యూరోపియన్లకు ఫుట్ బాల్ పై ఉన్న క్రేజ్ ఏమిటో చెప్పనక్కర్లేదు. ప్రత్యేకించి ఇటలీ, జర్మనీ, స్పెయిన్ వంటి దేశాల్లో ఫుట్ బాల్ అంటే ఎంతో అభిమానం. ఆ దేశాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువ జరిగింది కూడా ఒక ఫుట్ బాల్ మ్యాచ్ ఫలితంగానే అనే అభిప్రాయాలున్నాయి. అయితే ఇప్పుడు యూరప్ దేశాలు కోలుకుంటున్నాయి. మళ్లీ తమ యాక్టివిటీస్ మొదలుపెడుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ సాకర్ మ్యాచ్ లు కూడా జరగబోతున్నాయని తెలుస్తోంది.
ఖాళీ స్టేడియంలలో మ్యాచ్ లను నిర్వహించనున్నారని సమాచారం. జనాలు లేకుండా .. కేవలం ఆటగాళ్లు మాత్రమే స్టేడియంలో కనిపిస్తారు. లైవ్ టెలికాస్ట్ ద్వారా ప్రేక్షకులకు ఫుట్ బాల్ వినోదం అందించేందుకు రంగం సిద్ధం అవుతూ ఉందట.
ఈ క్రమంలో క్రికెట్ మ్యాచ్ లు కూడా ఈ తరహాలో జరుగుతాయా? అనే చర్చకు ఆస్కారం ఏర్పడుతూ ఉంది. కరోనా లాక్ డౌన్ మొదలయ్యేందకు కాస్త ముందు ఇండియాలో ఒక వన్డే సీరిస్ జరగాల్సింది. అప్పటికి దక్షిణాఫ్రికా జట్టు ఇండియాకు వచ్చింది. తొలి వన్డేకు వర్షం ఆటంకం ఏర్పడటంతో జరగలేదు. అయితే రెండో వన్డేను జనం లేకుండా కేవలం ఆటగాళ్లతో నిర్వహించాలని భావించారు, కానీ సౌతాఫ్రికా జట్టు తిరుగుముఖం పట్టింది. దీంతో ఆ సీరిస్ రద్దు అయ్యింది.
ఇక షెడ్యూల్ ప్రకారం.. ఈ పాటికి ఐపీఎల్ జరగాల్సింది. ఇప్పుడప్పుడే దాని ఊసు లేనట్టే. ఎప్పుడు జరుగుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఈ క్రమంలో కరోనా ప్రభావం కాస్త తక్కువగానే ఉన్న ఆస్ట్రేలియాలో మ్యాచ్ ల గురించి చర్చ మొదలైంది. ఇండియా తో టెస్టు సీరిస్ మీద ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డు చాలా ఆశలు పెట్టుకుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అది జరిగేలా లేదు. ఈ నేపథ్యంలో.. జనం లేకుండా ఆటగాళ్లతో మ్యాచ్ లను నిర్వహించడానికి కూడా ఆసీస్ క్రికెట్ బోర్డు సై అనేలా ఉంది.
లైవ్ టెలికాస్ట్ ద్వారా బోలెడంత ఆదాయం వస్తుంది. కాబట్టి ఆ తరహాలో నిర్వహణకు రెడీ అనేలా ఉంది. ఆసీస్ వెళ్లడానికి ముందు, వెళ్లిన తర్వాత ఆటగాళ్లను నిర్ధిష్టమైనన్ని రోజులు క్వారెంటైన్ లో ఉంచి.. మ్యాచ్ లు ఆడించాలనే ప్రతిపాదన ఒకటి వినిపిస్తూ ఉంది. ఎలాగోలా సురక్షితంగా మ్యాచ్ లను నిర్వహించడానికి ఆయా దేశాల క్రికెట్ బోర్డులు ముందున్న మార్గాల గురించి చర్చ మొదలుపెట్టే సమయం వచ్చినట్టుంది!