షిస్తూనే వున్నాడు. వీలు చిక్కినప్పుడల్లా ఆ గ్రామాన్ని సందర్శిస్తూ గ్రామస్తులతో మమేకమవుతున్న సచిన్‌ని చూసి అంతా ముక్కున వేలేసుకోవాల్సి వస్తోంది. సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తోన్న విషయం విదితమే. స్పోర్ట్స్ కేటగిరీలో సచిన్‌ని రాజ్యసభకు కాంగ్రెస్ నామినేట్ చేసింది.
తాజాగా పుట్టంరాజు కండ్రిగ గ్రామంలో పర్యటించిన సచిన్, అక్కడి యువతతో మాటామంతీ జరిపాడు. ఇంకేముంది, యువత ఆనందానికి హద్దే లేకుండా పోయింది. భద్రతా సిబ్బంది, సచిన్‌ని కలిసేందుకు వచ్చినవారిని అదుపుచేసేందుకు ప్రయత్నించినా, సచిన్.. భద్రతా సిబ్బందిని వారించి.. గ్రామస్తుల్ని పలకరించాడు. సచిన్ ఇంతలా తమ గ్రామం పట్ల చూపుతున్న శ్రద్ధకి పుట్టంరాజు కండ్రిగ వాసులు ఫిదా అయిపోతున్నారు.